ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...

ఇటీవలి వారాల్లో ప్రపంచవ్యాప్తంగా లెబనాన్ నుంచి యూరప్‌లోని స్పెయిన్ వరకూ.. లాటిన్ అమెరికాలో చిలీ వరకూ ప్రజాందోళనలు పెల్లుబుకుతున్నాయి. ఈ ఆందోళనలకు కారణాలు, అవి అనుసరించే పద్ధతులు, వాటి లక్ష్యాలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ అనుసంధానించే ఉమ్మడి అంశాలు కొన్ని ఉన్నాయి.

కొన్ని దేశాల మధ్య వేల మైళ్ల దూరాలున్నా.. ఆయా దేశాల్లో ఒకే కారణం వల్ల నిరసనలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాల ప్రజలు పరస్పర స్ఫూర్తితో తమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటానికి సంఘటితమవటం ప్రారంభించారు.

ఇటువంటి ఆందోళనలు, నిరసనల్లో కేంద్ర బిందువులుగా ఉన్న అంశాలు.. ఆయా దేశాల ప్రజల ఉద్యమాల్లో ఉమ్మడిగా కనిపించే అంశాల్లో కొన్ని ఇవి...

అసమానత

ఈ ఆందోళనలు చేస్తున్న వారిలో చాలా మంది.. తమ దేశ సంపదలో తమకు దక్కాల్సిన భాగం దక్కటం లేదని చాలా కాలంగా భావిస్తున్నారు. పలు ఉదంతాల్లో కీలక సేవల ధరలు పెరగటంతో వీరిలో సహనం నశించిందని స్పష్టమవుతోంది.

ఈక్వెడార్‌లో దశాబ్దాలుగా అమలు చేస్తున్న చమురు రాయితీలను.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో ఒప్పందం మేరకు అంగీకరించిన పొదుపు చర్యల్లో భాగంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో ఈ నెలలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.

రాయితీల రద్దుతో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ధరలు తమకు అందుబాటులో లేవని చాలా మంది చెప్తున్నారు. ఈ ధరల పెంపు వల్ల ప్రజా రవాణా, ఆహార ధరలు కూడా పెరిగిపోతాయని.. గ్రామీణ ప్రజానీకం తీవ్రంగా దెబ్బతింటుందని ప్రజా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

నిరసనకారులు రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హైవేలను దిగ్బంధించారు. పార్లమెంటు మీదకు దూసుకెళ్లారు. భద్రతా సిబ్బందితో తలపడ్డారు. ప్రజాందోళనలు కొన్ని రోజుల పాటు సాగిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చింది. ఆందోళనలు సద్దుమణిగాయి.

చిలీలో కూడా రవాణా చార్జీలు పెంచటంతో నిరసనలు పెల్లుబికాయి. ఇంధన ఖర్చులు అధికంగా ఉండటం.. కరెన్సీ బలహీనపడటం వల్ల బస్, మెట్రో చార్జీలు పెంచామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇది పేదల నుంచి డబ్బులు పిండటానికి ప్రభుత్వం చేపట్టిన మరొక చర్య మాత్రమేనని ఆందోళనకారులు మండిపడ్డారు.

నిరసనకారులు శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలతో ఘర్షణ పడుతుంటే.. దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా సంపన్న ప్రాంతంలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇది.. చిలీ రాజకీయ కులీనులకు - వీధుల్లో సాధారణ ప్రజలకు మధ్య ఉన్న అంతరానికి అద్దం పడుతోందని కొందరు వ్యాఖ్యానించారు.

లాటిన్ అమెరికాలోని సంపన్న దేశాల్లో ఒకటి చిలీ. అదే సమయంలో.. అసమానతలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారటంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి చార్జీల పెంపును రద్దు చేసింది. అయినా ఇంకా విస్తృత సమస్యలను ముందుకు తెస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

''ఇది కేవలం మెట్రో చార్జీల పెంపు మీద వ్యక్తమైన నిరసన కాదు.. నిరుపేదలను ప్రధానంగా దెబ్బతీసిన సుదీర్ఘ అణచివేత మీద పెల్లుబికిన నిరసన'' అని ఆ నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థి అభివర్ణించారు.

లెబనాన్‌లోనూ వాట్సాప్ కాల్స్ మీద పన్ను విధించాలన్న ప్రణాళికతో ఇదే తరహా అలజడి తలెత్తింది. ఆర్థిక సమస్యలు, అసమానత, అవినీతి మీద విస్తృత ఆందోళనలు చెలరేగాయి.

