బ్రిటిష్ రచయిత కజువో ఇషిగురోకి సాహిత్యంలో నోబెల్

కజువో ఇషిగురో

ఫొటో సోర్స్, EPA/FABER AND FABER

ఫొటో క్యాప్షన్, నోబెల్ బహుమతి లభించడం ఎంతో సంభ్రమంగా ఉందని కజువో స్పందించారు

బ్రిటిష్ రచయిత కజువో ఇషిగురోకి ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు.

’’ఆయన ఉద్వేగ భరితమైన తన నవలల్లో ప్రపంచంతో మన అనుబంధం గురించిన భ్రమాత్మక భావన వెనుక గల అగాధాన్ని పట్టి చూపారు‘‘ అని స్వీడిష్ అకాడమీ ప్రశంసించింది.

కజువో ఎనిమిది పుస్తకాలు రాశారు. వాటిని 40కి పైగా భాషల్లోకి అనువదించారు. ఆయనకు 1995లో ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్‌ (ఓబీఈ) ప్రకటించారు.

'ద రిమైన్స్ ఆఫ్ ద డే', 'నెవర్ లెట్ మి గో' నవలలు ఆయన రచనల్లో విఖ్యాతమైనవి. ఈ రెండు నవలలు ఆధారంగా తీసిన సినిమాలకు కూడా విశేష ప్రశంసలు లభించాయి.

తనకు నోబెల్ బహుమతి ప్రకటించడం ఎంతో సంభ్రమంగా ఉందని, పట్టలేని ఆనందం కలుగుతోందని 62 ఏళ్ల కజువో స్పందించారు.

నోబెల్ బహుమతితో పాటు రూ. 7.17 కోట్ల నగదు బహుమతి కూడా లభిస్తుంది.

కజువో ఇషిగురో

ఫొటో సోర్స్, Twitter

బీబీసీ ఆయనను సంప్రదించినపుడు.. నోబెల్ కమిటీ నుంచి తనకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని, తనకు బహుమతి ప్రకటించినట్లు వచ్చిన వార్త హాస్యానికి పుట్టించిన వార్తేమో తనకు తెలీదని కజువో పేర్కొన్నారు.

''ఇది బ్రహ్మాండమైన గౌరవం. ఈ అవార్డు లభించిందంటే ఎందరో మహా రచయితల బాటలో నేను నడుస్తున్నానని అర్థం. ఇదొక గొప్ప ఆశ్చర్యం'' అని ఆయన అభివర్ణించారు.

‘‘ప్రపంచం చాలా అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఈ ప్రపంచంలో నోబెల్ బహుమతులు సానుకూల శక్తిగా పనిచేస్తాయని నేను ఆశిస్తున్నా’’ అని కజువో పేర్కొన్నారు.

’’ఎంతో అనిశ్చితమైన ఈ కాలంలో ఏదైనా సానుకూల వాతావరణం కోసం తోడ్పాటునందించే ఎలాంటి కృషిలోనైనా ఏరకంగానైనా నేను పాలుపంచుకోగలిగితే అది నాకెంతో ఉద్వేగాన్నిస్తుంది’’ అని చెప్పారు.

కజువో ఇషిగురో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కజువో రచనలు 'కొంచెం జేన్ ఆస్టిన్ - ఫ్రాంజ్ కాఫ్కా రచనల కలబోతలా ఉంటాయి'

కజువో రచనలు జ్ఞాపకం, కాలం, స్వీయ-భ్రమ అంశాల మీద ఉంటాయి. సినిమాలు, టెలివిజన్‌లకు స్క్రిప్టులు కూడా ఆయన రాశారు.

2015లో విడుదలైన ఆయన తాజా పుస్తకం 'ద బరీడ్ జెయింట్'.. ''విస్మృతికి జ్ఞాపకానికి, వర్తమానానికి చరిత్రకు, వాస్తవానికి కల్పనకు గల సంబంధాన్ని అన్వేషిస్తుంద''ని నోబెల్ కమిటీ కీర్తించింది.

కజువో రచనలు ''కొంచెం జేన్ ఆస్టిన్ - ఫ్రాంజ్ కాఫ్కా రచనల కలబోతలా ఉంటాయి'' అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డేనియస్ అభివర్ణించారు.

