You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ అతి త్వరలోనే ప్రపంచంలోని ఆధునిక నగరాలలో తాగునీరు లేని మొదటి నగరంగా మారబోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
అయితే ఈ నగరం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఈ భూమిపై 70 శాతం నీరు వ్యాపించి ఉన్నా, దానిలో తాగడానికి పనికొచ్చే నీరు మాత్రం కేవలం 3 శాతమే.
ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల మంది ప్రజలకు నీటి లభ్యత లేదు. మరో 270కోట్ల మంది ప్రజలు ఏడాదిలో కనీసం నెల రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
2014లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, ప్రపంచంలోని 500 అతి పెద్ద నగరాలను పరిశీలించగా, వాటిలో ప్రతి నాలుగింటిలో ఒకటి తీవ్ర 'నీటి ఒత్తిడి'ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. ప్రతి వ్యక్తికి ఏడాదికి 1,700 క్యూబిక్ మీటర్ల కన్నా తక్కువ నీటి లభ్యత ఉంటే దానిని 'నీటి ఒత్తిడి'గా పేర్కొంటారు.
ఐక్యరాజ్యసమితి నిపుణుల అంచనా ప్రకారం, 2030నాటికి నీటి సప్లైకన్నా డిమాండ్ 40శాతం పెరిగే అవకాశం ఉంది.
వాతావరణంలో మార్పులు, మానవ ప్రమేయం, జనాభా పెరుగుదల వీటికి కారణాలలో కొన్ని.
అందువల్ల కేప్ టౌన్ ఈ సమస్యకు ప్రారంభం మాత్రమే.
ప్రతి ఖండంలోని అనేక నగరాలు దాదాపు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
భవిష్యత్తులో నీటి సమస్యను ఎదుర్కొనబోయే ప్రధానమైన 11 నగరాలు:
సౌపాలో
బ్రెజిల్ ఆర్థిక రాజధానిగా పేర్కొనే సౌ పాలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా (2.17 కోట్లు) కలిగిన పట్టణాలలో ఒకటి.
ప్రస్తుతం కేప్ టౌన్ ఎదుర్కొంటున్న సమస్యనే ఈ నగరం 2015లో ఎదుర్కొంది.
ఆ నగరానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్ 4 శాతం కన్నా తక్కువ స్థాయికి పడిపోయింది.
ఈ నీరు నగరానికి 20 రోజులకు మించి సరిపోని పరిస్థితి తలెత్తడంతో నీటి లూటీని అరికట్టడానికి వాటర్ ట్యాంకర్లకు పోలీసుల రక్షణ కల్పించారు.
2014-17 మధ్య కాలంలో బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో వచ్చిన కరువే దీనికి కారణంగా భావించారు.
అయితే, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం మాత్రం సౌ పాలో అధికారుల ప్రణాళిక లోపమే ఈ సమస్యకు కారణమని తెలిపింది.
2017లో ప్రధాన నీటివనరులు 15శాతానికి పడిపోవడంతో మళ్లీ నీటి సమస్య తెరపైకి వచ్చింది.
బెంగళూరు
బెంగళూరులో వేగంగా మారుతున్న పరిణామాలు అధికారులను కలవరపెడుతున్నాయి.
బెంగళూరు అంతర్జాతీయ కేంద్రంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలోని నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అయితే కాలం చెల్లిన పైపుల కారణంగా సగానికి పైగా తాగునీరు వృధాగా పోతున్నట్లు ఒక ప్రభుత్వ నివేదిక పేర్కొంది.
చైనాలో మాదిరే, భారతదేశం కూడా జలకాలుష్యం సమస్యను ఎదుర్కొంటోంది. బెంగళూరు దీనికి మినహాయింపు కాదు. చెరువుల్లోని నీటిలో 85శాతం కేవలం వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు మాత్రమే పనికొస్తుంది.
నగరంలోని చెరువుల్లో ఒక్కటి కూడా తాగడానికి కానీ, స్నానానికి కానీ పనికొచ్చేది లేదని తేలింది.
బీజింగ్
ఒక వ్యక్తి తాగడానికి ఏడాదికి 1,000 క్యూబిక్ మీటర్లకన్నా తక్కువ తాగునీటి లభ్యత ఉంటే ప్రపంచ బ్యాంక్ దానిని నీటి కొరతగా భావిస్తుంది.
ఆ రకంగా చూస్తే 2014లో బీజింగ్‌లోని సుమారు 2 కోట్ల మంది ప్రజలకు కేవలం 145 క్యూబిక్ మీటర్లకన్నా తక్కువ నీరు అందింది.
మొత్తం ప్రపంచ జనాభాలో 20 శాతం మంది చైనాలోనే ఉన్నా, అక్కడ కేవలం 7 శాతం జలమే ఉంది.
అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో ఆ దేశపు జల వనరులు 2000-09 మధ్య కాలంలో 13శాతం తగ్గిపోయినట్లు తేలింది.
2015 నుంచి బీజింగ్‌లోని ఉపరితల జలాలు ఎంతగా కలుషితం అయ్యాయంటే, అవి వ్యవసాయానికి కానీ, పారిశ్రామిక అవసరాలకు కానీ పనికి రావని అధికారిక గణాంకాలే తేల్చి చెప్పాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా చైనా భారీ ఎత్తున నీటిని బీజింగ్‌కు తరలించడం, నీటికి ఎక్కువగా వినియోగించే వారిపై పన్నులు పెంచడం లాంటి చర్యలు తీసుకొంది.
