అమెరికా గన్ కంట్రోల్: వాషింగ్టన్ మార్చ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు!

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లోరిడా హైస్కూల్‌లో కాల్పుల ఘటన తర్వాత అమెరికాలో ఆయుధాల నియంత్రణపై చర్చ మళ్లీ మొదలైంది.
ఫ్లోరిడా ఘటన అమెరికా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని విద్యార్థులు అంటున్నారు.
ఆయుధాల నియంత్రణకు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వాషింగ్టన్‌లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు విద్యార్థులు ప్రకటించారు.
ఆయుధాల నియంత్రణ చర్చలో ఫ్లోరిడా కాల్పుల ఘటన ఒక టర్నింగ్ పాయింట్‌గా మారాలని వారు అమెరికా మీడియాకు చెప్పారు.
గత బుధవారం ఫ్లోరిడా స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల ఘటనలో 17 మంది చనిపోయారు. అదే స్కూల్‌కి చెందిన నికోలస్ క్రూజ్ అనే పూర్వ విద్యార్థి ఈ కాల్పులు జరిపాడు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యార్థులు ఏం చేయబోతున్నారు!
మార్చి 24న స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ విద్యార్థులు వాషింగ్టన్ వీధుల్లో నిరసన ర్యాలీలు చేపట్టబోతున్నారు.
'మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ క్యాంపేయిన్' పేరుతో నిరసనలు తెలపనున్నారు.
అదే రోజు ఇతర నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నారు.
శనివారం పార్క్‌లాండ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కొందరు రాజకీయ నాయకులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నేషనల్ రైఫిల్ అసోషియేషన్' -ఎన్‌ఆర్ఏతో సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్, ఇతర రాజకీయ నాయకులను ఎమ్మా గోంజాలెజ్ అనే విద్యార్థిని తీవ్రంగా తప్పుపట్టింది.
'ట్రంప్ వస్తే ఎన్‌ఆర్ఏ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారని నేరుగా అడిగేస్తా' అని ఎమ్మా గోంజాలెజ్ అన్నారు. అయినా ఆ విషయం ట్రంప్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 30 మిలియన్ డాలర్లు విరాళంగా తీసుకున్నారన్న విషయం నాకు తెలుసు' అని చెప్పారు.
ఎన్‌ఆర్ఏ నుంచి విరాళాలు తీసుకున్న రాజకీయ నాయకులందరూ సిగ్గు పడాలి అని అన్నారు.
'అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర శాసన సభ్యులు సిగ్గుపడాలి' అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.


డేవిడ్ అనే మరో విద్యార్థి ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రెసిడెంట్ ట్రంప్! ప్రజాప్రతినిధులు మీ నియంత్రణలో ఉన్నారు. సెనేట్ మీరు చెప్పినట్లు వింటోంది. అలాంటప్పుడు మీరు ఒక్క బిల్లు కూడా పాస్ చేయించలేరా?' అని టీవీ ఇంటర్వ్యూలో డేవిడ్ నిలదీశారు.
'మా ప్రాణాలు పోతుంటే పెద్దోళ్లంతా చోద్యం చూస్తున్నారు' అని ఫ్లోరిడా కాల్పుల ఘటన నుంచి బయటపడిన కామెరాన్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల 'వాషింగ్టన్ మార్చ్'కి సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు లభిస్తోంది.


ఫొటో సోర్స్, Reuters
ఆయుధాల నియంత్రణపై ట్రంప్ వైఖరేంటి?
ఆయుధాల నియంత్రణపై ట్రంప్ వైఖరి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తోంది.
'వ్యక్తిగతంగా ఆయుధాలు కలిగి ఉండే హక్కు'కు తాను ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం గలిగించబోనని గతేడాది ఎన్‌ఆర్‌ఏ సదస్సులో ట్రంప్ ప్రకటించారు.
ఒబామా హయాంలో ఆయుధాల నియంత్రణ బిల్లు పాస్ చేయకుండా డెమోక్రాట్లే అడ్డుకున్నారని ఫ్లోరిడా కాల్పుల ఘటన తర్వాత గత శనివారం ట్రంప్ ఆరోపించారు.
"అప్పుడు ఆయుధాలు నియంత్రించడం వారికిష్టం లేదు. కానీ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు" అని ట్రంప్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









