వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

వాట్సప్ కాల్‌పై టాక్స్ విధించాలనే నిర్ణయాన్ని లెబనాన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. కానీ, అక్కడ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.

గురువారం దీనిపై ఒక ప్రకటన చేసిన ప్రభుత్వం "వాట్సాప్, ఫేస్‌బుక్, మెసంజర్, యాపిల్ ఫేస్ టైమ్ లాంటి యాప్స్ ద్వారా చేసే కాల్‌పై రోజువారీ పన్నులు ఉంటాయి" అని చెప్పింది.

ఈ యాప్స్ నుంచి కాల్స్ చేసేవారికి రోజుకు 0.20 డాలర్(14.5 రూపాయలు) పన్ను చెల్లించాలని ప్రభుత్వం చెప్పింది.

కానీ, భద్రతాదళాలు ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

దేశాన్ని పీడిస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యలకు ఆగ్రహించిన జనం రోడ్లపైకి వచ్చారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళనకారులు రోడ్లపై టైర్లు వేసి నిప్పుపెట్టడంతో, వారిని చెదరగొట్టేందుకు భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.

గురువారం జరిగిన హింసాత్మక ఆందోళనల్లో చాలా మంది ప్రజలు గాయపడ్డారు.

శుక్రవారం లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్-హరీరీ "దేశం చాలా కష్టాల్లో ఉందని చెప్పారు". కానీ, రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు.

లెబనాన్ ప్రజల ఆందోళనలు ఎందుకు

లెబనాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో చాలామంది దానికి ప్రభుత్వమే కారణం అని భావిస్తున్నారు. ఆగ్రహించిన వేలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ "నేను ఇంట్లో కూచుని ఉన్నా. ఆందోళనలు చేసేందుకు అందరూ ఇళ్ల నుంచి బయటికి రావడం చూసి, నేను కూడా రోడ్డుపైకి వచ్చాను" అన్నారు.

"నేను పెళ్లైనవాడిని, చాలా మంది దగ్గర అప్పులు చేశాను. అవి ప్రతి నెలా పెరుగుతూ పోతున్నాయి. ఏ పనీ చేయలేకపోతున్నాను. ఇది ప్రభుత్వ తప్పిదమే" అన్నాడు.

గురువారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న జనం "ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నట్లు" చెప్పారు.

దేశంలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పడానికి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని కూడా కొందరు ఆగ్రహంతో ఉన్నారు. ఇంత భయంకరమైన కార్చిచ్చు గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ రాజుకోలేదు.

"మేం ఇక్కడ వాట్సప్‌పై ట్యాక్స్ వేశారనే రాలేదు. మేం దేశంలో ఉన్న అన్ని సమస్యల కోసం వచ్చాం. ఇంధనం, ఆహారం, బ్రెడ్ సహా అన్ని వస్తువుల కోసం ఆందోళనలు చేస్తున్నాం" అని ఆందోళనకారుల్లో ఒకరైన అబ్దుల్లా చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)