భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా? జాతీయ భద్రతా సలహా సంఘం ఛైర్మన్ ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన కీలక చైనా టెలీకాం కంపెనీలను అడ్డుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా కచ్చితంగా స్వదేశీ సంస్థలపై ఆధారపడాలని, అలాగే నమ్మకం ఉన్న విదేశీ సంస్థల్ని మాత్రమే అనుమతించాలని జాతీయ భద్రతా సలహా సంఘం చైర్మన్ పీఎస్.రాఘవన్ బీబీసీతో అన్నారు.
“5జీ ... ఈ విషయంలో స్వదేశీ మార్గంలోనే నడవాలని NSAB చాలా పట్టుదలగా ఉంది. అలాగని విదేశీ సంస్థలన్నింటినీ మేం ఒకే గాటన కట్టడం లేదు. విశ్వాసం గురించి మీరు మాట్లాడితే మాత్రం ఏ దేశాల పట్ల, ఏ కంపెనీల పట్ల మనకు ఎక్కువ నమ్మకం ఉంటుందో ఆయా సంస్థల నుంచి లేదా దేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాలని నేను చెబుతాను. చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈ లేదా మరి ఏ ఇతర సంస్థలైనా ఆ విషయంలో సరితూగుతారా ?” అని రాఘవన్ అన్నారు.
గత డిసెంబర్లో భారత ప్రభుత్వం 5జీ స్పెక్టమ్‌ను ప్రయోగాత్మకంగా అన్ని సంస్థలకు కేటాయించింది.
తాజాగా హువావే, జెడ్‌టీఈ సంస్థలను జాతీయ భద్రతకు ముప్పు కల్గించే సంస్థలుగా పేర్కొంది అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్. అందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. అమెరికా కమ్యూనికేషన్ల వ్యవస్థను, 5జీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ ఛైర్మన్ అజిత్ పాయ్ మంగళవారం ప్రకటించారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే ఆ దేశ మిలటరీతో రెండు సంస్థలకు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలిందని ఆయన అన్నారు. ఆ సంస్థల నిబంధనలు కూడా చైనా నిఘా వ్యవస్థలకు సహకరించే చట్టాలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పరిశీలనలు, నిఘా వర్గాల అభిప్రాయాలు, ఇతర దేశాల్లోని సర్వీస్ ప్రొవైడర్ల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అజిత్ పాయ్ వెల్లడించారు.
“టెలీకాం రంగాన్ని ఒక వ్యూహాత్మక రంగంగా చైనా రూపొందించింది. అలాగే ఏ విదేశీ సంస్థను అందులోకి అనుమతించ లేదు. మనం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎందుకు చెయ్యకూడదు? 5జీ వ్యవస్థలో డేటా ట్రాన్మిషన్ అత్యంత వేగంగా జరుగుతుంది. అంటే మీ మొబైల్లో మరింత వేగంగా సినిమాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో హార్డ్ వేర్ కానీ సాఫ్ట్ వేర్ కానీ మన నమ్మకానికి, భద్రతాపరమైన పరీక్షలకు తట్టుకొని నిలవాలి. ఏ విదేశీ సంస్థనైనా దేశంలోకి అనుమతించేటపుడు వాటిని అన్ని విధాల నియంత్రించేందుకు అవసరమైన స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే మనకంటూ ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనిని మేం చాలా బలంగా వాదిస్తున్నాం” అంటూ రాఘవన్ చెప్పుకొచ్చారు.
భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధం విధించక ముందు, అలాగే ఎఫ్‌సీసీ ఆదేశాలు జారీ చేయక ముందు రాఘవన్ బీబీసీతో మాట్లాడారు. అయినప్పటికీ తాజా పరిణామాలకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడతాయనే చెప్పవచ్చు.