అప్పుల స్థాయి పెరిగిపోతుండటంతో.. అంతర్జాతీయ దాతల నుంచి భారీ సహాయ ప్యాకేజీలు పొందటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ.. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో తాము బాధలు పడుతున్నామని.. తమ సమస్యలకు ప్రభుత్వ అసమర్థతే కారణమని చాలా మంది సాధారణ ప్రజలు తప్పుపడుతున్నారు.

''మేం ఆందోళనకు దిగింది వాట్సాప్ విషయంలో కాదు. ప్రతి సమస్య గురించీ.. చమురు, ఆహారం.. అన్నిటి గురించీ మేం ఆందోళన చెందుతున్నాం'' అని బీరుట్‌కు చెందిన అబ్దుల్లా అనే ఒక నిరసనకారుడు చెప్పారు.

అవినీతి

ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కూడా అనేక నిరసనలకు కారణంగా మారుతోంది. అసమానతలకు ఈ అవినీతి కూడా కారణమని ప్రజలు భావిస్తున్నారు.

లెబనాన్‌లో నిరసనకారులు.. ఆర్థిక సంక్షోభం వల్ల తాము కష్టాలు పడుతుంటే దేశ నాయకులు తమ అధికారం ఉపయోగించుకుని అవినీతి, లంచాలతో సంపన్నులవుతున్నారని ఆరోపిస్తున్నారు.

''నేను చాలా చూశాను.. కానీ లెబనాన్‌లో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు'' అని రబాబ్ అనే 50 ఏళ్ల నిరసనకారుడు పేర్కొన్నారు.

ఈ అలజడిని తగ్గించటానికి ప్రభుత్వం సోమవారం నాడు కొన్ని సంస్కరణలను ఆమోదించింది. రాజకీయ నాయకుల వేతనాలను తగ్గించటం అందులో ఒకటి.

ఇరాక్‌లో ప్రజలు.. రాజకీయ వ్యవస్థ తమ ప్రయోజనాలను నెరవేర్చటంలో విఫలమైందని దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నియామకాలు ప్రతిభ ప్రాతిపదికగా కాకుండా జాతిపరమైన, మతపరమైన కోటాల ఆధారంగా జరపటం వీరు తప్పుపడుతున్న ప్రధాన అంశాల్లో ఒకటి.

ప్రజల నిధులను నాయకులు తమకు, తమ అనుచరులకు లబ్ధిచేకూర్చేలా ఉపయోగించుకోవటానికి ఇది వీలు కల్పిస్తోందని.. అత్యధిక ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం దక్కటం లేదని ఆందోళనకారులు వాదిస్తున్నారు.

ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలతో ఈజిప్టులోనూ నిరసనలు జరిగాయి. దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్-సిసి, సైన్యం అవినీతికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ.. స్పెయిన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఈజిప్టు వ్యాపారవేత్త మొహమ్మద్ అలీ ఇచ్చిన పిలుపుతో సెప్టెంబర్‌లో ఈ అరుదైన ఆందోళనలు తలెత్తాయి.

సిసి, ఆయన ప్రభుత్వం ప్రజానిధులను దుర్వినియోగం చేస్తోందంటూ అలీ చేసిన ఆరోపణలు.. ప్రభుత్వ పొదుపు చర్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈజిప్షియన్లు చాలా మందికి ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించాయి.

రాజకీయ స్వాతంత్ర్యం

కొన్ని దేశాల్లో రాజకీయ వ్యవస్థల పట్ల నిరసనకారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ నిరంకుశ వ్యవస్థల్లో తాము చిక్కుకుపోయాయమని వారు భావిస్తున్నారు.

అనుమానిత నేరస్తులను నిర్దిష్ట పరిస్థితుల్లో చైనాకు అప్పగించటానికి ఉద్దేశించి రూపొందించిన బిల్లును వ్యతిరేకిస్తూ ఈ వేసవిలో హాంగ్ కాంగ్‌లో భారీస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. హాంగ్ కాంగ్.. చైనాలో భాగమే అయినా ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక స్వాతంత్ర్యాలు ఉన్నాయి. వాటికి కోతలు పెడుతూ తమను మరింత అధికంగా నియంత్రించాలని చైనా కోరుకుంటోందని హాంగ్ కాంగ్ ప్రజల్లో లోతైన భయం గూడుకట్టుకుంది.