ఆయన గొప్ప నిబద్ధత గల రచయిత అని సారా పేర్కొన్నారు. ''ఆయన పక్కకి చూడరు. ఆయన పూర్తిగా తన సొంతదైన కళాత్మక ప్రపంచాన్ని రూపొందించారు'' అని ప్రశంసించారు.

ద బరీడ్ జెయింట్ నవలతో కజువో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ’ద బరీడ్ జెయింట్' నవల ''విస్మృతికి జ్ఞాపకానికి, వర్తమానానికి చరిత్రకు, వాస్తవానికి కల్పనకు గల సంబంధాన్ని అన్వేషిస్తుంద''ని నోబెల్ కమిటీ కీర్తించింది

ఎవరీ కజువో ఇషిగురో?

  • కజువో ఇషిగురో 1954లో జపాన్‌లోని నాగసాకిలో జన్మించారు. ఆయన తండ్రికి సర్రేలో ఓషనోగ్రాఫర్ ఉద్యోగం లభించినపుడు కుటుంబంతో పాటు ఆయన కూడా ఇంగ్లండ్ వలస వెళ్లారు.
  • యూనివర్సిటీ ఆఫ్ కెంట్‌లో ఇంగ్లిష్, ఫిలాసఫీ అభ్యసించారు. దానికి ముందు ఒక ఏడాది బాల్మోరాల్‌లో రాణీ మాత వద్ద గ్రూస్ బీటర్ (కోడి లాంటి పక్షుల వేటకు వెళ్లినపుడు వాటిని వేటాడే వారి దిశగా తరిమే ఉద్యోగి) గా పనిచేశారు.
  • యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో సృజనాత్మక రచనలో ఎంఏ చేశారు. అక్కడ మాల్కమ్ బ్రాడ్‌బరీ, ఏంజెలా కార్టర్‌లు ఆయనకు బోధకులు.
  • 'ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్' అనే ఆయన సిద్ధాంత గ్రంథం (థీసిస్) 1982లో ప్రచురితమైంది. అది ఆయన తొలి నవలగా విమర్శకుల ప్రశంసలు పొందింది.
  • 'ద రిమైన్స్ ఆఫ్ ద డే' నవలకు గాను 1989లో కజువోకు బుకర్ ప్రైజ్ లభించింది.
కజువో ఇషిగురో పుస్తకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కజువో రచనలు కొన్ని సినిమాలుగా కూడా రూపొందాయి

కజువో ఇషిగురో పుస్తకాలివీ...

  • కజువో తొలి నవల 'ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్' . ఇంగ్లండ్‌లో నివసించే ఒక జపాన్ మహిళ తన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోవడానికి చేసే ప్రయత్నం ఇందులోని కథాంశం.
  • ఆయన రెండో నవల 'యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్' 1986లో విడుదలైంది.
  • 'ద రిమైన్స్ ఆఫ్ ద డే' నవల.. నాజీ సానుభూతిపరుడైన రాజకీయ ప్రముఖుని ఇంట్లో పనిచేసే నౌకరు కథ.
  • 1990ల్లో ఆయన 'ద అన్‌కన్సోల్డ్' నవల ఒక్కటే రాశారు. 2000 సంవత్సరంలో 'వెన్ వి వర్ ఆర్ఫన్స్' అనే నవల రాశారు.
  • 2005లో రాసిన 'నెవర్ లెట్ మి గో' నవల.. భీతావహమైన భవిష్యత్తులో ఒక బోర్డింగ్ స్కూల్‌ విద్యార్థుల గురించి రాసినది. ఈ నవలను ఐదేళ్ల తర్వాత సినిమాగా తీశారు. అందులో కీరా నైట్‌లే, కారీ ముల్లిగన్‌లు నటించారు.
  • ఆయన కథల సంగ్రహాన్ని 2009లో 'నాక్టర్న్స్: ఫైవ్ స్టోరీస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ నైట్‌ఫాల్' పేరుతో ప్రచురించారు.
  • కజువో తాజా నవల 2015లో ప్రచురితమైన 'ద బరీడ్ జెయింట్'.
  • ద వైట్ గాడెస్, ది శాడెస్ట్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్ సహా పలు సినిమాలకు స్క్రీన్‌ప్లేలు, ఇతర చిన్న కథలు కూడా రాశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)