నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ

    • రచయిత, సంగీతం ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆదరణ లేక చారిత్రక కళలు అంతరించించిపోతున్న వేళ 500 ఏళ్ల నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శైలి మార్చుకుంటూ ఇప్పటికీ తన ప్రత్యేకత నిలుపుకుంటోంది నకాషీ చిత్రకళ.

ఈ అరుదైన కళకు తెలంగాణలోని వరంగల్ జిల్లా చేర్యాల ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. దీంతో ఈ ఊరి పేరుతో ఈ కళను చేర్యాల నకాషీ చిత్రకళగా పిలవడం మొదలుపెట్టారు.

దీనికి 2009 లో జీఐ(భౌగోళిక గుర్తింపు) లభించింది.

కేవలం పెయింటింగ్స్ మాత్రమేకాదు బొమ్మల తయారీ కూడా ఈ కళ ప్రత్యేకత.

చింతగింజల పొడి, చెక్కపొట్టు, సహజ రంగులు, పాత కాటన్ బట్టలు,సుద్ద పొడి, హ్యాండ్లూమ్ బట్ట, తిరువని గొంద్ ఇలా అన్ని ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో ఈ చేర్యాల బొమ్మలు,పెయింటింగ్స్ పురుడుపోసుకుంటాయి.

ఈ కళ ఎలా పుట్టిందంటే..

భారత్‌పై ముస్లిం రాజులు దండయాత్రలకు వచ్చినప్పుడు ఈ కళ వారితో పాటు వచ్చిందని, మొదట ఉత్తర భారత్ లో ప్రసిద్ధి చెంది ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ దక్షిణ భారత దేశంలో నకాషీ కళగా పేరొందిందని కవి, పరిశోధకులు జయధీర్ తిరుమల రావు బీబీసీకి చెప్పారు.

ఈ కళ నకాషీ కులస్తులు దనాలకోట వెంకటరామయ్య నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. దనాలకోట వెంకటరామయ్య నుంచి చంద్రయ్య,భారతమ్మ, వైకుంఠం, నాగేశ్వర్, పద్మ, వెంకటరమణ, పవన్ ఇప్పుడు వీరి నాల్గోతరం సాయికిరణ్, శ్రవణ్ కుమార్‌లు ఈ కళను వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ప్రస్తుతం నాలుగు కుటుంబాలే ఈ కళను కొనసాగిస్తున్నాయి. వీరితో పాటు ఈ కళను నేర్చుకున్న మరో మూడు కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాయి.

కుల పురాణాలను వివరించే కళ

ఒకప్పుడు ఈ కళతో పెయింటింగ్స్,బొమ్మలు, అట వస్తువులు, మాస్క్‌లు,ఆలయ చిత్రాలు, విగ్రహాలు చేసేవారు.

జానపద కథలు,పురాణాలు, మహాభారతం, రామాయణ వంటి ఇతివృత్తాలను ఈ కళ ద్వారానే వివరించేవారు.

దాదాపు 20 నుంచి 25 మీటర్ల హ్యాండ్లూమ్ బట్టను కాన్వాసుగా మార్చి చెప్పాలనుకున్న ఇతివృత్తాన్ని పెయింటింగ్స్‌గా వేసేవారు. దీనికి కొన్ని నెలల సమయం పట్టేది.

కాటమరాజు లాంటి కథలు చెప్పడానికి బొమ్మలను కూడా తయారు చేసేవారు.

దాదాపు 10 కుల పురాణాలను కథలా చెప్పడానికి ఈ పెయింటింగ్స్, బొమ్మలు వాడేవారు.

ఆదరణ కోసం కొత్తదారిలో..

జాతరలు తగ్గడం, సినిమాల ప్రభావంతో ఇప్పుడు ఈ కళకు ఆదరణ తగ్గుతోంది. కళాకారులకు పని లేకుండా పోతోంది.

ఒకానొక సమయంలో ఈ కళ కూడా అంతరించిపోతుందని అనుకున్నారు. కానీ, ఈ కళను కొనసాగిస్తున్న నేటి తరం కొత్త పంథాలో ముందుకు వెళ్లడంతో అంతరించిపోతున్న కళకు ఆదరణ పెరుగుతోంది.

ఇప్పటి అవసరాలకు అనుగుణంగా నకాషీ కళ డిజైన్లను నవతరం సృష్టిస్తోంది.

జాతరలలో వాడేలా మాస్క్‌ల సైజు తగ్గించడంతో వాటి ఆదరణ పెరిగింది. ఇక ఇంటిగోడలపై అందంగా అలంకరించేలా 40, 45 మీటర్ల పెయింటింగ్స్‌ను తయారు చేయడంతో వాటిని కొనేవారి సంఖ్య పెరుగుతోంది.

పురాణాలను వివరించేలా చిన్న సైజులో తయారు చేస్తున్న పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇవేకాకుండా నకాషీ కళతో కళ్లజోడు పెట్టుకునే స్టాండ్, పెన్ స్టాండ్, కీ చైయిన్లు కూడా తయారు చేస్తున్నారు. వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది.

'నాలుగు కుటుంబాలతో అంతం కావొద్దు'

ఈ నకాషీ కళాకారుల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ప్రభుత్వం సహకారంతో సికింద్రాబాద్, కాచిగూడ,శిల్పారామంలాంటి చోట్ల పెయింటింగ్స్ వేశామని, దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇస్తున్నామని వారు చెప్పారు. ఈ- కామర్స్ ద్వారా కూడా తమ కళకు ఆదరణ లభిస్తుందని తెలిపారు.

''ఈ కళ కేవలం మా నాలుగు కుటుంబాలతో అంతరించపోవద్దు'' అని నకాషీ చిత్రకళ నాల్గోతరం కళాకారుడు సాయి కిరణ్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ కళకు ఆదరణ పెరిగితే నేర్చుకోవడానికి మరింతమంది ముందుకు వస్తారు. ఈ కళ చాలామందికి తెలియాలి'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)