You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముగ్గురి మృతికి కారణమైన మెట్రో రైలు చార్జీల పెంపు.. చిలీలో అసలేం జరిగింది
చిలీలో మెట్రో రైలు చార్జీలు పెంచటంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దేశ రాజధాని శాంటియాగో రెండు రోజులుగా హింసాత్మక ఆందేళనలతో అట్టుడుకుతోంది.
శాంటియాగోలోని ఒక సూపర్‌మార్కెట్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టటంతో ముగ్గురు చనిపోయారని మేయర్ కార్లా రూబిలార్ తెలిపారు.
ఆందోళనల నేపథ్యంలో మెట్రో రైలు చార్జీల పెంపును రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. అయినా నిరసనలు కొనసాగాయి.
శాంటియాగోలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది.
లాటిన్ అమెరికాలోని అత్యంత సుస్థిరమైన దేశాల్లో ఒకటి చిలీ. కానీ దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం పట్ల ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తికి ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయి.
చిలీ కొన్ని దశాబ్దాలుగా ఇంత తీవ్రస్థాయి అశాంతిని చవిచూడలేదు. దేశ ప్రజల్లో ఉన్న చీలికలు కూడా ఈ ఆందోళనలతో బహిర్గతమయ్యాయి.
ఈ ప్రాంతంలో చిలీ అత్యంత ధనిక దేశమే కాదు.. అసమానతలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్లు కొంతకాలంగా తీవ్రమవుతున్నాయి.
శాంటియాగోలోని కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది సైనికులను రోడ్ల మీద మోహరించారు. అగస్టో పినోచెట్ నియంతృత్వ పాలన నుంచి 1990లో ప్రజాస్వామ్య దేశంగా మారిన తర్వాత.. ఈ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఇదే మొదటిసారి.
శుక్రవారం మొదలైన ఆందోళనలు శనివారం రెండో రోజు కూడా హింసాత్మకంగా కొనసాగాయి. ఆందోళనకారులు నగరంలో రహదారులపై బారికేడ్లు పెట్టి.. బస్సులకు నిప్పంటించారు. వారిని చెదరగొట్టటానికి పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
శాంటియాగో నగరం నడిబొడ్డున ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని మేయర్ ఫెలిప్ అలెస్సాండ్రి అభివర్ణించారు.
ఇప్పటవరకూ జరిగిన ఘర్షణల్లో 156 మంది పోలీసులు, 11 మంది పౌరులు గాయపడ్డారని.. 300 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
దేశాధ్యక్షుడు పినేరా టెలివిజన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తన సహచరుల గళాన్ని.. జీవన వ్యయం విషయంలో వారి అసంతృప్తిని తాను వినమ్రంగా విన్నానని పేర్కొన్నారు.
కానీ ప్రతిస్పందన తగిన విధంగా లేదని విమర్శకులు తప్పుపడుతున్నారు.
శాంటియాగోలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజల కదలికలు, సమావేశాల మీద అధికారుల ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
అంతకుముందు.. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను రద్దు చేశారు. దుకాణాలు మూసివేశారు. నగరంలోని భూగర్భ మెట్రో రైలు వ్యవస్థను.. 41 స్టేషన్లలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో సోమవారం వరకూ నిలిపివేశారు.
దేశంలోని కాన్సిప్సియాన్; రాంకాగువా, పుంటా ఆరేనాస్, వాల్పారాసో, ఈక్విక్, ఆంటోఫాగాస్టా, క్విలోటా, టాల్కా తదితర నగరాల్లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయని ఎల్ మెర్కూరియో వార్తాపత్రిక తెలిపింది.
ఇదిలావుంటే.. శుక్రవారం సాయంత్రం శాంటియాగాలో నిరసనకారులు - ఆందోళనకారలు మధ్య భీకర ఘర్షణ జరుగుతున్న సమయంలో దేశాధ్యక్షుడు పినేరా సంపన్న ప్రాంతంలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో ఉన్నట్లు బహిర్గతమైన ఫొటో మీద సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
అది.. అధ్యక్షుడి మనువడి పుట్టినరోజు వేడుకల్లో తీసిన ఫొటో అని చెప్తున్నారు. దేశ సాధారణ ప్రజల పరిస్థితులతో తనకు నిమిత్తం లేనట్లు దేశాధ్యక్షుడు వ్యవహరించటానికి ఈ ఫొటో అద్దం పడుతోందని విమర్శకులు అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- #100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా... అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?
- రోహిత్ శర్మ IND vs. SA: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)