You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంగీత కచేరీలో కాల్పులు: 58 మంది మృతి, 515 మందికి పైగా గాయాలు
అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో జరిగిన మారణహోమంలో మృతుల సంఖ్య 58కి చేరింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:30 వరకు అందిన సమాచారం ప్రకారం గాయపడ్డవారు 515 మందికి పైగా ఉన్నారు.
అమెరికాలో ఇటీవలి కాలంలో ప్రజలపై విచక్షణరహితంగా జరిగిన అత్యంత తీవ్రమైన కాల్పులు ఇవే.
మాండలే బే హోటల్ 32వ అంతస్తు నుంచి హోటల్ ప్రాంగణంలోని ఒక సంగీత విభావరిపై దుండగుడు కాల్పులు జరిపాడు. సంగీత కార్యక్రమానికి 22 వేల మంది హాజరయ్యారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10:08 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10:38 గంటలకు) కాల్పులు మొదలైనట్లు పోలీసులు తెలిపారు. వందల రౌండ్లు కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
పోలీసులు తనను చుట్టుముట్టడంతో దుండగుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. అతడు ఉన్న గదిలో పది తుపాకులు దొరికాయి.
దుండగుడిని నెవడా రాష్ర్టానికి చెందిన 64 ఏళ్ల స్టీఫెన్ పాడాక్‌గా గుర్తించారు. అతడి ఉద్దేశాలు, మత విశ్వాసాలు స్పష్టం కాలేదు.
లాస్ వెగాస్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం మెస్‌క్వైట్‌కు చెందిన అతడు సెప్టెంబరు 28 నుంచి మాండలే బే హోటల్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ ఘటనకూ, ఏ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకూ సంబంధం లేదని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ ఆరన్ రౌస్ స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యాయి. ఒకవైపు కాల్పుల మోత మోగుతుండగా, మరోవైపు ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు.
దుండగుడు ఒంటరిగా కాల్పులు జరిపినట్లు లాస్ వెగాస్ షెరిఫ్ జో లాంబార్డో చెప్పారు. మృతుల్లో డ్యూటీలో లేని ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు.
కాల్పులు మొదలయ్యాక లాస్‌వెగాస్ విమానాశ్రయం నుంచి కొన్ని విమానాలను దారి మళ్లించారు.
బుధవారం లాస్ వెగాస్‌కు ట్రంప్
దాడిని రాక్షసత్వంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను బుధవారం లాస్ వెగాస్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)