You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా రాజీనామా
అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు జాకబ్ జుమా వెల్లడించారు. కానీ పార్టీ నిర్ణయంతో విబేధిస్తున్నట్లు తన టీవీ ప్రసంగంలో చెప్పారు.
రాజీనామా చేస్తారో? లేక పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటారో తేల్చుకోవాలని జాకబ్ జుమాకు 'ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్-ఏఎన్‌సీ అల్టిమేటం ఇచ్చింది.
దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఏఎన్‌సీ భావిస్తోంది.
2009 నుంచి అధికారంలో ఉన్న జాకబ్ జుమా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జుమాతో సన్నిహిత సంబంధాలు ఉన్న గుప్తా కుటుంబ సభ్యులకు చెందిన జొహెన్నెస్‌బర్గ్ ఇంటిని గురువారం పోలీసులు సీజ్ చేశారు.
జుమా రాజీనామా ఎలా ప్రకటించారు?
జాకబ్ జుమా నవ్వుతూ టెలివిజన్ ప్రసంగం మొదలుపెట్టారు. ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నారంటూ పాత్రికేయులపై జోకులు కూడా వేశారు.
'హింసాత్మక సంఘటనలు, ఏఎన్‌సీలో చీలికలు తన రాజీనామాకు కారణం' అని జుమా చెప్పారు.
'నా వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దు. నా కారణంగా ఏఎన్‌సీలో చీలిక రావడం ఇష్టం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నా' అని జుమా ప్రకటించారు.
రాజీనామా విషయంలో ఏఎన్‌సీ నాయకత్వంతో నాకు విబేధాలు ఉన్నా ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ఉన్నానని వివరించారు.
పదవి నుంచి తప్పుకున్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్రజలకు, ఏఎన్‌సీకి సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు.
జుమా రాజీనామా సమర్పించారంటూ 'ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్-ఏఎన్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆయన సేవలను ఎన్నటికీ మర్చిపోలేం అని ఏఎన్‌సీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ జెస్సీ చెప్పారు.
జాకబ్ జుమా జీవితంలో కీలక ఘట్టాలు
ఏప్రిల్ 1942 : క్వజులు-నటాల్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జుమా జన్మించారు. తండ్రి చనిపోవడంతో తల్లే జుమాను పెంచి పెద్ద చేశారు. జుమా పెద్దగా చదువుకోలేదు.
1959 : జాకబ్ జుమా 'ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్-ఏఎన్‌సీలో చేరారు. 1962 నాటికి సైనిక విభాగంలో చురుకైన సభ్యుడిగా ఎదిగారు.
ఆగస్టు 1963 : 21 ఏళ్ల వయసులో అప్పటి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్ర పన్నారంటూ జాకబ్ జుమాకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నెల్సన్ మండేలాతో పాటుగా జుమా రాబెన్ ద్వీపంలో పదేళ్లు జైలులో ఉన్నారు.
మార్చి 1990 : పదేళ్ల జైలు జీవితం తర్వాత జుమా దక్షిణాఫ్రికాకు తిరిగొచ్చారు. ఏఎన్‌సీపై విధించిన నిషేధం కూడా తొలిగిపోయింది.
జూన్ 1999లో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
ఏప్రిల్ 2009లో అవినీతి ఆరోపణలు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షుడిగా జుమా బాధ్యతలు చేపట్టారు.
అక్టోబర్ 2017 : జుమా 18 అవినీతి కేసులు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.