You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
17 మంది కర్నాటక ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించిన సుప్రీంకోర్టు.. వీరు ఉప ఎన్నికల్లో పోటీచేయొచ్చని ప్రకటన
కర్నాటకలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది.
స్పీకర్ ఉత్తర్వును తాము సమర్థిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రకటించారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జులైలో నాటి స్పీకర్ ఈ 17 మందిపై అనర్హత వేటు వేశారు. వీరిలో 14 మంది కాంగ్రెస్ పార్టీకి, ముగ్గురు జనతాదళ్(సెక్యులర్) పార్టీకి చెందిన రెబల్ నేతలు.
వీరి అసమ్మతి, రాజీనామా హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీశాయి.
స్పీకర్ నిర్ణయాన్ని ఈ నాయకులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ 17 మంది ప్రస్తుత శాసనసభ కాలపరిమితి ముగిసేదాకా 2023 వరకు ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వీరు ఉప ఎన్నికల్లో పోటీచేయొచ్చని ప్రకటించింది.
అనర్హతపై మీరు నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి ఉండాల్సింది కాదని, ముందు హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని పిటిషనర్లను ఉద్దేశించి జస్టిస్ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మురారిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అనర్హత వేటు పడ్డ నాయకుల్లో ఒకరైన ఏహెచ్ విశ్వనాథ్, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.
వేటు పడ్డ 17 మంది ఉప ఎన్నికల్లో పోటీచేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వాగతించారు.
మొత్తం అన్ని స్థానాల్లో తాము విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ 17 మంది బీజేపీలో చేరబోతున్నారా అని మీడియా అడగ్గా, సాయంత్ర వరకు వేచి చూడాలని ఆయన బదులిచ్చారు. వీరితో, బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తానని, సాయంత్రం తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కుమారస్వామి: కుర్చీ ఇస్తే ఖాళీ చేయలేదు
- కర్ణాటక: రెడ్డి బ్రదర్స్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
- రాజకీయాలను తలకిందులు చేసిన 5 బలపరీక్షలు
- 9 నెలల్లో 97 పేలుళ్లు, స్వీడన్లో ఏం జరుగుతోంది
- అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్ కన్సార్షియం
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)