ఫ్రాన్స్: రూ. 4.15 కోట్లు పలికిన మ్యామత్ అస్థిపంజరం

ఫొటో సోర్స్, AFP
పురాతన మ్యామత్ అస్థిపంజరం 5,48,000 యూరోలకు అమ్ముడయింది. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో జరిగిన వేలంలో ఈ అస్థిపంజరం అంచనా విలువకన్నా అధిక ధర పలికింది.
ప్రస్తుతం ప్రయివేటు సంస్థల చేతుల్లో ఉన్న అతిపెద్ద మ్యామత్ (ఏనుగును పోలిన భారీ జంతువు) అస్థిపంజరం ఇదేనని భావిస్తున్నారు.
ఇది చాలా అరుదైన పురాతన అస్థిపంజరం. ఎందుకంటే ఇందులో 80శాతం నిజమైన ఎముకలే ఉన్నాయి. అస్థిపంజరాన్ని పూర్తి చేయటం కోసం మిగతా మొత్తం రెజిన్ ఉపయోగించారు.
ఇది ఒక మగ మ్యామత్ అస్థిపంజరం. దీనిని పదేళ్ల కిందట సైబీరియా పెర్మాఫ్రాస్ట్ (ఆర్కిటిక్ ప్రాంతంలో నేల కింద ఉండే ఘనీభవించిన మంచు పొర)లో కనుగొన్నారు.
ఈ మ్యామత్ పళ్లలో శిథిలమవుతున్న సంకేతాలు ఉన్నాయని, దానివల్ల అది గడ్డి తినలేక చనిపోయి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
పెర్మాఫ్రాస్ట్ కరగటం వల్ల మ్యామత్ అస్థిపంజరాలు దొరకటం పెరిగిందని మాంచెస్టర్ మ్యూజియంలో ఎర్త్ సైన్స్ కలెక్షన్స్ క్యూరేటర్ డేవిడ్ గెల్స్‌థోర్ప్ పేర్కొన్నారు.
‘‘సైబీరియాలోని పెర్మాఫ్రాస్ట్ వాతావరణ మార్పు వల్ల చాలా వేగంగా కరుగుతోంది’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘దానివల్ల ఈ అద్భుతమైన అస్థిపంజరాలు అవి ఎలా చనిపోయాయో దాదాపు అదే స్థితిలో మనకు దొరుకుతున్నాయి. వెంట్రుకలు, చర్మం, కండరాలు, అవయవాలు.. ఆఖరుకు అది తిన్న చివరి ఆహారం కూడా మనకు లభిస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, AFP
బొచ్చు మ్యామత్‌లు ఆదిమానవులతో పాటు జీవించాయి. మ్యామత్‌లను ఆదిమానవులు వేటాడారు. వారు నివసించిన గుహల్లో మ్యామత్ బొమ్మలు గీశారు.
ఈ భారీ జంతువులు చాలా వరకూ 10,000 ఏళ్ల కిందట చనిపోయాయి. అయితే చిట్టచివరి మ్యామత్ బృందం ఆర్కిటిక్ మహాసముద్రంలోని ఒక దీవిలో 4,000 సంవత్సరాల కిందటి వరకూ నివసించింది.
మ్యామత్‌లు అంతరించిపోవటానికి కారణం మానవులు వాటిని వేటాడటంతో పాటు, పర్యావరణ మార్పులు కూడా కారణమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








