You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మైఖేల్ ఫ్లిన్ చేసింది సరైందే, కానీ : ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న కేసు విచారణలో అబద్ధాలు చెప్పినట్టు తన మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ అంగీకరించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఎన్నికల సమయంలో రష్యాతో ఫ్లిన్ మంతనాలు న్యాయబద్ధంగానే జరిగాయని, అందులో ఎలాంటి పొరపాటూ లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
"విచారణలో ఎఫ్‌బీఐ ముందు, ఉపాధ్యక్షుడి ముందు అబద్ధాలు చెప్పాడన్న కారణంతోనే ఫ్లిన్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది. అందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు" అని ట్రంప్ ట్విటర్‌లో వెల్లడించారు.
అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలను కొందరు విశ్లేషకులు తప్పుబడుతున్నారు. "ఫ్లిన్ అబద్ధాలు చెప్పారన్న విషయం ముందుగానే తెలిసినా, ఈ కేసు విచారణను విరమించుకోవాలని గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కామీపై ట్రంప్ ఒత్తిడి చేశారు. అది న్యాయ వ్యవవస్థకు విఘాతం కలిగించడమే" అని అంటున్నారు.
ఒబామా హయాంలో పనిచేసిన న్యాయశాఖ సీనియర్ అధికారి మాథ్యూ మిల్లర్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
"న్యాయ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నట్టు ట్రంప్ ఒప్పుకున్నారు. ఎఫ్‌బీఐకి ఫ్లిన్ అబద్ధాలు చెప్పారన్న విషయం తెలిసినా, ఆ కేసు విచారణను ఆపేయాలని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కామీపై ట్రంప్ ఒత్తిడి చేశారు. అయితే, అందులో మీ పాత్ర ఉన్నట్టే" అని ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది?
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రష్యా ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించేందుకు అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ రష్యాతో మంతనాలు జరిపారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దీనిపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లిన్ తన పదవిని కూడా కోల్పోయారు. కేసు విచారణలో ఎఫ్‌బీఐ ముందు తాను అబద్ధాలు చెప్పినట్టు ఫ్లిన్ తాజాగా కోర్టులో అంగీకరించారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)