ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?

ప్రపంచ దేశాల నాయకులు ఈ వారంలో న్యూయార్క్‌లో సమావేశమవుతున్నారు. వాతావరణ మార్పు అంశం వారి అజెండాలో అగ్రస్థానంలో ఉండబోతోంది. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇంకా ఏమేం అంశాలపై చర్చిస్తారు?

ఈ ఐక్యరాజ్యసమితి ఏమిటి? దాని సర్వసభ్య సభ ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి.

ప్రస్తుతం 193 దేశాలు ఇందులో పూర్తి కాలపు సభ్యదేశాలుగా ఉన్నాయి. హోలీ సీ (పోప్ పరిధిలో ఉన్న ప్రాంతం), స్టేట్ ఆఫ్ పాలస్తీనా దేశాలు సభ్యత్వం లేకుండా ఇందులో కొనసాగుతున్నాయి.

ఐక్యరాజ్యసమితిలో గల ఆరు విభాగాల్లో సర్వసభ్య సభ ఒకటి. ఈ సంస్థ ఏం చేయాలనేది నిర్ణయించే ప్రధాన విభాగం ఇదే. ఐరాస సభ్యత్వం గల 193 దేశాలకూ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క విభాగమూ ఇదే.

ఈ సర్వసభ్య సభ వార్షిక సమావేశం ప్రతి ఏటా సెప్టెంబర్‌లో పక్షం రోజుల పాటు న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశాల మధ్యలో నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ ఉంటుంది.

ఈ సాధారణ చర్చలో ఏం చర్చిస్తారు?

మాదక ద్రవ్యాల సమస్య మొదలుకుని భద్రత వరకూ అనేక రకాల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఈ ఏడాది.. ఐరాస ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను.. భవిష్యత్ తరాల అవసరాలు తీర్చే సామర్థ్యం దెబ్బతినకుండానే ప్రస్తుత తరాల అవసరాలను తీర్చే విధంగా వేగవంతంగా అమలు చేసే అంశం మీద చర్చలు ఉంటాయి.

నాలుగేళ్ల కిందట ఒక విధానంగా ఆమోదించిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరుగుతున్న మొదటి ఐరాస శిఖరాగ్ర సమావేశమిది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాలను నిర్మూలించే అంశం మీద గురువారం నాడు ప్రత్యేకంగా చర్చిస్తారు. భౌగోళికంగా, ఆర్థికంగా ఒంటరిగా ఉన్న, పర్యావరణపరంగా అతిసున్నితంగా ఉన్న చిన్న దీవులు ఎదుర్కొంటున్న సవాళ్ల మీద చర్చలతో శుక్రవారం ఈ సంప్రదింపులు ముగుస్తాయి.

ఈ వారంలో ప్రధానాంశాలు ఏమిటి?

ఈ సమావేశాల్లో ప్రపంచ నాయకులు ఇతర ప్రపంచ నాయకులతో ప్రణాళిక ప్రకారం కానీ, అకస్మాత్తుగా కానీ కలవటం పతాక శీర్షికలకు ఎక్కింది.

బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా తొలిసారి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఆయన పలు ఇతర దేశాల అధినేతలతో బ్రెగ్జిట్ అంశం మీద మరిన్ని చర్చలు జరపవచ్చు.

సర్వసభ్య సమావేశంలో సందర్భంగా.. వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సును కూడా నిర్వహించారు. అందులో 16 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థంబర్గ్ ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ''మీరు మీ వట్టి మాటలతో నా స్వప్నాలను, నా బాల్యాన్ని దొంగిలించారు. మీకెంత ధైర్యం?'' అని ప్రశ్నించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో ప్రపంచం తగినంతగా కృషి చేయటంలేదన్నారు. ''ప్రపంచ ప్రవర్తనలో మార్పు రావటం ఇప్పుడు అవసరం'' అని పేర్కొన్నారు.

ఇదెలా పనిచేస్తుంది?

ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మొదట బ్రెజిల్ నాయకుడు కానీ లేదంటే వారి ప్రతినిధి కానీ.. ఆ తర్వాత ఆతిథ్య దేశమైన అమెరికా మాట్లాడాలని సంప్రదాయం నిర్దేశిస్తోంది.

సర్వసభ్య సభ తొలి నాళ్లలో అందరికన్నా ముందు మాట్లాడటానికి ఎవరూ సుముఖంగా ఉండేవారు కాదు. దీంతో బ్రెజిల్ తరచుగా ముందుకు వచ్చి మొదట గళం విప్పేది. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది.

ఈ ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సానారో మాట్లాడాల్సి ఉంది. అయితే.. ఆయనకు హెర్నియా సర్జరీ జరిగినందున హాజరవుతారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రసంగించాల్సి ఉంటుంది.

ఈ సమావేశం సందర్భంగా ప్రతి దేశపు నాయకుడు కానీ ఆ దేశ ప్రతినిధి కానీ సర్వసభ్య సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలనేది ఐరాసలో వారి ప్రాతినిధ్య హోదా, భౌగోళిక సమతుల్యం తదితర అంశాల ప్రాతిపదికగా నిర్ణయమవుతుంది.

మాట్లాడేవారిని వారి ప్రకటనలు 15 నిమిషాల లోపు ఉండేలా చూడాలని కోరుతారు. అయితే ఈ పరిమితిని తరచుగా విస్మరిస్తుంటారు. సర్వసభ సమావేశంలో సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రోది. ఆయన 1960లో నాలుగున్నర గంటల పాటు ప్రసంగించారు.

సర్వసభ్య సభ ప్రతినిధులు వారి పేర్ల ఇంగ్లిష్ అనువాదం ప్రకారం.. ఇంగ్లిష్ అక్షరమాల క్రమంలో సభలో ఆశీనులవుతారు. అయితే.. మొదటి కుర్చీలో కూర్చునే దేశాన్ని మాత్రం ప్రతి ఏటా ఐరాస జనరల్ సెక్రటరీ ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఘనాను ఎంపిక చేశారు.

ఎవరు హాజరవుతారు? ఎవరు హాజరుకారు?

ఈ సమావేశాలకు హాజరవుతామని గత వారాంతం వరకూ 90 మంది పైగా ప్రపంచ నాయకులు చెప్పారు. వారిలో బోరిస్ జాన్సన్ (బ్రిటన్), ఇమాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్), వోలోడిమిర్ జెలెన్క్సీ (ఉక్రెయిన్) తదితరులు ఉన్నారు.

వ్లాదిమిర్ పుతిన్ (రష్యా), షి జిన్‌పింగ్ (చైనా), బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్)లు హాజరుకావటం లేదు.

సర్వసభ్య సభ అధ్యక్షుడిని ప్రతి ఏటా ఎన్నుకుంటారు. ఈ ఏడాది నైజీరియా నాయకుడు తిజ్జానీ ముహమ్మద్-బాందే ఎన్నికయ్యారు.

ఇంతకుముందు ప్రధాన ఘట్టాలు ఏమిటి?

2006లో వెనిజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ని 'దయ్యం' (ద డెవిల్) అని అభివర్ణించారు.

అంతుకుముందు రోజు అదే పోడియం వద్ద జార్జి బుష్ మాట్లాడటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆ పోడియం వద్ద 'ఇంకా దయ్యం వాసన వస్తోంది' అని కూడా వ్యాఖ్యానించారు.

మూడేళ్ల తర్వాత లిబియా నాయకుడు కల్నల్ గడాఫీ గంటన్నర సేపు పైగా మాట్లాడారు. మధ్యలో ప్రతినిధులు సభ విడిచి వెళుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు.

పెద్ద దేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ సూత్రాలను వంచిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తన ప్రసంగం పత్రాన్ని నేల మీదకు విసిరేశారు.

ఇటీవల 2017లో ట్రంప్ ప్రసంగిస్తూ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్‌ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ''రాకెట్ మ్యాన్ తనకు తాను ఆత్మాహుతి కార్యక్రమం చేపట్టారు'' అని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)