చిలీ, లెబనాన్‌లలో నిరసనకారుల తరహాలోనే హాంగ్ కాంగ్‌లో కూడా భారీస్థాయిలో ప్రజలు ఆందోళనలకు దిగటంతో హాంగ్ కాంగ్ పాలకులు ఆ వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. అయినా నిరసనలు కొనసాగాయి.

సార్వజనీన ఓటు హక్కు, పోలీసుల క్రూరత్వం మీద స్వతంత్ర విచారణ, అరెస్టయిన ఆందోళనకారులకు క్షమాభిక్ష కావాలని ఇప్పుడు వీరు డిమాండ్ చేస్తున్నారు.

హాంగ్ కాంగ్ ఆందోళనకారులు అనుసరించిన ఎత్తుగడలు.. ప్రపంచానికి ఆవలివైపున రాజకీయ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చాయి. కాటలోనియా వేర్పాటువాద నాయకులను జైలులో పెట్టటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బార్సిలోనాలో లక్షలాది మంది జనం నిరసనలు చేపట్టారు.

2017లో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ, దాని ఆధారంగా స్వాతంత్ర్య ప్రకటన చేయటం.. చట్టవ్యతిరేకమని స్పెయిన్ కోర్టులు తీర్పుచెప్పగా.. ఆ వేర్పాటువాద నాయకులు దేశద్రోహానికి పాల్పడ్డారంటూ అక్టోబర్ 14వ తేదీన జైలు శిక్ష విధించారు.

ఆ తీర్పు వెలువడిన వెంటనే బార్సిలోనా ప్రజలకు.. నగరంలోని ఎల్ ప్రాట్ విమానాశ్రయం దగ్గరకు వెళ్లాలంటూ ఒక మొబైల్ యాప్‌లో మెసేజ్ అందింది. హాంగ్ కాంగ్ నిరసనలను అనుసరిస్తూ పాటించిన ఎత్తుగడ ఇది.

ఆందోళనకారులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత.. ''మేం హాంగ్ కాంగ్ తరహా పరిస్థితులు సృష్టిస్తాం'' అని యువకుల బృందాలు నినాదాలు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

పోలీసుల వాటర్ క్యానన్లు, బాష్పవాయువుల నుంచి నిరసనకారులు తమను తాము ఎలా రక్షించుకోవాలనేది వివరిస్తూ హాంగ్‌కాంగ్‌లో తయారైన ఇన్ఫోగ్రాఫిక్‌లను కూడా కాటలన్ నిరసనకారులు పంపిణీ చేస్తున్నారు.

''ఇప్పుడు జనం వీధుల్లోకి వచ్చితీరాలి. తిరుగుబాట్లన్నీ ఇక్కడే మొదలవుతాయి. హాంగ్ కాంగ్‌లో ఏం జరిగిందో చూడండి'' అని బార్సిలోనాలో ఒక నిరసనకారుడు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

వాతావరణ మార్పు

మనం చూస్తున్న, వింటున్న వాటిలో చాలా నిరసనలు పర్యావరణం, వాతావరణ మార్పుకు సంబంధించినవి ఉన్నాయి. ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఉద్యమకారులు.. ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆందోళన చేపడుతున్నారు.

అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో ఈ నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు రహదారులు, వాహనాలకు తమను తాము కట్టేసుకుని.. నగరంలోని రద్దీ కూడళ్లను దిగ్బంధించటానికి ప్రయత్నించారు.

''మన ప్రభుత్వం వాతావరణ, జీవావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. మనల్ని రక్షించటానికి అవసరమైన చర్యలు చేపట్టేవరకూ తిరుగుబాటు చేయటం మినహా మార్గం లేదు'' అని ఆస్ట్రేలియన్ కార్యకర్త జేన్ మోర్టన్ పేర్కొన్నారు.

స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం వారం వారం స్కూలు సమ్మెల్లో పాల్గొంటున్నారు. గత నెలలో స్కూలు పిల్లల సారథ్యంలో జరిగిన ప్రపంచ వాతావరణ సమ్మెలో లక్షలాది మంది పాల్గొన్నారు. పసిఫిక్ దీవుల్లో గుప్పెడు మంది నిరసన తెలపటం మొదలుకుని.. మెల్‌బోర్న్, ముంబై, బెర్లిన్, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీస్థాయి ప్రదర్శనలు నిర్వహించటం వరకూ ఈ సమ్మె సాగింది.

అందులో ఒక సైన్‌బోర్డు మీద రాసిన నినాదం ఇలా ఉంది: ''మీకు ఒక పాఠం నేర్పటానికి మేం మా పాఠాలను పక్కనపెడుతున్నాం.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)