You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సుప్రీంకోర్టు: ‘ఆధార్ లింకింగ్ తప్పనిసరికాదు’.. మార్చి 31 డెడ్‌లైన్ కాదు
ఆధార్ అనుసంధానానికి గతంలో విధించిన మార్చి 31 గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చే వరకూ అనుసంధానం తప్పనిసరి కాదని తెలిపింది.
ఆధార్ అనుసంధానాన్ని, చట్టాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి, తదితరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగించింది.
పిటిషనర్లలో ఒకరి తరపున కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది పి చిదంబరం వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో.. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించే వరకూ బ్యాంకింగ్, మొబైల్ సేవలు సహా పలు సేవలకు ఆధార్‌ను అనుసంధానించటం తప్పనిసరి కాదని ధర్మాసనం తెలిపింది.
అయితే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ఇందులో మార్పు లేదని కూడా సుప్రీంకోర్టు వివరించింది.
కాగా, కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు, మొబైల్ ఫోన్ సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ.. ఈ రెండు సేవలకూ ఆధార్‌ను అనుసంధానించేందుకు గడువును మార్చి 31గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా.. దానిని గతేడాది డిసెంబర్ 15వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించింది.
తాజాగా, మంగళవారం ఇచ్చిన ఆదేశాలతో బ్యాంకు, మొబైల్ సేవలు పొందే వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది.
తత్కాల్ పాస్‌పోర్టు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై విచారణ జరుగుతుండగా.. మార్చి 31 డెడ్‌లైన్‌ను పొడిగించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి సూచించారు. అయితే, ప్రభుత్వ రాయితీలు పొందే పథకాలకు మాత్రం ఆధార్ అనుసంధానాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఈ కేసు విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)