అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?

భూగోళంపై వాయుకాలుష్య నియంత్రణలో, ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కోవడంలో అమెజాన్ అడవుల పాత్ర కీలకమైనది. ఈ అడవుల్లో ఇటీవల కార్చిచ్చులు పెరిగిపోయాయి. దీనికి కారణం అడవుల నరికివేతేనని బ్రెజిల్‌లోని అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ (ఐపామ్), ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ ఎకర్ జరిపిన కొత్త అధ్యయనం తెలిపింది.

ఐపామ్ బ్రెజిల్ రాజధాని బ్రెసీలియా కేంద్రంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ.

అమెజాన్ ప్రాంతంలో అడవుల నరికివేత అత్యధికంగా ఉన్న పది మున్సిపాలిటీల్లోనే ఈ ఏడాది కార్చిచ్చులు అత్యధికంగా ఉన్నాయి.

బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలో కరవు ఉందని, ఈ ఏడాది కార్చిచ్చులకు ఇదే కారణమని, ఇది సహజమేననే వాదన ఉంది.

అడవుల నరికివేతకూ, కార్చిచ్చులకూ సంబంధముందనే అధ్యయనం ఈ వాదనను తోసిపుచ్చింది.

కార్చిచ్చుల సంఖ్య పెరగడానికి కరవును ప్రధాన కారణంగా చెప్పలేమని అధ్యయనం తెలిపింది.

గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కరవు తీవ్రత తక్కువగా ఉందని చెప్పింది. ఆ సంవత్సరాల్లో కార్చిచ్చుల సంఖ్య తక్కువగా ఉంది.

2019లో 37 శాతం కార్చిచ్చులు ఈ పది మున్సిపాలిటీల్లోనే సంభవించాయని, జులై వరకున్న సమాచారం ప్రకారం అడవుల నరికివేతలో 43 శాతం ఈ మున్సిపాలిటీల పరిధిలోనే జరిగిందని అధ్యయనం వివరించింది.

కొత్తగా అడవులను నరికేసిన కరవు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కార్చిచ్చులు తీవ్రంగా ఉన్నాయని అధ్యయనం చెప్పింది. చెట్లను నరికాక పచ్చదనం ఎండిపోయిన తర్వాత తగలబెట్టడమే దావాగ్నికి కారణమని తెలిపింది.

ఆ 10 మున్సిపాలిటీలు ఏవంటే- అమెజోనాస్ రాష్ట్రంలోని అపూయి, లాబ్రియా, న్యూ అరిపుయానా; పారా రాష్ట్రంలోని అల్టేమిరా, ఇటాయ్‌టుబా, సావో ఫెలిక్స్ డో గ్సింగు, నోవో ప్రోగ్రెసో; మాటో గ్రాసో రాష్ట్రంలోని కోల్నిజా; రొండోనియాలోని పోర్టో వెల్హో; రోరైమా రాష్ట్రంలోని కరాకరాయి.

ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు అడవుల నరికివేత వివరాలను, జనవరి నుంచి ఆగస్టు 14 వరకు సంభవించిన కార్చిచ్చులను ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకొంది.

నోవో ప్రోగ్రెసో లాంటి కొన్ని మున్సిపాలిటీల పరిధిలో రైతులు పచ్చిక బయళ్లను తగులబెట్టేందుకు ఆగస్టు 10వ తేదీని ప్రత్యేకంగా 'ఫైర్ డే'గా పాటించారనే సమాచారం ఉంది.

మంటలు చెలరేగిన రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాల్లో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా 2019లో కార్చిచ్చులు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 14 నాటికే 32,728 కార్చిచ్చులు సంభవించాయని, 2016, 2017, 2018 సంవత్సరాల్లో ఆగస్టు వరకు నమోదైన కార్చిచ్చుల సగటుతో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం ఎక్కువని వివరించింది.

ఆగస్టు 15న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ- అమెజాన్ అడవుల్లో చెట్ల నరికివేత పెరుగుతోందని అంగీకరించారు. అక్కడ ఏదైనా దహనం చేయడం నేరమని, ఈ నేరాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కార్చిచ్చులు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పొడి వాతావరణం, గాలులు, వేడిమి వల్లే అడవుల్లో మంటలు రేగాయని, కార్చిచ్చుకు వాతావరణమే కారణమని ఆగస్టు 22న బ్రెజిల్ పర్యావరణ శాఖ మంత్రి రికార్డో సాలెస్ ట్విటర్‌లో చెప్పారు.

అమెజాన్ ప్రాంతంలో భూవివాదాలే ప్రస్తుత కార్చిచ్చుకు కారణమని ఇమఫ్లోరా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు లూయిస్ ఫెర్నాండో గ్యుడెస్ పింటో చెప్పారు.

ముందు భూమిని ఆక్రమించుకొంటే తర్వాత దానిని చట్టబద్ధం చేసుకోవచ్చనే యత్నాలు అక్కడ జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

అధ్యక్షుడు బొల్సొనారో, ఎకర్ రాష్ట్ర గవర్నర్ గ్లాడ్సన్ కమేలీ గతంలో చేసిన ప్రకటనల్లో- అడవులను నాశనం చేసేవారికి శిక్షలు తీవ్రంగా ఉండవనే సంకేతాలు వెలువడి ఉండొచ్చని, తాజా పరిణామాలకు వారి ప్రకటనలకు సంబంధముందని లూయిస్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.

సాధారణంగా వృక్షాలను నరికేశాక దాదాపు రెండు నెలలపాటు వేచిచూస్తారని, ఈలోగా అక్కడి పచ్చదనం ఎండిపోతుందని, ఆ తర్వాత తగులబెడతారని వాతావరణ నిపుణుడు కార్లోస్ నోబ్రే బీబీసీతో చెప్పారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తాయని ఆయన తెలిపారు. ఈసారి అడవుల నరికివేత ఎక్కువగా ఉందని ఇప్పటికే వెల్లడైందని, అందువల్లే కార్చిచ్చులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)