You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీర్యకణాలు ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలో...!
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
గర్భం దాల్చే ప్రక్రియలో (ఫలదీకరణ కోసం) వీర్యకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే ప్రయాణం ఎలా సాగుతుంది? మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి? ఈ విషయంలో పరిశోధకులు కొన్ని కొత్త విషయాలను కనుగొన్నారు.
అయస్కాంతం చుట్టూ ఏర్పడే క్షేత్రం మాదిరిగానే వీర్యకణాల తల, తోకల కదలికలు ఉంటాయని బ్రిటన్, జపాన్ పరిశోధకులు వెల్లడించారు.
ఆ కదలికలు వీర్యకణాలు ఫలదీకరణ కోసం స్త్రీ ఫాలోపియన్ నాళం దిశగా వెళ్లేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్యంలో 5 కోట్ల నుంచి 15 కోట్ల వీర్యకణాలు ఉంటాయి.
అవన్నీ స్త్రీ ఫాలోపియన్ నాళం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. కానీ, అందులో కేవలం ఓ పది కణాలు చివరి దాకా వెళ్లగలుగుతాయి.
ఆఖరికి అండంతో ఫలదీకరణ చెందేది మాత్రం ఒక్క కణమే.
దారిలో ఎన్ని అడ్డంకులో..
అయితే ఈ ప్రయాణంలో అనేక అవాంతరాలు ఎదురవుతాయి. చాలా కణాలు యోనిలోని పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి.
ఆ తర్వాత మధ్యలో దాడిచేసి చంపేందుకు తెల్లరక్త కణాలు కాచుకుని ఉంటాయి. వాటి నుంచి కూడా తప్పించుకోవాలి.
ఇన్ని అడ్డంకులను దాటుకుని ఫాలోపియన్ నాళాలను చేరుకోవాలి.
అప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. అది కూడా ఆ సమయానికి స్త్రీ అండం విడుదలై సిద్ధంగా ఉంటేనే!
లేదంటే ఆ వీర్యకణం నిష్ఫలం అవుతుంది.
ఇతర కణాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసుకుంటే పురుషుల్లో సంతాన లోపాలకు చికిత్స అందించే వీలుంటుందని పరిశోధనా రచయిత డాక్టర్. హెర్మెస్ గడెల్హ తెలిపారు.
వీర్యకణాల తోకల కదలికలపై ఆయన బృందం పరిశోధనలు చేసింది. ఆ వివరాలను ‘ఫిజికల్ రివ్యూ లెటర్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
"వీర్యకణాల గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. తాజా పరిశోధనలో గుర్తించిన విషయాలు సంతాన సమస్యల పరిష్కారానికి కొద్ది మేర సాయపడతాయి. ఇంకా వీర్యకణాల సంఖ్య, ఆ కణాల తలలో ఉండే డీఎన్‌ఏ వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌కి చెందిన వీర్యకణాల నిపుణులు ప్రొఫెసర్. అలాన్ పాసే అన్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)