కైరో
ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి రూపుదిద్దుకోవడంలో నైలు నది చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. కానీ ఆధునిక కాలంలో ఈ నది తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది.
97శాతం ఈజిప్టు నీటి అవసరాలను నైలు నదే తీరుస్తోంది. అదే సమయంలో వ్యవసాయం, నివాస ప్రాంతాల నుంచి శుద్ధి చేయని జలాలు కూడా నదిలో కలుస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, జలకాలుష్యం కారణంగా ఎక్కువ మంది ఈ దేశంలోనే చనిపోతున్నారు.
2025 నాటికి కైరో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా.
జకార్తా
ప్రపంచంలోని అనేక కోస్తా నగరాల మాదిరే, ఇండోనేషియా రాజధాని కూడా పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ముప్పును ఎదుర్కొంటోంది.
నగరంలోని కోటి మందికి పైగా ప్రజల్లో సగం కన్నా తక్కువ మందికి మాత్రమే ప్రభుత్వం నీటి సరఫరా చేయగలుగుతోంది.
అక్రమ బోరుల తవ్వకం కారణంగా భూగర్భ జలాల మట్టం క్రమంగా తగ్గిపోతోంది.
దానికి తోడు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా, తారు రోడ్ల కారణంగా నీరు భూమిలోనికి ఇంకకపోవడం వల్ల సమస్య తీవ్రరూపం దాలుస్తోంది.
మాస్కో
మొత్తం ప్రపంచంలోని స్వచ్ఛమైన నీటి వనరుల్లో నాలుగోవంతు రష్యాలోనే ఉన్నాయి. కానీ సోవియట్ కాలంనాటి పారిశ్రామిక విధానాలు కాలుష్యం రూపంలో రష్యాకు శాపంగా మారాయి.
దీని వల్ల 70శాతం ఉపరితల జలాలపైనే ఆధారపడే మాస్కో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది.
అధికారిక లెక్కల ప్రకారమే మొత్తం తాగునీటి వనరుల్లో 35 -60శాతం నీరు పారిశుధ్య ప్రమాణాలకు తగినట్టుగా లేదు.
ఇస్తాంబుల్
టర్కీ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఆ దేశం 'నీటి ఒత్తిడి' సమస్యను ఎదుర్కొంటోంది.
2016లో ఆ దేశ తలసరి నీటి వినియోగం 1,700 క్యూబిక్ మీటర్లకన్నా తక్కువకు పడిపోయింది.
ఈ పరిస్థితి క్రమంగా దిగజారి, 2030 నాటికి తాగునీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో అత్యధిక జనసాంద్రత (1.4 కోట్ల జనాభా) కలిగిన ఇస్తాంబుల్ లాంటి నగరాలు వర్షాభావ సమయంలో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
2014 మొదట్లోనే ఆ నగరానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్ల సామర్థ్యం 30 శాతం కన్నా తక్కువకు పడిపోయింది.
మెక్సికో సిటీ
మెక్సికో సిటీలోని 2.1 కోట్ల మందికి నీటి కొరత అనేది కొత్తేమీ కాదు. నగరంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి కేవలం కొన్ని గంటల పాటు మాత్రం కొళాయిల ద్వారా నీరు లభిస్తోంది.
నగరానికి అవసరమైన 40 శాతం నీటి అవసరాలను దూర ప్రాంతాల నుంచి సరఫరా ద్వారా తీరుస్తున్నారు. మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ లేకపోవడం నగరంలో ప్రధాన లోపం.
నగరంలో పైపులు లోపభూయిష్టంగా ఉండడం వల్ల సుమారు 40 శాతం నీరు వృధాగా పోతోంది.
లండన్
ప్రపంచంలో తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్న నగరాలను గురించి తల్చుకుంటే యూకే రాజధాని ఎవరికీ తట్టదు.
కానీ వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. కేవలం 600 మిల్లీమీటర్ల వర్షపాతంతో (పారిస్ కన్నా తక్కువ, న్యూయార్క్ వర్షపాతంలో సగం మాత్రమే) లండన్‌కు అవసరమైన 80 శాతం నీటి అవసరాలు నదుల ద్వారానే తీరుతున్నాయి.
2025 నాటికి లండన్‌లో నీటి సరఫరా సమస్యలు ప్రారంభమై, 2040 నాటికి అవి తీవ్రమవుతాయని గ్రేటర్ లండన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
టోక్యో
జపాన్ రాజధాని టోక్యోలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.
సుమారు 3 కోట్ల మంది జనాభా కలిగిన టోక్యోలో, 70 శాతం నీటి అవసరాలు ఉపరితల జలాలు (నదులు, చెరువులు, కరిగిన మంచు) ద్వారానే తీరుతున్నాయి.
అయితే ఏడాదిలో కేవలం 4 నెలల పాటు మాత్రమే ఈ వర్షాలు కురుస్తాయి. ఆ నీటిని మిగతా సంవత్సరమంతా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం అధికారులు సుమారు 750 ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై వాన నీటి సేకరణ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
మియామి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం అత్యధిక వర్షపాతం పొందుతున్న రాష్ట్రాలలో ఒకటి. అయితే రాష్ట్రంలోని ప్రధాన పట్టణం మియామి మాత్రం తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన జలవనరులు అట్లాంటిక్ సముద్రం కారణంగా కలుషితమయ్యాయి.
ఈ సమస్యను సుమారు 90 ఏళ్ల క్రితమే గుర్తించినా, పెరుగుతున్న సముద్ర నీటిమట్టం కారణంగా ఉప్పునీరు ఇప్పటికీ నగరానికి వచ్చే జలవనరులను కలుషితం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)