You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
సూర్యరశ్మి తాకితే శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తవుతుంది. అలా అని గంటల తరబడి ఎండలో ఎక్కువగా తిరిగితే కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి, మనకు సూర్యరశ్మి ఎంత అవసరం?
ఎండ వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తవుతుందని ఓ అధ్యయనం తెలిపింది.
శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్మరశ్మి చాలా అవసరం. ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉంది. వారి శరీరానికి సూర్యరశ్మి సరైన మోతాదులో అందకపోవడం అందుకు ఒక కారణం.
మరి, చర్మానికి హాని లేకుండా తగినంతగా సూర్యరశ్మి పొందడం ఎలా?
ఎంతసేపు ఎండలో ఉండాలి? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఏ కాలం, ఏ రోజు, ఏ సమయం, ఆయా వ్యక్తుల చర్మం తీరు లాంటి అనేక విషయాలపై అది ఆధారపడి ఉంటుంది.
ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి అవసరమవుతుంది. ఎండతో వచ్చే సమస్యల తీవ్రత కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
చర్మం పలుచగా ఉంటే, వేసవి కాలంలో రోజూ ఓ 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
నల్లగా ఉన్నవారికి అందుకు 6 రెట్లు ఎక్కువ సమయం అవసరమవుతుందని అంచనా వేశారు.
అయితే, నల్లని చర్మానికి ఎండను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. వారు ఎండలో ఎక్కువ సేపు ఉండగలరు.
యూవీ కిరణాల ప్రభావం
సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని తాకితే కొన్ని సమస్యలు వస్తాయి.
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మీ నీడను గమనించండి. మీ కంటే, మీ నీడ పొట్టిగా కనిపిస్తే.. ఎండలో అతినీల లోహిత కిరణాలు అధికంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
అప్పుడు ఎండకు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండలో తిరకున్నా సమస్యలొస్తాయి. బరువు పెరగొచ్చు, నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, గుండె సంబంధిత సమస్యలకు, ఎముకల బలహీనతకు దారితీయవచ్చు.
ఎండకు వెళ్లడం సాధ్యం కానివారికి, విటమిన్ డీని మాత్రల ద్వారా భర్తీ చేసుకోవచ్చు.
అయితే, విటమిన్ డీ వస్తుంది కదాని.. గంటల కొద్దీ ఎండలో ఉండేందుకు ప్రయత్నించకూడదు.
చర్మ క్యాన్సర్
అతినీల లోహిత(యూవీ) కిరణాలు తాకితే చర్మం దెబ్బతింటుంది. ఆ కిరణాలు మరీ ఎక్కువగా తాకితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎండ వల్ల రెండేళ్లలో ఒకసారి చర్మం కమిలిపోయినా, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.
90% చర్మ క్యాన్సర్లు అధిక సూర్యరశ్మి వల్లే వస్తున్నాయి.
చర్మంలో మార్పు కనిపించగానే, వైద్యులను సంప్రదించాలి. చాలావరకు అది చర్మ క్యాన్సర్ అయ్యుండదు.
ఒకవేళ క్యాన్సర్ అయినా కూడా.. లేత దశలో వైద్యం ప్రారంభిస్తే కోలుకునే అవకాశం మెరుగవుతుంది.
మనకు సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.
విటమిన్-డి లోపం సూచనలు
త్వరగా అలసిపోవడం, కీళ్ల నొప్పులు, పాదాలు వాయడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత విటమిన్-డి లోపానికి సూచనలు.
అయితే, వీటిని చాలా మంది పట్టించుకోరు. విటమిన్-డి లోపం క్రమక్రమంగా శరీర భాగాలన్నటినీ బలహీనపరుస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)