You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్: ఐవీఎఫ్ ప్రభావంతో... తగ్గిపోతున్న ‘పిల్లల దత్తత’
ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం పొందే ప్రక్రియ విజయవంతం అవుతున్నందున పిల్లలను దత్తత తీసుకోవడం బ్రిటన్‌లో తగ్గిపోతోంది.
40 ఏళ్ల క్రితం 1978లో ఐవీఎఫ్ ద్వారా ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. అప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లండ్, వేల్స్‌లో దత్తత తీసుకోవడం 62 శాతం తగ్గింది.
అదే సమయంలో 35 ఏళ్లలోపు మహిళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేటు దాదాపు మూడు రెట్లు పెరిగింది.
"గతంలో ఐవీఎఫ్ 7 శాతం మాత్రమే విజయవంతం అయ్యేది, కానీ ప్రస్తుతం అది 30 శాతం వరకు పెరిగింది" అని బాలలు, ఫ్యామిలీ కోర్టు సలహా మరియు సహాయ సేవల సంస్థ అధ్యక్షులు ఆంథోనీ దౌగ్లాస్ చెప్పారు.
అధికారిక గణాంకాల ప్రకారం 1978లో ఇంగ్లండ్, వేల్స్‌లో 12,121 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు.
2017లో చూస్తే ఇంగ్లండ్‌లో 4,350 మంది, వేల్స్‌లో 300 మంది శిశువులను మాత్రమే దత్తత తీసుకున్నారు.
దత్తత తీసుకోవడం తగ్గుతున్నందున ఇంగ్లండ్‌లోని శిశు సంరక్షణ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. 2017 మార్చి లెక్కల ప్రకారం, ఇంగ్లండ్‌లో 72,670 మంది చిన్నారులు కేర్ సెంటర్లలో ఉంటున్నారు.
సంరక్షణ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నందున వారిని దత్తత తీసుకునేందుకు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ముందుకు రావాలంటూ ఇటీవల వేల్స్‌లో నేషనల్ అడాప్షన్ సర్వీస్ సంస్థ పిలుపునిచ్చింది.
"ప్రతి చిన్నారికీ ఆప్యాయత, ఒక కుటుంబం అవసరం. అది వాళ్ల హక్కు. చిన్నారులను దత్తత తీసుకోవడం ద్వారా వేలాది కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. సంతానం కోసం చూస్తున్నవారు దత్తత గురించి ఆలోచించాలి" అని ఇంగ్లండ్ విద్యాశాఖ అధికార ప్రతినిధి అన్నారు.
"దత్తత సహాయ నిధికి 90 మిలియన్ పౌండ్లు(సుమారు రూ. 851 కోట్లు) కేటాయించాం. దత్తతను మరింత ప్రోత్సహించేందుకు ప్రాంతీయ దత్తత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.
ఐవీఎఫ్ అంటే ఏమిటి?
ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సలో భాగంగా ప్రయోగశాలలో అండం ఫలదీకరణ చెందాక దాన్ని తిరిగి గర్భాశయంలో ప్రవేశపెడతారు.
ఈ విధానం తొలిసారిగా 1977 నవంబర్ 10న విజయవంతమైంది. 1978 జూలై 10న ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ శిశువు లూయీస్ బ్రౌన్ జన్మించారు.
సంతాన సమస్యలు ఎదుర్కొనే దంపతులు ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు.
బ్రిటన్‌కు చెందిన 'హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ' లెక్కల ప్రకారం ఐవీఎఫ్ ద్వారా తల్లులుగా మారుతున్న మహిళల సంఖ్య 2014 నుంచి 35 శాతం మేర పెరిగింది.
భారత్‌లో కూడా క్రమంగా ఈ ట్రెండ్ పెరుగుతోంది. గతేడాది కరణ్ జోహర్, తుషార్ కపూర్ లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ పద్ధతి ద్వారానే సంతానం పొందారు.
భారత్‌లో నియమాలు
భారత్‌లోని నియమాల ప్రకారం గతంలో తల్లయిన మహిళల నుంచి మాత్రమే అండాన్ని సేకరించే వీలుంటుంది. ఆ అండాన్ని ఇంజెక్షన్ ద్వారా శరీరం నుంచి బయటకు తీస్తారు. తరువాత దాన్ని పురుషుడి వీర్యంతో కలుపుతారు.
ప్రయోగశాలలో వీర్యం-అండం కలయిక ద్వారా పిండాన్ని వృద్ధి చేస్తారు. తర్వాత ఆ పిండాన్ని మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు.
గతేడాది భారత ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఒంటరి వ్యక్తులు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి వీల్లేదు. భారతీయ చట్ట ప్రకారం వివాహాం చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- శ్రీలంక రాజకీయ సంక్షోభం: వ్యూహ ప్రతివ్యూహాల ఉద్రిక్త సందర్భం
- ‘వైద్యుల్లో సగం మంది ఆదాయ పన్ను కట్టలేదు’
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- రైల్వే ఉద్యోగాలు: లక్ష పోస్టులకు రెండు కోట్ల దరఖాస్తులు
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- అభిప్రాయం: కాంగ్రెస్ - టీడీపీ కలయికను ఎలా అర్థం చేసుకోవచ్చు?
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: జనాభాకు తగిన ప్రాతినిధ్యం ఉందా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.