గ్రౌండ్ రిపోర్ట్: అనుమానం వస్తేనే.. కొట్టి చంపేస్తారా?

- రచయిత, ఫైసల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేల మీద ఉన్న మరకలను బట్టి అక్కడ తీవ్రమైన రక్తస్రావం జరిగిందని తెలుస్తోంది. అంతే కాదు.. అక్కడో అల్లరి మూక ఒక వ్యక్తిని కొట్టి చంపిందని, మరణించిన వ్యక్తి ముస్లిం అని, వివాదానికి కేంద్రం కొన్ని పశువులని చుట్టుపక్కల ఉన్నవారిని విచారిస్తే తెలుస్తుంది.
దేశ రాజధాని దిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో గోవులను వధించడానికి తీసుకెళ్తున్నారనే అనుమానంతో మొహమ్మద్ ఖాసింను దారుణంగా కొట్టి చంపారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం దీనినొక రోడ్డు ప్రమాదంగా పేర్కొన్నారు.
ఈ దాడిలో 60 ఏళ్ల సమీయుద్దీన్ అనే వృద్ధుడు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంతకూ జరిగిందేమిటి?
సమీయుద్దీన్‌కు మొహహ్మద్ వకీల్ కొడుకు వరస అవుతాడు. ''ఆ రోజు మా బాబాయి పశువులకు మేత కోసం పొలానికి వెళ్లారు. అప్పుడే ఖాసిం ఎక్కడికో వెళ్లి వస్తున్నారు. బాబాయితో పరిచయం ఉండడం వల్ల మాట్లాడి వెళదామని అతను బాబాయి వద్దకు వచ్చాడు'' అని అతను తెలిపాడు.
మదాపూర్ ముస్తఫాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అయితే మాదాపూర్ గ్రామస్తులు చెప్పేదాన్ని బట్టి, రాజ్‌ఫుట్‌ల ఆధిపత్యం కలిగిన బజేడా ఖుర్ద్ గ్రామానికి చెందిన పశువులు మేత కోసం వారి పొలాల్లోకి వస్తుంటాయి. అయితే బజేడా ఖుర్ద్ గ్రామస్తులు కావాలనే వాళ్ల పశువులను తమ పొలాల్లోకి వదులుతుంటారని మాదాపూర్ గ్రామస్తులు అంటున్నారు.
''తమ పశువులను బంధించి తమ పొలంలో కట్టేసుకున్నారని ఆరోపిస్తూ బజేడా ఖుర్ద్ గ్రామస్తులు ఇలా దాడి చేశారు. రైతు పంటకు నష్టం కలిగినపుడు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా?'' అని సమీయిద్దీన్ సమీప బంధువైన ప్యారే మొహమ్మద్ ప్రశ్నలు సంధించారు.
ఈ సంఘటన జరిగే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి దగ్గర్లో ఉన్న పొలాల్లో పని చేస్తున్నారు. అయితే, బజేడా ఖుర్ద్ గ్రామం నుంచి గుంపు వస్తుండడం చూసి, వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఖాసిం, సమీయిద్దీన్‌లు వాళ్ల చేతికి దొరికిపోయారు.

ఎరుపు రంగు చెప్పు
ముస్లింలు ఎక్కువగా ఉన్న మదాపూర్ ముస్తఫాబాద్, రాజ్‌ఫుట్‌లు ఎక్కువగా ఉండే బజేడా ఖుర్ద్ గ్రామాలు దగ్గరదగ్గరగా ఉన్నాయి.
మొహమ్మద్ వకీల్ మమ్మల్ని ఖాసిం, సమీయిద్దీన్‌లను తీవ్రంగా కొట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇంకా రక్తచారికలు కనిపిస్తూనే ఉన్నాయి. పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, తెగిపోయిన ఎరుపు రంగు చెప్పు ఇంకా అక్కడే పడి ఉంది. అయితే అది ఇద్దరిలో ఎవరిదో మరి .
ఈ సంఘటనకు సంబంధించి బజేడా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు.

