డోనల్డ్ ట్రంప్: 'అవసరమైతే అమెరికాలో అత్యవసర పరిస్థితి విధిస్తా'

ట్రంప్

కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మించడానికి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

సరిహద్దు గోడకు నిధుల కోసం చేసిన విజ్ఞాపనను సీనియర్ డెమాక్రాట్స్ తిరస్కరించిన తరువాత ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

సరిహద్దు గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు లభ్యమయ్యేంత వరకు ప్రభుత్వానికి పూర్తిగా నిధులు అందించే బిల్లుకు మద్దతు ఇవ్వడంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ చెప్పడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

పాక్షిక షట్ డౌన్‌కు తాను సిద్ధంగానే ఉన్నానని కూడా ట్రంప్ చెప్పారు. దీనివల్ల డిసెంబర్ 22 నుంచి దాదాపు 8,00,000 ఫెడరల్ కార్మికులకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.

ట్రంప్ మద్దతుదారులు, చట్టసభల ప్రతినిధులు ఈ ప్రతిష్ఠంభన తొలగించడానికి శనివారం మరోసారి సమావేశం అవుతున్నారు.

నాన్సీ పెలోసీ, చుక్ షూమర్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వెస్ట్ వింగ్ నుంచి బయటకు వస్తున్న డెమాక్రాట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సేనేట్ మైనారిటీ లీడర్ చుక్ షూమర్

శుక్రవారం నాటి సమావేశంలో ఏం జరిగింది?

వైట్ హౌస్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశం సత్ఫలితాన్నిచ్చిందని రిపబ్లికన్ అధ్యక్షుడు మొదట సానుకూలంగానే స్పందించారు.

అయితే, నిధుల విడుదల విషయంలో అవసరమైతే యు.ఎస్ కాంగ్రెస్‌ను పక్కన పెట్టడం కోసం అత్యవరస పరిస్థితి విధించగలిగే అధ్యక్షుడి అధికారాల గురించి కూడా ఆలోచించారా అని అడిగినప్పుడు, "నేను ఆ నిర్ణయం కూడా తీసుకోవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించే, గోడను వేగంగా నిర్మించే అవకాశం లేకపోలేదు. సరిహద్దు గోడ నిర్మాణం సాధ్యం కావాలంటే అదొక ప్రత్యామ్నాయం" అని ట్రంప్ బదులిచ్చారు.

"నేను ఏం చేస్తున్నానో అందుకు నాకు గర్వంగా ఉంది. నేను దీన్ని షట్‌డౌన్‌ అనను. ఇది దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రత కోసం చేయాల్సిన విధి అని అంటాను" అని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: