లయన్ ఎయిర్ ప్రమాదం: డ్రోన్లతో గాలింపు

ఫొటో సోర్స్, Reuters
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 189 మంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్రంలో కూలిపోయింది. ఈ విమాన శకలాలు, బతికి ఉన్నవారి అన్వేషణకు సోనార్, డ్రోన్లను రంగంలోకి దించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ప్రాణాలతో బయటపడిన వారికి సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు.
చౌక-ధరల విమానయాన సంస్థ అయిన లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్-737 విమానం పశ్చిమ ప్రాంతంలోని పంగ్కల్ పినాంగ్ నగరానికి బయలు దేరింది. కానీ, టేకాఫ్ అయిన కాసేపటికే అది సముద్రంలో కూలిపోయింది. సహాయ సిబ్బందికి సముద్ర జలాల్లో కొన్ని మృతదేహాలు, పిల్లల బూట్లు వంటి ప్రయాణికుల వస్తువులు లభించాయి.

ఈ విమానంలోని ప్రయాణికులు-సిబ్బందిలో ఎవరూ ప్రాణాలతో బయటపడిన దాఖలాలు కనిపించలేదు. ఆగస్ట్ నెల నుంచి ఉపయోగంలో ఉన్న ఈ విమానం కూలిపోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు.
బోయింగ్-737కు ఆధునిక రూపమైన బోయింగ్ 737-మ్యాక్స్ ఇంతపెద్ద ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
"విమానానికి సంబంధించిన ప్రధాన భాగాన్ని వెతకాలి. శకలాల తీరు చూస్తుంటే అందులో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదనిపిస్తోంది" అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషనల్ డైరెక్టర్ బాంబాంగ్ సుర్యో అన్నారు.
ప్రయాణికుల కుటుంబ సభ్యులు మృతులను గుర్తించడానికి ఆస్పత్రికి వెళ్ళాలని వారు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
అసలేం జరిగింది?
ఫ్లయిట్ జెటి 610 విమానం జకార్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరింది.
అది ఒక గంట తరువాత పంగ్కల్ పినాంగ్‌లోని డెపాటి అమిర్ విమానాశ్రయంలో దిగాలి. కానీ, బయలుదేరిన 13 నిమిషాల్లోనే ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.
లయన్ ఎయిర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్వర్డ్ సిరెయిట్ ఈ ఘటనపై స్పందిస్తూ, "ఈ విమానానికి గతంలో ఒక సాంకేతిక సమస్య" వచ్చిందని, అయితే, దాన్ని పరిష్కరించామని చెప్పారు.
ఈ విమానయాన సంస్థకు 'బోయింగ్ 737 మ్యాక్స్ 8' విమానాలు 11 ఉన్నాయి. మిగతా వేటిలోనూ ఇలాంటి సాంకేతిక సమస్య ఉత్పన్నం కాలేదని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి సుటోపో పుర్వో నుగ్రోహో, సముద్రంలో తేలియాడుతున్న ప్రయాణికుల వస్తువులు, విమాన శకలాల చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'ఆమె లేకుండా నేను బతకలేను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను'
విమానంలోని ప్రయాణికుల బంధువులు జకార్తాలోని హాలిం పెర్డానాకుసుమా విమానశ్రయంలో అధికారులు ఏం చెబుతారా అని కన్నీరుమున్నీరవుతూ ఎదురు చూస్తున్నారు.
ఒక టెంటులో లయన్ ఎయిర్ సిబ్బంది ప్రయాణికుల బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న ఫార్మ్‌లో ప్రయాణికులతో బంధుత్వం ఏమిటన్నది మొదటి ప్రశ్న.

అక్కడికి వచ్చిన ముర్టాడో కుర్నియావన్ భార్య ఆ విమానంలో ప్రయాణించారు. వాళ్ళకు కొత్తగా పెళ్ళయింది.
"ఆమె లేకుండా నేను బతకలేను. ఆమెను నేను ప్రేమిస్తున్నాను" అని ముర్టాడో బిగ్గరగా ఏడ్చారు. విమానం కూలిపోయిందన్న వార్త వినగానే పూర్తిగా కుంగిపోయానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పైలట్ భారతీయుడు
ఈ విమానానికి దిల్లీకి చెందిన భవ్యే సునేజా పైలట్‌గా ఉన్నారని.. హర్వినో కో పైలట్ అని లయన్ ఎయిర్ వెల్లడించింది.
సునేజా ఇప్పటి వరకు 6000 గంటలకుపైగా విమానాన్ని నడిపారని వివరించింది.

ఫొటో సోర్స్, facebook
ఈ విమానం గురించి..
ఈ విమానం బోయింగ్ 737 మ్యాక్స్ 8 మోడల్‌కు చెందినది. ఈ విమానంలో 210మంది వరకూ ప్రయాణించడానికి వీలుంది.
అయితే మ్యాక్స్ 8 విమానంలో మొదటి నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఏవియేషన్ కన్సల్టాంట్ గెర్రీ సోజెత్‌మ్యాన్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, AFP
భద్రత విషయంలో ఈ కంపెనీ చరిత్ర ఎలా ఉందంటే..
ఇండోనేసియా దేశం.. చిన్న చిన్న దీవుల సమూహం. ఇక్కడ విమానయానం మీదనే ఎక్కువగా ఆధారపడతారు. కానీ భద్రత విషయంలో ఇక్కడి విమానయాన సంస్థల రికార్డు సరిగా లేదు.
లయన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండోనేషియాలోనే అతి పెద్ద సంస్థ. ఈ విమానాల్లో ప్రయాణం చవక కూడా. ఇండోనేసియా దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.
1999లో ఈ కంపెనీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భద్రత, నిర్వహణ విషయంలో మొదటి నుంచి సమస్యలు తలెత్తుతుండటంతో 2016 వరకు యూరప్ గగనతలంపై ఈ విమాన సర్వీసులను నిషేధించారు.
2013లో ఈ సంస్థకు చెందిన ఓ విమానం బాలి దీవిలో ల్యాండ్ అవుతున్న సమయంలో సమస్య తలెత్తి సముద్ర తీరం వద్ద ల్యాండ్ అయ్యింది. అయితే అందులో ప్రయాణిస్తున్న 108 మంది సురక్షితంగా బయటపడ్డారు.
2004లో జకార్తా నుంచి వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








