You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇంటి అద్దె వద్దు... సెక్స్ కావాలంటున్నారు
- రచయిత, ఎలీ ఫ్లిన్
- హోదా, బీబీసీ రేడియో త్రీ
ఆ రోజు శుక్రవారం సాయంత్రం... సెంట్రల్ లండన్‌లో ఒక చోట 25 ఏళ్ల కుర్రాడి ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నా. తూర్పు లండన్‌లో తన ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తానన్నాడు. అది కూడా ఎలాంటి అద్దె లేకుండా.. అతనెందుకు నా మీద అంత దయ చూపిస్తున్నాడో తెలుసా?
అతని ఉచితం వెనుక ఒక షరతు ఉంది. అద్దెకు బదులుగా అతనితో సెక్స్‌కు ఒప్పుకోవాలట.
అసలు యూకేలో ఈ రెంట్ ఫర్ సెక్స్ ఏ స్థాయిలో విస్తరిస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నా. బీబీసీ త్రీ కోసం దీనిపై ఒక డాక్యుమెంటరీ చేయడానికి సిద్ధమయ్యా. నా అసలు పేరు బయట పెట్టకుండా యూకేలో ఎంతమంది ఇంటి యజమానులు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నా.
ఇల్లు అద్దెకు కావాలని, నా వయసు 24 ఏళ్లు, నర్సుగా పనిచేస్తున్నాని ఒకరికి ఫోన్ చేశా.
స్నేహితులతో కలసి ఒక ఇంట్లో ఉంటున్నానని, మీరు కూడా నాతో ఉండొచ్చని అతను చెప్పాడు. తన రూంమేట్స్‌తో ఏ సమస్య ఉండదని అన్నాడు. నన్ను తన గర్ల్ ఫ్రెండ్‌గా వారికి పరిచయం చేస్తానని చెప్పాడు.
దానికి నేను అంగీకరించకపోవడంతో నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు.
అతనొక్కడే కాదు చాలా మంది రెంట్ ఫర్ సెక్స్ ప్రతిపాదనలు నా ముందు ఉంచారు. బాగా పేరున్న ఒక క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌లో వెతికితే ఇలాంటి ప్రతిపాదనలు ఒక డజన్ కనిపించాయి.
ఆ ప్రకటలన్నీ యూకే నుంచి వచ్చినవే. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల నుంచి ఇలాంటి ప్రకటనలు కనిపించాయి. అలాంటి ప్రకటనలకు నేను సమాధానం ఇవ్వడం మొదలు పెట్టా.
కొన్ని నిమిషాల్లోనే ఒకరు అలాంటి ప్రతిపాదనతో స్పందించారు. నా బాడీ, బ్రా సైజు అడిగాడు. ఇంకో వ్యక్తి మనం వాట్సాప్‌లో ఎందుకు చాట్ చేయకూడదు అని ప్రశ్నించాడు.
ఇలాంటి ప్రతిపాదలనతో వచ్చిన కొంతమంది ఇంటి యజమానులను ప్రత్యక్షంగా కలుసుకోడానికి సిద్ధమయ్యా. వాళ్ల ఆలోచన ధోరణి చూస్తే ఆశ్చర్యమేసింది. ఒకరికి నిండా 24 ఏళ్లు కూడా ఉండవు. ఇంకో వ్యక్తి తన కూతురు పడక గదిని ఉచితంగా వాడుకోమని చెప్పాడు.
ఆ 24 ఏళ్ల కుర్రాడు తనతో రెండు రోజులకొకసారి సెక్స్‌లో పాల్గొనాలని షరతు పెట్టాడు. ఏ గూడు లేని యువతులకు ఇలాంటి వారి వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందోనని ఊహించుకున్నా. కొంతమందికి ఇలాంటి నీచపు ఆలోచనలు ఎలా వస్తాయో అనిపించింది. అలా అడిగితే ఒక మహిళగా నేను ఎంత ఇబ్బంది పడుతానో కూడా వాళ్లు ఆలోచించినట్లు కనిపించడం లేదు.
నిజానికి, చాలా మంది ఇంటి యజమానులు రెంట్ ఫర్ సెక్స్ అనేది తప్పే కాదని భావిస్తున్నారు. కానీ, ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం చట్ట వ్యతిరేకం. రెంట్ ఫర్ సెక్స్ ప్రకటనలు వ్యభిచారం లాంటిదే అవుతుంది. ఇలాంటి నేరాలకు ఇంగ్లాండ్, వేల్స్‌లో 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.
ఇప్పటి వరకు కలిసిన ఇంటి యజమానులకు నా పరిశోధన గురించి లేఖ రాశాను. వారి స్పందన కూడా అడిగాను.
ఒకతను పరస్పర లైంగిక ఒప్పందం గురించే తాను ప్రతిపాదించానని సమాధానం ఇచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని సమర్థించుకున్నాడు. ఇంకో వ్యక్తి అలాంటి ఉద్దేశమే తనకు లేదని, కలిసి ఉందామని మాత్రమే ప్రతిపాదించానని చెప్పాడు.
ఇలాంటి ప్రకటనలు చూసి కూడా స్పందించేది ఏ దిక్కూ లేని మహిళలే. అలాంటి 20 ఏళ్ల యువతిని నేను కలిశాను. ఆమెకు ఇంటి యజమానిని కలిసే వరకు కూడా ఈ రెంట్ ఫర్ సెక్స్ అగ్రిమెంట్ గురించి తెలియదు. విషయం తెలియగానే ఆమె ఆ ఇంట్లో ఉండటానికి నిరాకరించింది.
''ఇంటి యజమానితో పడక పంచుకోవాలని నాకు తెలియదు. దానికి నేను అంగీకరించలేదు. అతను పదే పదే నన్ను తాకడానికి ప్రయత్నించాడు. కానీ, నాపై ఒత్తిడి చేయలేద'ని ఆమె తెలిపింది.
న్యూకాస్టేలోని ఒక ఇంటి యజమాని ఉచితంగా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు ''నేను ఒంటరిని, నాకు కంపెనీ ఇస్తే చాలు అన్నాడు''. అది కూడా రెంట్ ఫర్ సెక్స్ లాంటిదే.
నేను కలిసిన చాలా మంది ఇంటి యజమానులు తాము చేస్తున్నది తప్పు అని అనుకోవడం లేదు.
మన సమాజంలో బలహీనులను ఏమైనా అడగొచ్చు, అది ఆమోదనీయమే అనే పరిస్థితి కనిపిస్తుంది.
టెనెంట్స్ యూనియన్ అండ్ ఆంటీ పావర్టీ గ్రూప్ సంస్థ ఎకార్న్‌కు చెందిన ఎల్లెన్ మోరాన్ ఈ ఘటనలపై మాట్లాడుతూ, ''రెంట్ ఫర్ సెక్స్ అనేది చట్టవ్యతిరేకం, నేరం. నాయకులు వీటిపై చర్యలు తీసుకునేలా చట్టం చేయడం విస్మరించారు'' అని పేర్కొన్నారు.
ఇతని సంస్థ రెంట్ ఫర్ సెక్స్ విషయాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇలాంటి ప్రకటనలపై నిషేధం విధించాలని, లైంగికంగా వేధించే ఇలాంటి ప్రతిపాదనలను ఆధునిక బానిస చట్టం కింద తీసుకొచ్చి ఇంటి యజమానులను విచారించాలని కోరుతోంది.
''అధికారులు వీటిని నేరంగా ప్రకటించాలి. నిజమైన మార్పుతోనే ఇలాంటి సమస్యలను పరిష్కరించగలం'' అని మోరాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)