సౌదీలో మళ్లీ ఫైవ్ స్టార్ హోటల్‌గా మారనున్న జైలు

ఫొటో సోర్స్, AFP
సౌదీ అరేబియాలోని ఓ లగ్జరీ హోటల్‌ను నవంబర్‌లో జైలులా మార్చేశారు. రాజకుటుంబీకులు, మంత్రులు, అధికారులతో కలిపి 200లకు పైగా ఉన్నత వర్గాలవారిని అక్కడ బంధించారు.
వాళ్లంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. గతంలో సౌదీ రాజ పదవి రేసులో ఉన్న ప్రిన్స్ మితెబ్ బిన్ అబ్దుల్లా కూడా బందీలైన వాళ్లలో ఉన్నారు.
చాలా ఏళ్లుగా అవినీతికి పాల్పడుతున్నారన్న నెపంతో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు గత నవంబరు 4న వాళ్లను అరెస్టు చేసి రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌తో పాటు మరికొన్ని హోటళ్లలో నిర్బంధించారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రిట్జ్ హోటల్‌లో ఉంటోన్న అతిథులను అప్పటికప్పుడు ఖాళీ చేయించి అరెస్టయిన వాళ్లకు ఆ గదులను కేటాయించారు. అప్పట్నుంచీ రిట్జ్ హోటల్‌లో బయటి వాళ్లకు ప్రవేశాన్ని నిషేధించారు.
భారీ మొత్తంలో డబ్బుని తిరిగిచ్చేసి అక్కడి నుంచి బయటపడే అవకాశాన్ని అరెస్టయిన వాళ్లకు కల్పించారు. దాంతో వీలైనంత మొత్తం చెల్లించి విడుదలయ్యే ప్రయత్నాలను నిందితులు మొదలుపెట్టారు.
ప్రిన్స్ మితెబ్ దాదాపు రూ.6300కోట్లను తిరిగిచ్చేయడానికి అంగీకరించి విడుదలయ్యారు. ఆయన బాటలోనే మరికొందరు బందీలూ నడిచారు.
అంతర్జాతీయంగా పేరున్న సంపన్న వ్యాపారవేత్త ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ బందీగానే ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటికే చాలామంది బందీలు రిట్జ్ హోటల్‌ను వీడి వెళ్లడంతో, ఫిబ్రవరి మధ్య నుంచి హోటల్ బుకింగులను సామాన్యులకు అందుబాటులోకి తేనున్నారు. కానీ భవిష్యత్తులో ముందస్తు నోటిసుతో బుకింగులను రద్దు చేసే అవకాశాలూ లేకపోలేదని హోటల్ యాజమాన్యం చెబుతోంది.
దశాబ్దాలుగా చోటుచేసుకుంటున్న అవినీతి కారణంగా సౌదీలో దాదాపు 6.5లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమ మార్గాల వైపు మళ్లిందని ఆ దేశ అటార్నీ జనరల్ అన్నారు.
ఈ అరెస్టులపై చాలామంది సౌదీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఇలాగైనా తమ దేశ సంపద తిరిగొచ్చి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందని వారు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









