You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: హైస్కూల్‌లో కాల్పులు, 17 మంది మృతి
ఫ్లోరిడా పార్క్‌లాండ్‌లోని ఒక పాఠశాలలో అదే స్కూల్‌కి చెందిన పూర్వ విద్యార్థి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 12మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కాల్పులు జరిపిన నిందితుడిని 19 ఏళ్ల నికొలస్ క్రూజ్‌గా గుర్తించారు.
ఏఆర్-15 తరహా ఆయుధంతో క్రూజ్ ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
నికొలస్ క్రూజ్‌ను ఇటీవలే స్కూల్ నుంచి బహిష్కరించారు.
స్కూల్ బయట జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు బ్రౌవర్డ్ కంట్రీ షరీఫ్ స్కాట్ ఇజ్రాయెల్ చెప్పారు. స్కూల్ లోపల జరిపిన కాల్పుల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రస్తుతం నిందితుడు నికొలస్ క్రూజ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు.
2012లో కనెక్టికట్ స్కూల్ కాల్పుల ఘటనలో 20మంది విద్యార్థులు చనిపోయారు. ఆ తర్వాత అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి.
అసలు ఏం జరిగింది?
'నికొలస్ క్రూజ్ ఫైర్ అలారం మోగించి స్కూల్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడేలా చేశారు. ఆ తర్వాత కాల్పులు మొదలుపెట్టారు. గేటు బయట మొదలైన కాల్పులు.. స్కూల్ లోపల కూడా కొనసాగాయి' అని భద్రతా సిబ్బంది చెప్పినట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
స్కూల్ లోపల ఉన్న విద్యార్థులను పోలీసులు సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు.
'ఉదయమే ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత మాకు కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటుందని మేం అనుకోలేదు' అని ఒక విద్యార్థి చెప్పారు.
'మాకు బాణాసంచా తరహా శబ్దం వినిపించింది. నీకు కూడా వినిపించిందా అని నా స్నేహితుడి అడిగా' అని బైలీ అనే మరో విద్యార్థి చెప్పారు.
ఈ కాల్పులు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియో అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు.
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.
2013 నుంచి అమెరికా స్కూళ్లలో 291 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే సగటున వారానికి ఒక ఘటన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.