రెచ్చగొట్టి ఉంటారు..
అయితే ఎస్పీ సంకల్ప్ శర్మ చెబుతున్నది వేరేగా ఉంది.
'వాళ్లిద్దరూ జనాలను రెచ్చి గొట్టి ఉంటార'ని ఆయన అభిప్రాయపడ్డారు.
బజేడా ఖుర్ద్, మాదాపూర్ ముస్తఫాబాద్‌లకు కొంత దూరంలోని పిల్కువా నగరంలోని సిద్ధిపురా మొహల్లాలో ఖాసిం ఉండేవాడు.
మేం అక్కడికి వెళ్లినపుడు సంతాపం తెలియజేయడానికి వచ్చినవాళ్ల కోసం ఆ ఇంటి ముందు కుర్చీలు వేసి ఉన్నాయి.
పశువుల క్రయవిక్రయాలు చేసే ఖాసిం సోదరుడు మహమ్మద్ నదీమ్, ''నా సోదరుడు పశువుల కొనేందుకు ఇంటి నుంచి 60-70 వేలు తీసుకుని వెళ్లాడు. అయితే ఈలోపు ఆ అల్లరి మూక అంతా కలిసి అతణ్ని కొట్టి చంపేశారు'' అని తెలిపారు.
ఖాసిం మృతిపై కేసు పెట్టేందుకు తమను అనుమతించలేదని అతని కుటుంబసభ్యులు అంటున్నారు.
అయితే పోలీసులు పెట్టిన కేసు వేరేగా ఉంది. ఈ నెల 18న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, కొందరు గుర్తు తెలియని వ్యక్తులపై యాసిస్ ఫిర్యాదు చేసినట్లు కేసు నమోదైంది. దాని ప్రకారం, బజేడా ఖుర్ద్ వైపు వెళుతున్న ఓ మోటర్ సైకిల్ సమీయిద్దీన్‌ను ఢీ కొట్టింది. దాంతో సమీయుద్దీన్ వారితో గొడవ పడడంతో 25-30 మంది అక్కడ గుమి కూడారు. సమీయిద్దీన్, ఖాసింలపై కర్రలతో దాడి చేశారు.

వేర్వేరు కథనాలు
సోషల్ మీడియాలో ఖాసిం గాయాలతో అటుఇటు పొర్లుతున్న వీడియో వైరల్ అవుతోంది. బడేజా ఖుర్ద్‌కు చెందిన వాడినని చెప్పుకుంటున్న రామ్ కుమార్ కశ్యప్, ''కొంత మంది మహిళలు గడ్డి కోసుకునేందుకు పొలానికి వెళ్లారు. వాళ్లు వచ్చి నలుగురు వ్యక్తులు గోవులను పట్టుకెళ్తున్నట్లు తెలిపారు. దాంతో గ్రామం నుంచి కొంతమంది వెళ్లగా, అవతలి వ్యక్తులు మా వాళ్లపై కాల్పులు జరిపారు. ఈ గొడవలో ఇద్దరు పారిపోయారు. ఇధ్దరు కింద పడిపోయారు..'' అని వివరించారు.
ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న మొహమ్మద్ యాసిన్ ప్రస్తుతం ఆసుపత్రిలో తన సోదరుడు సమీయిద్దీన్‌ను చూసుకుంటున్నారు. ఎఫ్‌ఐఆర్ ఆయన పేరిటే ఉంది.
ఎఫ్‌ఐఆర్‌లో సమీయిద్దీన్ రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డాడని పేర్కొనడంపై యాసిన్, ''నేనా రోజు ఆలస్యంగా వచ్చాను. వాళ్లు చెబుతూ పోతే, నేను రాసి, దానిపై సంతకం పెట్టాను అంతే. నాకేమీ తెలీదు'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








