You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- రచయిత, రేచల్ ష్రాయెర్
- హోదా, బీబీసీ
ఓ సమాజంగా మనం నికోటిన్, ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌ని వ్యసనాలుగా అంగీకరిస్తాం. వాటివల్ల కలిగే నష్టాలూ మనకు తెలుసు కాబట్టి వాటిని ప్రమాదకర వ్యసనాలుగా పరిగణిస్తాం. కానీ సెక్స్ విషయానికి వచ్చేసరికి కొందరు నిపుణులు అది ఓ వ్యసనమని అంగీకరించరు.
మరి ఎక్కువ కోరికలు ఉంటే.. అదో మానసిక సమస్యా? లేక సెక్స్ వ్యసనమన్నది కేవలం అపోహ మాత్రమేనా?
పరిశోధనలు, పరిశోధకులు ఏమంటున్నారు?
సెక్స్ ఎడిక్షన్‌ను ప్రస్తుతానికి ఓ సమస్యగా పరిగణించలేదు. కానీ కొందరు మాత్రం ఇది కూడా ఓ సమస్యనే అంటున్నారు.
వాస్తవానికి ఈ సమస్యతో బాధపడుతున్నవారి వివరాలు పెద్దగా తెలియవు. అయితే ఓ వెబ్ సైట్ చాలా మంది సెక్స్.. లేకుంటే పోర్న్ ఎడిక్షన్‌తో బాధపడుతున్నట్లు చెబుతోంది.
2013 నుంచి ఇప్పటి వరకూ బ్రిటన్‌కు చెందిన 21,000 మంది ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ సైట్ సాయం తీసుకున్నారు.
వీరిలో 91 శాతం మంది పురుషులు. బాధితుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లారు.
2013లో సెక్స్ ఎడిక్షన్‌ను మానసిక రుగ్మతల జాబితాలో చేర్చాలని అమెరికా, బ్రిటన్‌లు భావించాయి.
అయితే సెక్స్‌ను ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదు.
కానీ.. ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్’’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.
గతంలో జూదాన్ని, అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్‌లో చేర్చారు. అలాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ కూడా అందులో చేరుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
2014లో ఓ అధ్యయనం నిర్వహించగా.. పోర్న్ వీడియోలు చూస్తున్నపుడు, డ్రగ్స్ తీసుకుంటున్నపుడూ మెదడులో ఒకే తరహా చర్యలు జరిగాయని గుర్తించారు.
అయితే దీని ఆధారంగా సెక్స్‌ను ఒక వ్యసనంగా పరిగణించలేమని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు డాక్టర్ వెలరే వూన్ తెలిపారు.
మరి సెక్స్ ఎడిక్షన్ అపోహేనా?
సెక్స్‌ను వ్యసనమని చెబితే అందరూ అంగీకరించరు.
‘ద మిత్ ఆఫ్ సెక్స్ అడిక్షన్’ అనే పుస్తకం రాసిన సెక్స్ థెరఫిస్ట్ డేవిడ్ లే కూడా నయం చేయడానికి కష్టతరమయ్యే మానసిక సమస్యలను సెక్స్ ఎడిక్షన్‌ని ఒకే గాటన కట్టడం సరికాదన్నారు.
''సెక్స్ లేదా హస్త ప్రయోగాన్ని ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌తో పోల్చడం హాస్యాస్పదం. మద్యానికి బానిసైన వారు దాని నుంచి బయటకు వస్తే మరణించే ప్రమాదముంది..’’ అని వివరించారు.
సెక్స్ ఎడిక్షన్ అనే ధోరణి ఆరోగ్యకర సెక్స్‌కి సంబంధించిన నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
‘‘మీరు ఒకవేళ థెరపిస్ట్ చెబుతున్న దానికన్నా ఎక్కువ సెక్స్ చేసినా.. విభిన్నంగా సెక్స్ చేసినా ఆ థెరపిస్ట్ దృష్టిలో సెక్స్ వ్యసపరుడైనట్లే’’ అని తెలిపారు.
మొత్తానికి పరిశోధకులు మాత్రం.. అధిక కోరికలు, ప్రవర్తనలను గుర్తించేందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకూడదని అభిప్రాయపడ్డారు.
అయితే సెక్స్ కోరికలు పెరగడం, వ్యసనంగా మారడం అనేది కేవలం ఆ సమస్యకు సంబంధించిందేనా.. లేకుంటే అంతర్లీనంగా మరో సమస్య ఏమైనా ఉందా అనేదీ చూడాల్సి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)