ఇరాన్ పర్వతాల్లో కూలిన విమానం: 66మంది మృతి చెందినట్లు అనుమానం

ఫొటో సోర్స్, Konstantin von Wedelstaedt
మధ్య ఇరాన్‌లోని పర్వత ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 66 మంది ప్రయాణీకులూ ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మొదట అందరూ చనిపోయినట్లు అధికారులు ప్రకటించినా, విమానం కూలిన ప్రాంతంలోకి ఇంకా సహాయక సిబ్బంది వెళ్లలేదనీ, కాబట్టి మృతుల సంఖ్యను పక్కాగా నిర్ధరించలేమనీ అన్నారు.
టెహ్రాన్ నుంచి యాసుజ్‌కు వెళ్తున్న ఈ విమానం ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని సెమిరోమ్ పట్టణం సమీపంలోని జాగ్రోస్ పర్వతాల్లో కూలిపోయింది.
సహాయక చర్యలు చేపట్టేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు టెహ్రాన్ నుంచి విమానం బయలుదేరగా, కొద్దిసేపటి తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యల కోసం ప్రమాద స్థలానికి అత్యవసర సేవల హెలికాప్టర్ చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గురైన విమానం ఏటీఆర్ 72-500, ఆసెమాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదిగా తెలుస్తోంది.
ఆ విమానంలో 60 మంది ప్రయాణికులు, ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు సహాయకులు, పైలట్, సహాయక పైలట్ ఉన్నట్టు సమాచారం.
ఇటీవల సంభవించిన భారీ విమాన ప్రమాదాలు
2018
ఫిబ్రవరి 11న 71 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన రష్యా విమానం కూలిపోయింది. విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు.
2016
డిసెంబర్ 25న 'టీయూ-154 మిలిటరీ ఎయిర్‌లైనర్' నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 92మంది చనిపోయారు.
2015
అక్టోబర్ 31న 'రష్యన్ ఎయిర్‌బస్ ఏ321' విమానం ఈజిప్ట్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 224మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








