You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
COP25 సదస్సు ప్రారంభం... పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్రధాన దేశాలు స్పందించాలన్న ఐరాస
- రచయిత, మేట్ మెక్‌గ్రాత్
- హోదా, పర్యావరణ ప్రతినిధి, మాడ్రిడ్
పర్యావరణ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రెండు వారాల పాటు సమావేశమవుతున్నారు.
డిసెంబరు 2 నుంచి 13 వరకు ఈ వాతావరణ సదస్సు నిర్వహిస్తున్నారు.
పర్యావరణ ఉత్పాతం కారణంగా ఆఫ్రికాలో లక్షల మంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని 'సేవ్ ద చిల్డ్రన్' సంస్థ పేర్కొంది. తుపాన్లు, కరవుల వల్ల 3.3 కోట్ల మంది ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆ సంస్థ తెలిపింది.
కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్(కాప్ 25) పేరిట తలపెట్టిన ఈ వాతావరణ సదస్సు తొలుత చిలీలో నిర్వహించాలనకున్నప్పటికీ ఆ దేశంలో అంతర్గత ఘర్షణల వెనక్కి తగ్గారు.
దీంతో, స్పెయిన్ ఈ సదస్సు నిర్వహణకు ముందుకొచ్చింది. రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో 29 వేల మంది పాల్గొంటున్నారు.
ఈ సదస్సుకు ముందు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. వాతావరణ సంక్షోభం ప్రమాదకర స్థాయిలో ఉందని, రాజకీయ నాయకులు స్పందించాలని అన్నారు.
''అత్యంత కీలకమైన రానున్న 12 నెలల్లో మరింత ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణమైన దేశాల నుంచి దీన్ని ఎక్కువగా ఆశిస్తున్నాం. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించే దిశగా ఆ దేశాలు సత్వరం చర్యలు చేపట్టాలి'' అన్నారు.
''పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రకృతి ఆధారిత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల''న్నారాయన.
దాదాపు ప్రపంచ దేశాలన్నీ పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేసి, ఆమోదించాయి. ఆ ఒప్పందం ప్రకారం 2020 ముగిసేలోగా కొత్త వాతావరణ ప్రతిజ్ఞలను అందివ్వాలి.
మాడ్రిడ్‌లో జరిగిన ఈ సమావేశం 12 నెలల చర్చల ప్రారంభానికి సంకేతం.. వచ్చే ఏడాది నవంబరులో గ్లాస్గోలో జరగబోయే COP26తో ముగుస్తుంది ఇది.
మాడ్రిడ్ సమావేశానికి 50 మంది ప్రపంచ నాయకులు హాజరవుతారని అంచనా. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేయడంతో డోనల్డ్ ట్రంప్ దీనికి హాజరు కావడం లేదు. అయితే, ఆ దేశ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో కలిసి హాజరువుతున్నారు.
నాన్సీ పెలోసీ హాజరును స్వాగతిస్తూ వాతావరణ మార్పుల విషయంలో అమెరికా గట్టి చర్యలకు ఉపక్రమించాలని పర్యావరణవేత్తలు కోరుకుంటున్నారు.
''వాతావరణ అత్యవసర పరిస్థితి రావడానికి బాధ్యులైన దేశాల్లో ముందున్నది అమెరికానే. అయితే, దీనికి బాధ్యత వహించడానికి మాత్రం డెమొక్రటిక్ నేతలు ఇష్టపడరు'' అని యూఎస్ సెంటర్ ఫర్ బయలాజికల్ డైవర్సిటీకి చెందిన 'జీన్ సు' అన్నారు.
ధార్మిక సంస్థ 'సేవ్ ద చిల్డ్రన్' విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడడం, కరవు, తుపాన్లు వంటివి దక్షిణ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో 3.3 కోట్ల మందిని ఆహార అభద్రతలోకి నెడుతున్నాయి. ఇందులో సగం కంటే ఎక్కువ మంది చిన్నారులే.
ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను రెండు బలమైన తుపాన్లు తాకడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఇదాయ్ తుపాను ధాటికి మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలమయ్యాయి. అక్కడి ఆరు వారాల తరువాత కెన్నెత్ తుపాన్ మళ్లీ మొజాంబిక్‌ను దెబ్బతీసింది. వరుస తుపాన్ల వల్ల లక్షలాది మంది వరదల్లో చిక్కుకుని తిండి లేక అల్లాడారు.
''వాతావరణ సంక్షోభం ప్రభావం ఇక్కడ పడుతోంది. అది ప్రజలను చంపుతోంది. ఇళ్లను వీడేలా చేస్తోంది. వారి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది'' అని సేవ్ ద చిల్డ్రన్ సంస్థకు చెందిన ఇయాన్ వాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- నీటిపై తేలియాడే వెనిస్ను ముంచెత్తిన వరదలు
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
- అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ
- పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు యూఎన్‌కు స్పష్టం చేసిన అమెరికా
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
- దిల్లీ కాలుష్యం: పొల్యూషన్ మానిటర్స్‌కు అందని స్థాయిలో విష వాయువులు
- పొలార్ స్టెర్న్ నౌక: ఆర్కిటిక్ మంచు సముద్రంలో వాతావరణ మార్పులపై 600 మంది శాస్త్రవేత్తల పరిశోధన
- మోదీ ప్రభుత్వం వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు ఏం చేసింది?
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- ఎ68: కదులుతున్న అతిపెద్ద హిమఖండం, చివరికి ఏమవుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)