You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారతదేశ వాతావరణం: ఒకవైపు వరదలు, మరోవైపు కరవు... ఎందుకిలా? -బీబీసీ రియాలిటీ చెక్
- రచయిత, రియాలిటీ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
ఇటీవల దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఇప్పుడు ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ వంటి చాలా ప్రాంతాల్లో ముంచెత్తుతున్న వరదలతో భవనాలు కూలిపోతున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఇలా ఉంటే, మరోవైపు దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావంతో కరవు తాండవిస్తోంది.
ఈ పరిస్థితులను చూస్తుంటే ఈ వైరుధ్యమైన వాతావరణ పరిస్థితుల దేశంలో మరింత సాధారణమై పోతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అందుకు ఏమైనా ఆధారాలు కనిపిస్తున్నాయా? అన్న కోణంలో పరిశోధించేందుకు బీబీసీ రియాలిటీ చెక్ బృందం దేశంలో వరదలు, కరువుకు సంబంధించిన వివరాలను విశ్లేషించింది.
వర్షం
భారత్ తన నీటి అవసరాల కోసం ఎక్కువగా రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపై ఆధారపడుతుంది.
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. రుతుపవనాల రాక ఆలస్యమైతే కోట్లాది మంది ఆధారపడిన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకవేళ వర్షాలు అధికంగా పడితే పట్టణ, నగర ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి.
ఇటీవల ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఇక్కడ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆ వర్షాల వల్ల 30 మందికిపైగా ప్రజలు చనిపోయారు.
ఆకస్మికంగా విరుచుకుపడ్డ భారీ వర్షాలను నగర వ్యవస్థ ఎదుర్కోలేకపోయిందని ముంబయి ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మరి, ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితులు ఏర్పడటానికి దీర్ఘకాలిక సంకేతాలు ఏమైనా ఉన్నాయా?
దేశవ్యాప్తంగా 36 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే, స్పష్టమైన సంకేతాలేమీ పెద్దగా కనిపించడంలేదు.
అవును, వర్షపాతం స్థాయిలు ముందస్తుగా ఊహించలేనివి. కానీ, 2002 నుంచి 2017 వరకు డేటాను పరిశీలిస్తే అసాధారణ వర్షాలు పెరిగినట్లు ఎలాంటి సంకేతం లేదు.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, 2006 నుంచి 2015 వరకు దేశంలో 90 సార్లు వరదలు సంభవించాయి. ఆ వరదల కారణంగా దాదాపు 16,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందటి దశాబ్దంలో 67 సార్లు వరదలు రాగా సుమారు 13,600 మంది చనిపోయారు.
వరదల సంఖ్య పెరిగినా, రెండు దశాబ్దాల కాలంలో వరదలు ఎంత తరచుగా సంభవిస్తున్నాయనడంలో భారీ మార్పేమీ కనిపించడంలేదు.
కరవు
ముంబయిలో కుండపోత వర్షం కురుస్తుంటే, మరోవైపు దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు ఆలస్యం కావడంతో చెన్నై నగరంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది.
అంతేకాదు, జూన్‌లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి.
మొత్తంగా చూస్తే దేశంలోని 44 శాతానికి పైగా భూభాగం కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇది గత ఏడాదితో పోల్చితే 10 శాతం ఎక్కువ.
మరి ఉష్ణోగ్రతల నమోదులో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయి?
ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ రెండు రోజులపాటు నమోదైతే దానిని వడగాడ్పుగా ప్రకటిస్తారు.
1980 నుంచి 1999 వరకు దేశంలో 213 సార్లు వడగాడ్పులు నమోదయ్యాయి.
2000 నుంచి 2018 వరకు 1400 సార్లు వడగాడ్పులు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే... 2017, 2018లలో వేడి, చలి రెండూ తీవ్రస్థాయిలో పెరిగాయి.
ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, 2100 సంవత్సరం నాటికి దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది కఠినమైన వేడి, ఉక్కపోతలను ఎదుర్కొంటారని, అందుకు కారణం పెరుగుతున్న భూతాపమేనని వెల్లడైంది.
వరదల ప్రభావాన్ని తగ్గించొచ్చా?
2005లో ముంబయి నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు 900 మందికి పైగా మరణించారు. ఆ విపత్తు తర్వాత నగరంలో వరద నీటిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించేందుకు ఎనిమిది కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటికీ ఇంకా రెండింటిని నిర్మించాల్సి ఉంది.
నగరంలో ఎక్కువ భాగం సముద్రం అంచున ఉంది. దాంతో కాస్త భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. అలాగే, పక్కా ప్రణాళిక లేకపోవడం, వేగంగా నిర్మాణాలు పెరిగిపోవడం కూడా ఈ సమస్యలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
నగరంలో మురుగునీటి కాల్వల పునరుద్ధరణ కోసం 1993లో ప్రాణాళికలు వేశారు. కానీ, ఆ ప్రణాళికలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)