You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- రచయిత, రిపోర్టర్: బళ్ల సతీశ్/షూట్, ఎడిట్: నవీన్ కుమార్ కె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య ఉన్న మైదాన ప్రాంతాన్ని ఆకుపచ్చగా మార్చింది.
170 ఏళ్ల క్రితం వరకూ అతివృష్టీ, అనావృష్టిలతో దారుణ పరిస్థితుల్లో ఉండేవి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు.
సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజినీరు 1847లో ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించడంతో పరిస్థితి మారింది.
గోదావరి పాయలుగా విడిపోతున్న ప్రాంతంలో కట్టిన ఈ ఆనకట్ట కింద, పటిష్టమైన కాలువల వ్యవస్థ ఉంది. దీంతో 10 లక్షలకు పైగా ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందింది. అందుకే, తమ బతుకు చిత్రాన్ని మార్చిన కాటన్‌ను స్థానికులు దేవుడిలా పూజిస్తారు.
‘‘ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా తీర్చిదిద్దిన మహానుభావుడు కాటన్ గారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన్ను దేవుడిగా కొలిచే ఆనవాయితీ ఉంది ఇక్కడి రైతులకు’’ అని సత్తి భాస్కర రెడ్డి అనే రైతు చెప్పారు.
ఈ ప్రాంతం వారి ఆర్థిక ఎదుగుదలకు, సాంస్కృతిక వికాసానికీ మంత్రదండంలా పనిచేసింది ధవళేశ్వరం బ్యారేజ్. పంటలు పండాయి. వ్యవసాయ మిగులు పెరిగింది. క్రమంగా వారు విద్య, సినిమాలు, ఆహార ఉత్పత్తులు, ఐటి.. ఇలా ఎన్నో రంగాల్లో మిగిలిన వారి కంటే ముందుగా అడుగుపెట్టగలిగారు.
అయితే పచ్చటి పొలాల మధ్యే సన్నటి కన్నీటి కాలువలూ ఉన్నాయి. వ్యవసాయ రంగ సమస్యలు ఇక్కడి రైతుల్ని పీడిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో 80 శాతానికి పైగా వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు.
‘‘ఒక పదహారు కుంచాలు సొంత చేను ఉండేదండి. దరిదాపు 3 ఎకరాలు చేను కౌలు చేసేవాడినండి. చెఱుకు తోటండి.. ఊడుపు మయానండి. పంటలు వేసి పండించానండి. దాని మీదటండి, నీరు ఎద్దడొచ్చి నీరు సరిపోక, ప్రకృతి సవ్యంగా లేక, మార్కెట్ రేట్లు కూడా తేడా వచ్చాయండి, లేబర్ ఖర్చు ఎక్కువ గురించండి, గిట్టుబాటు అవక నాకు నేను తగ్గిపోయానండి’’ అని తూము పెద్ద కాపు అనే మరొక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరిలో ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గుతూడడంతో, ఇక్కడ రెండో పంటకు ఇబ్బంది పెరుగుతోంది. ఈ నదిలో వానా కాలంలో వచ్చే నీళ్లను ఒడిసిపట్టేందుకు పోలవరం నిర్మిస్తున్నారు. దీని ద్వారా గోదావరి కృష్ణా డెల్టాలను స్థిరీకరించడంతో పాటూ కృష్ణా నీరు రాయలసీమకు ఇవ్వవచ్చని ప్రణాళిక. అటు కేంద్రం కూడా గోదావరి మిగులు నీటిని తమిళనాడు వరకూ తీసుకెళ్లే ఆలోచనలో ఉంది.
ప్రతీ ఏటా వర్షా కాలంలో సుమారు 1500 - 2000 టిఎంసీల వరద నీరు గోదావరి ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుని ఈ ప్రాంతంలో పచ్చదనం పెంచాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అన్నంపెట్టే పొలం, అడవితల్లి, రెండూ దూరమౌతున్నాయి
- మనం తాగే నీటికి డైనోసార్ల బ్యాక్టీరియాకు సంబంధం ఏమిటి?
- వీడియో: తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు - బీబీసీ 'మై విలేజ్ షో'
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది?
- వైసీపీ మేనిఫెస్టో: 'రెండు లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ... మూడు దశల్లో మద్య నిషేధం'
- ఆ ఊళ్లో బతకాలంటే ఆపరేషన్ తప్పనిసరి
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)