టోక్యో ఒలింపిక్స్: కాలాన్ని ముందుకు జరపాలని జపాన్ ఎందుకు ఆలోచిస్తోంది?

2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు మండే ఎండల బారిన పడకుండా చూసేందుకు తమ కాలాన్ని రెండు గంటలు ముందుకు జరపాలని జపాన్ ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒలింపిక్స్ అథ్లెట్లపై వేసవి ఎండల ప్రభావాన్ని తగ్గించాలనైతే అనుకొంటున్నామని ప్రభుత్వం తెలిపింది.

ఈ ప్రతిపాదనను 2019లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జపాన్‌లో వడగాలుల కారణంగా ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు 120 మంది చనిపోయారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరుగనున్నాయి. ఆ సమయంలో ఎండలు, తేమ శాతం అత్యంత తీవ్రంగా ఉంటాయి.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్ క్రీడాపోటీల నిర్వహణ అధికారులు ఇంతకుముందు జపాన్ ప్రధాని షింజో అబేకు ఒక విజ్ఞప్తి చేశారు. మారథాన్ లాంటి పోటీలు ఉదయం పూట చల్లగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యేలా డేలైట్ సేవింగ్ టైమ్‌ను అమలు చేయాలని కోరారు.

గడియారంలో సమయాన్ని రెండు గంటలు ముందుకు జరిపే ప్రతిపాదనకు జపాన్‌లో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని అమలు చేస్తే ఉద్యోగులు, కార్మికులు మరింత సమయం పనిచేయాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమైంది.

పగటి సమయాన్ని పెంచుకొనేలా కాలాన్ని రెండు గంటలు ముందుకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందనే ప్రచారంలో నిజం లేదని చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషింగే సుగా మీడియాతో చెప్పారు. 'డేలైట్ సేవింగ్ టైమ్' అమలు లాంటి చర్యలు ప్రజల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. డేలైట్ సేవింగ్ టైమ్‌ అమలు కంటే కూడా కార్యక్రమాలను ముందే ప్రారంభించడం, పచ్చదనాన్ని పెంచుకోవడం, ఉష్ణ నిరోధక ఫుట్‌పాత్‌ల నిర్మాణం లాంటి చర్యల గురించి ఆలోచిస్తామని ఆయన తెలిపారు.

జపాన్‌లో వేసవిలో ఉదయం నాలుగు గంటలకే సూర్యుడు వస్తాడని బీబీసీ టోక్యో ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేయ్స్ చెప్పారు. చాలా రోజులు ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటుతుందని తెలిపారు.

ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత

డేలైట్ సేవింగ్ టైమ్ ప్రతిపాదన జపాన్‌లో చాలా కాలం నుంచే ఉంది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 2020 ఒలింపిక్స్, ఈ ఏడాది వడగాలుల తీవ్రత నేపథ్యంలో సమయాన్ని రెండు గంటలు ముందుకు జరపాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది.

మండుటెండల వల్ల అథ్లెట్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చనే ఆందోళన ఉందని బీబీసీ టోక్యో ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2019లో జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ ప్రతిపాదనను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని జపాన్ యోచిస్తోందని చెప్పారు. ఇదే విధానాన్ని 2020 ఒలింపిక్స్ సమయంలోనూ అమలు చేయాలని ఆలోచిస్తోంది. దీనిపై ఇకపైనా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ఆక్రమణలో ఉన్న సమయంలో జపాన్‌లో డేలైట్ సేవింగ్ విధానాన్ని అమలు చేశారు. అప్పట్లో దీనిపై కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనివల్ల పగటి సమయం బాగా పెరగడంతో యజమానులు తమతో ఎక్కువసేపు పనిచేయించుకొంటున్నారని కార్మికులు నిరసన వ్యక్తంచేసేవారు. 1952లో అమెరికా ఆక్రమణ నుంచి జపాన్ బయటపడిన తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)