You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆపత్కాలంలో అమ్మాయిలే అధికంగా తట్టుకోగలరు..
ఆడవాళ్ల కంటే తామే బలవంతులం అనుకునే మగవాళ్లు ఓసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే శక్తిమంతులని చెప్పే ఆధారాలు బయటికొస్తున్నాయి.
ఇటీవల శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా అనేక విషయాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ముందున్నారని చెబుతున్నాయి.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం కరవులు, అంటు వ్యాధులు లాంటివి ప్రబలినప్పుడు మగవాళ్ల కంటే ఆడవాళ్లే వాటిని సమర్థంగా తట్టుకొని జీవించగలరని తేలింది.
మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ఆయుర్థాయం కూడా ఎక్కువే. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లోని మహిళల సగటు ఆయుర్థాయం 83.1ఏళ్లుంటే, మగవాళ్ల సగటు ఆయుర్థాయం 79.5 ఏళ్లుగా ఉంది.
చరిత్రలో ప్రజలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వాటి ఆధారంగా పరిస్థితుల ప్రభావం మగవాళ్లు, ఆడవాళ్ల ఆయుర్థాయంపైన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
1845-1849 మధ్య సంభవించిన ఐరిష్ కరవు, 1846, 1882లో ఐస్‌లాండ్‌లో ప్రబలిన అంటు వ్యాధులు, పందొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో బానిసలుగా బతికిన ఆఫ్రికన్లు.. ఇలా కఠినతరమైన పరిస్థితులను ఆడా మగా ఎదుర్కొన్న తీరును కేస్ స్టడీలుగా తీసుకున్నారు.
ఇవన్నీ కూడా మనుషులు ఆయుర్థాయంపై ప్రభావం చూపిన పరిస్థితులే. ఐస్‌లాండ్ అంటు వ్యాధులనే తీసుకుంటే ఆ సమయంలో మహిళల సగటు ఆయుర్థాయం 18.83 ఏళ్లకు, పురుషుల సగటు ఆయుర్థాయం 16.76ఏళ్లకు పడిపోయింది.
ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆడవాళ్ల ఆయుర్థాయమే ఎక్కువనీ, కఠిన పరిస్థితుల్లో ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారనీ తేలింది.
పుట్టిన కొద్ది రోజులకే తలెత్తే వ్యాధులను కూడా మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు సమర్థంగా తట్టుకోగలరనీ, ఆ ప్రభావం సగటు ఆయుర్థాయంపైనా స్పష్టంగా కనిపిస్తోందనీ అధ్యయనాలు చెబుతున్నాయి.
మొత్తమ్మీద చూస్తే అనేక పరిస్థితుల్లో శారీరకంగా ఆడవాళ్లు శక్తిమంతులుగా కనిపిస్తున్నారని అధ్యయనకర్తలు తేల్చారు. వివిధ వాతావరణ, సామాజిక పరిస్థితుల ప్రభావం కూడా ఆడవాళ్ల ఆయుర్థాయంపై ఉంటుందని వాళ్లంటున్నారు.
హార్మొన్లలో తేడా కూడా స్త్రీలు, మగవాళ్ల మరణాలపై ప్రభావం చూపుతుందన్నది అధ్యయనకర్తల మాట. మహిళల్లో అధికంగా ఉండే ఈస్ట్రోజెన్లు ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం చూపుతాయి. మరోపక్క మగవాళ్లలో ఎక్కువగా ఉండే టెస్టొస్టెరాన్, వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
‘మరణాల శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా, మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారు’ అని అధ్యయనకర్తలు తేల్చారు.
మొత్తమ్మీద ఆడవాళ్లే శక్తిమంతులని అధ్యయనాలూ చెబుతున్నాయి. మరి మీరేమంటారు?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)