హ్యాండ్‌బ్యాగుతో పాటే ఎక్స్ రే మెషీన్‌లోకి దూరిన మహిళ!

ఫొటో సోర్స్, Pear Video
సెక్యూరిటీ తనిఖీల్లో మీ బ్యాగు మాయమవుతుందేమో అన్న అనుమానం ఉందా? ఆ అనుమానంతోనే ఓ చైనా మహిళ తన బ్యాగుతో పాటే ఎక్స్- రే మెషీన్‌లోకి దూరారు.
ఎక్స్- రే తెరపై ఆవిడ చిత్రాన్ని చూసి సెక్యూరిటీ సిబ్బంది అవాక్కయ్యారు.
ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ఈ ఘటన దక్షిణ చైనాలోని డాంగ్వాన్ రైల్వే స్టేషన్‌లో గత ఆదివారం జరిగినట్టు తెలుస్తోంది.
ముందు తన బ్యాగులను మెషీన్‌లో పెట్టి, వాటి వెనకాలే మోకాళ్లపై వంగి ఆమె కూడా చొరబడ్డారు.
ఆ మెషీన్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎంచక్కా తన బ్యాగులను తీసుకుని వెళ్లిపోయారు.
లూనార్ క్యాలెండర్ ప్రకారం చైనీయులు జరుపుకునే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా రైల్వే స్టేషన్‌లో రద్దీ విపరీతంగా ఉంది.
సాధారణంగా చాలా మంది చైనీయులు నూతన సంవత్సర వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్లేటప్పుడు భారీ మొత్తంలో నగదును తీసుకెళ్తుంటారు.
బహుశా.. ఈవిడ కూడా అలాగే డబ్బులు పట్టుకెళ్తూ, ఆ రద్దీలో తన బ్యాగులను ఎవరైనా మాయం చేస్తారేమో అన్న భయంతో అలా చేసినట్టున్నారు!

ఫొటో సోర్స్, Pear Video
పియర్‌వీడియో.కామ్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం మొదట ఆమె తన సూట్‌కేసును మెషీన్‌లో పెట్టేసి, హ్యాండ్ బ్యాగుతో పక్కనే ఉన్న సెక్యూరిటీ స్కానర్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, అన్ని బ్యాగులూ ఎక్స్ రే మెషీన్‌లో పెట్టాల్సిందే అని భద్రతా సిబ్బంది చెప్పారు.
అందుకు నిరాకరించిన ఆవిడ తన హ్యాండు బ్యాగుతో పాటే మెషీన్‌లో దూరారు.

ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








