You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా విదేశాంగ మంత్రి పదవి నుంచి రెక్స్ టిల్లర్‌సన్‌కు ఉద్వాసన పలికిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌ను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపేయోను నియమించారు.
పాంపేయో స్థానంలో జినా హాస్పెల్‌ను నియమించారు. హాస్పెల్ సీఐఏ మొదటి మహిళా డైరెక్టర్.
టిల్లర్‌సన్ తొలగింపుపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ఆయనతో అభిప్రాయభేదాలు తీవ్రస్థాయికి వచ్చినట్లు తెలిపారు. అనేక విషయాలపై ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలిపారు. తమ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కుదరలేదన్నారు.
నూతన విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, తనవి ఒకటే రకమైన ఆలోచనలని ట్రంప్ అన్నారు.
టిల్లర్‌సన్‌ను ఎందుకు తొలగించారు?
గత ఏడాది నుంచి ట్రంప్, టిల్లర్‌సన్‌ల మధ్య అభిప్రాయభేదాలు పెరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
గత జులైలో పెంటగాన్‌లో ట్రంప్‌ను కలిసిన తర్వాత అధ్యక్షుణ్ని 'బుద్ధిహీనుడు' అని టిల్లర్‌సన్ అన్నట్లు వార్తలు వచ్చిననాటి నుంచి ఇద్దరి మధ్యా దూరం మరింత పెరిగింది.
ఉత్తరకొరియాతో చర్చల జరపాలన్న టిల్లర్‌సన్ ప్రతిపాదనను కూడా ట్రంప్ 'సమయం వృధా' అంటూ కొట్టిపారేశారు.
ఆ సందర్భంగా విదేశీ విధానాలపై ట్రంప్‌కు అవగాహన లేదంటూ టిల్లర్‌సన్ పలువురి వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టిల్లర్‌సన్ బాడీ లాంగ్వేజ్ కూడా ట్రంప్‌కు నచ్చేది కాదని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
కొత్త వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సీఐఏ డైరెక్టర్‌గా నియమితులైన హాస్పెల్‌కు అంత మంచి రికార్డేమీ లేదు. 2002లో థాయ్‌ల్యాండ్‌లో ఉన్న సీఐఏ జైలులో ఖైదీలను తీవ్రంగా హింసించారని యూఎస్ సెనేట్ హాస్పెల్‌ను తప్పుబట్టింది.
అంతే కాకుండా ఇంటరాగేషన్ క్యాంపులలోని అనేక వీడియోలను కూడా ఆమె నాశనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇక కన్సాస్‌కు చెందిన కరడుగట్టిన కన్జర్వేటివ్ అయిన పాంపేయో ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులు.
2014లో బందీలను తీవ్రమైన హింసలకు గురి చేసిన సీఐఏ అధికారులను పాంపేయో 'దేశభక్తులు'గా కీర్తించారు.
వీరిద్దరికీ ఇంకా సెనేట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)