వెనిస్‌: నీటిపై తేలియాడే నగరాన్ని ముంచెత్తిన వరదలు.. ఇటలీ గుండెకు గాయమైందన్న ప్రధాని

వెనిస్ అందమైన చారిత్రక నగరం. ఇటలీ ఈశాన్య తీరంలో నీళ్లపై తేలియాడుతున్నట్లుండే ఈ నగరం వందకు పైగా దీవుల సముదాయం. ఇక్కడ 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా గత వారం వరదలు సంభవించాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది.

ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన వెనిస్‌ను 1.87 మీటర్లు అంటే ఆరడుగుల ఎత్తున వరద నీరు ముంచెత్తింది. కెరటాలు అత్యధిక ఎత్తులో వచ్చినప్పుడు 80 శాతానికి పైగా నగరం వరద బారిన పడింది.

చారిత్రక సెయింట్ మార్క్స్ బాసిలికా చర్చ్‌లోకి నీరు పోటెత్తింది. నగరంలో ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇది ఇటలీ గుండెకు గాయం: ప్రధాని

వెనిస్ వరదలను ఇటలీ గుండెకు అయిన గాయంగా ప్రధానమంత్రి గ్యుసెప్ కాంటే వ్యాఖ్యానించారు. వెనిస్‌ను ఆదుకోవడానికి నిధులు, వనరులు ప్రభుత్వం సత్వరం సమకూరుస్తుందని చెప్పారు.

వెనిస్‌కు, నరగ కళాత్మక వారసత్వ సంపదకు వాటిల్లిన నష్టాన్ని చూస్తుంటే బాధేస్తోందని, వెనిస్ వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయని ప్రధాని ఫేస్‌బుక్‌లో చెప్పారు. వరద బాధిత ప్రాంతాన్ని ఆయన బుధవారం సందర్శించారు.

గురువారం పురావస్తు ప్రదర్శనశాలలు చాలా వరకు మూసేసి ఉన్నాయని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు- రానున్న రోజుల్లోనూ అలలు ఎక్కువ ఎత్తులో ఉంటాయనే సంకేతమిస్తూ సైరన్లు మోగించారు.

ఇంత తీవ్రస్థాయి వరదలకు వాతావరణ మార్పులే కారణమని వెనిస్ మేయర్ లూగీ బ్రుగ్నారో చెప్పారు. వరదల ప్రభావం భారీగా ఉందని, ఇది నగరంపై శాశ్వతంగా ఉంటుందని విచారం వ్యక్తంచేశారు.

వెనిస్‌లోని అత్యంత లోతట్టు ప్రాంతాల్లో ఒకటైన సెయింట్ మార్క్స్ స్క్వేర్- వరద నష్టం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి.

సెయింట్ మార్క్స్ బాసిలికా చర్చ్‌కు తీవ్రమైన నష్టం కలిగిందని మేయర్ చెప్పారు.

చర్చి నేలమాళిగ మొత్తం వరద బారిన పడింది. చర్చి స్తంభాలు కూడా దెబ్బతిని ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నష్టం పదుల కోట్ల యూరోల్లో ఉంటుందని మేయర్ అభిప్రాయపడ్డారు.

చర్చిలోంచి, చర్చి 12వ శతాబ్దం నాటి నేలమాళిగలోంచి నీటిని బయటకు తోడిపోసేందుకు బుధవారం పంపులు ఏర్పాటు చేశారు.

వెనిస్లో నీటి స్థాయి పెరగగానే చాలా మంది పర్యాటకులు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. పర్యాటకులను తిరిగి వెనిస్‌కు రావాలని చిన్న వ్యాపారులు కోరుతున్నారు.

ఓ వ్యాపారి మేయర్తో మాట్లాడుతూ- పర్యాటకంపైనే తన వ్యాపారం ఆధారపడి ఉందని, అయితే వరదతో తన దుకాణం కొట్టుకుపోయిందని తెలిపారు.

వెనిస్లో దాదాపు ఏటా వరదలు వస్తుంటాయి. 1923లో గణాంకాలను అధికారికంగా నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక్కసారే అలలు ఇప్పటి వరదల అలల కన్నా ఎక్కువ ఎత్తున్నాయి.

1966లో 1.94 మీటర్ల ఎత్తున అలలు వచ్చాయి.

తాజా వరదల వల్ల వెనిస్ దీవుల్లో ఒకటైన పెల్లెస్ట్రినాలో ఇద్దరు చనిపోయారు.

పౌర్ణమి/అమావాస్య సందర్భంగా ఏర్పడే ఎత్తైన అలలు, ఆడ్రియాటిక్ సముద్రం మీదుగా ఈశాన్య దిశలో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో నీటిమట్టంలో పెరుగుదల వల్ల వెనిస్‌లో తాజా వరదలు సంభవించాయి.

ఈ రెండు పరిణామాలూ ఒకేసారి సంభవించడాన్ని 'ఆక్వా ఆల్టా'(ఎక్కువ ఎత్తులో నీరు రావడం) అంటారు.

పెరుగుతున్న సముద్ర నీటిమట్టం, చలికాల తుపాన్ల ముప్పును ఎదుర్కొనేందుకు వెనిస్‌కు రక్షణ ఏర్పాట్లను వేగంగా పూర్తిచేస్తామని ప్రధాని కాంటే తెలిపారు. ఈ ప్రాజెక్టును 'మోస్ వరద రక్షణ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా 'హైడ్రాలిక్ బారియర్' ఏర్పాటు చేస్తారు.

ఈ ప్రాజెక్టును 2013లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. అప్పుడు దీనిని పాక్షికంగా అమలు చేసి విజయవంతమయ్యారు.

ఇది 2021 చివరకు పూర్తికాకపోవచ్చని ప్రధాని తెలిపారు.

మోసె ప్రాజెక్టు పనులు 2003లోనే మొదలయ్యాయి. దీనిపై ఇప్పటికే వందల కోట్ల యూరోలు వెచ్చించారు.

ఇందులో అవినీతి, అవకతవకల ఆరోపణలు వచ్చాయి. వరద రక్షణ ఏర్పాట్లకు కేటాయించిన దాదాపు రెండు కోట్ల యూరోల కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపణలతో 2014లో వెనిస్ మేయర్ పదవి నుంచి జార్జియో ఒర్సోని తప్పుకొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)