You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: కెంటకీలో జరిగిన కాల్పులలో ఇద్దరు విద్యార్థులు మృతి, 17 మందికి గాయాలు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని ఓ హైస్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు బాధ్యుడైన 15 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్షల్ కౌంటీ హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో 15 ఏళ్ల విద్యార్థిని ఘటనా స్థలంలోనే మరణించగా, మరో 15 ఏళ్ల విద్యార్థి ఆసుపత్రిలో మరణించాడు.
మంగళవారం ఉదయం 8 గంటలు (భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గంటలు) సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
క్లాసులు ప్రారంభం కావడానికి కొద్దిసేపు ముందు ఓ విద్యార్థి హ్యాండ్ గన్‌తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాల్పుల్లో 12 మంది విద్యార్థులకు బుల్లెట్ గాయాలు కాగా, తప్పించుకునే ప్రయత్నంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఈ పాఠశాలలో సుమారు 1,150 విద్యార్థులు చదువుకుంటున్నారు.
సంఘటన గురించి వివరిస్తూ జేసన్ హాల్ అనే విద్యార్థి, ''విద్యార్థులంతా ఒకర్నొకరు తోసుకోవడం కనిపించింది. ఎటు చూసినా రక్తంతో అంతా భయానకంగా మారింది'' అని తెలిపారు.
టెనెస్సీలోని నాష్ విల్లేకు వాయువ్యంగా 130 మైళ్ల దూరంలోని ఈ చిన్న పట్టణంలో జరిగిన ఈ కాల్పుల ఘటన మార్షల్ కౌంటీని ఉలిక్కిపడేట్లు చేసింది.
సంఘటనా స్థలం మొత్తం స్కూల్ బ్యాగ్‌లు, ఫోన్‌లతో గందరగోళంగా ఉందని పోలీసు అధకారి జెఫ్రీ ఎడ్వర్డ్స్ స్థానిక మీడియాకు తెలిపారు.
కెంటకీ గవర్నర్ మాట్ బెవిన్ ఈ సంఘటనపై ట్విటర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇలాంటి చిన్న పట్టణంలో కాల్పులు జరగడం నమ్మశక్యం కావడం లేదని అన్నారు.
కాల్పుల ఘటనతో బుధవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి కాల్పులు జరగడం ఇది రెండోసారి. సోమవారం టెక్సాస్‌లోని ఇటలీ పట్టణంలో, తోటి విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఓ 15 ఏళ్ల విద్యార్థిని గాయపడింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో కోలుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)