అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?

భారత భూభాగంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు చుట్టూ తీరం వెంబడి వెయ్యికి పైగా పక్షులు చనిపోయాయి.

వీటిలో ఏటా వచ్చే వలస పక్షులు, 10కి పైగా జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి. సరస్సు జైపూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పక్షుల మరణానికి కారణాలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

ప్రాణాలతో ఉన్న 20 నుంచి 25 పక్షులకు వైద్యం అందిస్తున్నామని అటవీశాఖ సీనియర్ అధికారి సంజయ్ కౌశిక్ తెలిపారు. చనిపోయిన పక్షుల లెక్కింపు ఇంకా కొనసాగుతోందన్నారు.

'చనిపోయిన పక్షుల సంఖ్య 5 వేల వరకు ఉండొచ్చు'

ఆదివారం సరస్సు సందర్శనకు వచ్చిన పర్యాటకులు, పక్షులు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఇన్ని పక్షులు చనిపోవడం తాము ఎన్నడూ చూడలేదని పక్షులను చూడటానికి వచ్చే స్థానికుడు అభినవ్ వైష్ణవ్ వార్తాసంస్థ పీటీఐతో చెప్పారు.

సరస్సు చుట్టూ 12 నుంచి 15 కిలోమీటర్ల మేర చనిపోయిన పక్షులు పడి ఉన్నాయని సరస్సు ప్రాంతంలో ఉన్న 'డౌన్‌ టు ఎర్త్' పత్రిక ఫొటోగ్రాఫర్ వికాస్ చౌధరి తెలిపారు.

మరణించిన పక్షుల సంఖ్య ఐదు వేల వరకు పెరగొచ్చని ఆయన బీబీసీతో చెప్పారు.

వడగళ్ల వానే కారణమా?

ప్రాణాలు కోల్పోయిన పక్షుల్లో రడ్డీ షెల్డక్, రడ్డీ టర్న్‌స్టోన్, నార్తర్న్ షోవ్లర్, స్టిల్ట్, కూట్, ఇతర పక్షులు ఉన్నాయి.

వీటిని సరస్సుకు సమీపంలో గొయ్యి తీసి పాతిపెడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం వడగండ్ల వాన పడిందని, దీనివల్లే పక్షులు చనిపోయి ఉండొచ్చని అటవీశాఖ అధికారి రాజేంద్ర జఖర్ పీటీఐతో చెప్పారు.

నీరు విషతుల్యం కావడం, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం లాంటి కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

పక్షుల మరణానికి బర్డ్ ఫ్లూ కారణం కాదని స్థానిక వైద్యుడు స్పష్టంచేశారని చెప్పారు.

మరణించిన కొన్ని పక్షులను పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రయోగశాలకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)