You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర కొరియాతో చర్చలు వృథా ప్రయాస: టిల్లర్సన్ కు ట్రంప్ సూచన
ప్యోంగ్యాంగ్‌తో చర్చలకు అమెరికా సిద్ధమవుతోన్న తరుణంలో 'నీ శక్తిని ఆదా చేసుకో రెక్స్, ఏం చేయాలో అదే చేద్దాం' అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.
అయితే, తమతో చర్చలు జరపడానికి ఉత్తర కొరియా కొంత ఆసక్తి చూపుతోందని శనివారం టిల్లర్సన్ వెల్లడించారు.
గత కొన్నాళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఉత్తర కొరియా ఇటీవల తరచుగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. తక్కువస్థాయి హైడ్రోజన్ బాంబును దీర్ఘశ్రేణి క్షిపణిలో ప్రవేశపెట్టి విజయవంతంగా పరీక్షించినట్లు కూడా ప్రకటించుకుంది.
కానీ, ట్రంప్ వ్యవహారశైలితో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఉద్దేశిస్తూ 'ఓ లిటిల్ రాకెట్ మెన్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తూ మా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ సమయం వృథా చేసుకుంటున్నారు' అని ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు. అంతేకాదు‘మేం ఏం చేయాలో అదే చేస్తాం’ అని పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఓ సీనియర్ అమెరికా అధికారి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. 'ఉత్తర కొరియా ఒక వైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో వారితో చర్చలు జరపడానికి ఇది సమయం కాదని ట్రంప్ భావిస్తున్నారు' అని చెప్పారు.
కాగా, మరికొందరు అధికారులు కూడా తమ దౌత్యవర్గాలు ఉత్తరకొరియాతో ప్రధానంగా చర్చించాలనుకుంటున్నది ప్యొంగ్యాంగ్‌లో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుల గురించేనని స్పష్టం చేశారు.
వేచి చూడండి..
తన పరిపాలనలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వ్యాఖ్యలను విభేదిస్తూ మాట్లాడటం ట్రంప్‌కు ఇదే మొదటిసారి కాదు.
ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న దశలో ప్యొంగ్యాంగ్‌తో సంప్రదింపులు జరపడానికి అమెరికా ఉన్నతాదికారులు సిద్ధంగా ఉన్నారని రాక్స్ టెల్లరసన్ వెల్లడించారు. కానీ, ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ ఉత్తరకొరియా చర్చలకు ముందుకు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా 'మేం పరిశీలిస్తాం.. వేచి చూడండి' అంటూ రాక్స్ బదులిచ్చారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)