“ఇటీవల సరిహద్దు సమస్య తలెత్తక ముందు నుంచీ అంటే సుమారు 8 నెలలుగా ప్రభుత్వానికి మేం ఈ సలహా ఇస్తూనే వచ్చాం” అని రాఘవన్ చెప్పారు.

ఫొటో సోర్స్, twitter.com/jugalrp
ప్ర. అంటే జాతీయ భద్రతా సలహా సంఘం ఇచ్చిన సూచనలకు భిన్నంగా భారత ప్రభుత్వం వ్యవహరించిందా? మీరు వద్దంటున్నా ట్రయిల్స్ విషయంలో అందరికీ తలుపులు తెరచిందా?
“ప్రభుత్వం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మా సలహాలను పక్కన పెట్టారని లేదా తిరస్కరించారని నేను భావించడం లేదు. ఆ విషయాన్ని అలా ఉంచితే ఇప్పటికీ మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మనం 5జీ స్ప్రెక్టమ్ కేటాయింపులు జరపలేదు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే ప్రపంచం మొత్తం 5జీ టెక్నాలజీపై ఆధారపడనుంది. ఈ సమయంలో దాన్ని తప్పుడు చేతుల్లో పెడితే దేశం సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే” అని అన్నారు.
(ఈ ఏడాది జరగాల్సిన 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసినట్టు బీబీసీ దృష్టికి వచ్చింది.)
ప్ర. చైనాను దెబ్బ తియ్యడానికి భారత్ ఇప్పటికిప్పుడు ఏమైనా చెయ్యగలదా?
“సాధారణంగా వ్యూహాత్మక సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారాలు ఉండవు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇటువంటి సమస్యల విషయంలో ఆర్థికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్థికపరంగా తీసుకునే మంచి నిర్ణయాలతో ఎన్నికల్లో మీరుగెలవచ్చు లేదా ఓడిపోవచ్చుకూడా. కానీ వ్యూహాత్మకంగా తీసుకున్న మంచి నిర్ణయం వల్ల అది మీ తరువాత అధికారంలోకి వచ్చే వారికైనా సహాయ పడవచ్చు. దీర్ఘకాలిక విధానానికి వచ్చేసరికి ఏది అవసరం అని ప్రశ్నిస్తే... ప్రభుత్వం అనుసరించే విధానాలన్నీ కూడా వేర్వేరు మార్గాల్లో ఉంటాయి. అవి రాజకీయ చర్చలు కావచ్చు లేదా వివిధ రంగాలలో ఉండే ఆర్థిక సంబంధాలు కావచ్చు. అయితే ఈ విషయంలో మాత్రం మనం గత కొద్ది కాలంగా సరైన రీతిలో వ్యవహరించడం లేదని చెప్పగలను” అని అన్నారు.
ప్ర.బ్రిక్స్ లేదా ఎస్‌సీఓ వంటి సంస్థలలో చైనాతో భారత్ ఇకపై వేదిక పంచుకోవాలా?
“కూటమి దేశాల్లో పరస్పర వ్యతిరేక భావాలున్న దేశాలు చాలా ఉన్నాయి. ఇటు భారత్ కానీ అటు చైనా కానీ అలాంటి సంస్థల్లో సభ్య దేశాలుగా ఉండటం కొత్తేం కాదు. తమ ఆసక్తులను పంచుకునేందుకు వివిధ దేశాలు అటువంటి సంస్థల్లో చేరుతాయి. చైనా సభ్య దేశంగా ఉన్న కూటముల్లో తాము ఉండబోమని భారత్ చెప్పడం అసాధ్యం. భద్రతా మండలిలో కూడా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రష్యా పాత్ర
నాజీ జర్మనీలపై సోవియట్ రష్యా సాధించిన విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత వారంలో రష్యా ఘనంగా వేడుకల్ని నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్. అజయ్ కుమార్ మాస్కో వెళ్లారు. రష్యా ఉప ప్రధానితో సానుకూల వాతావరణంలో ఫలవంతమైన చర్చలు జరిగాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
రక్షణ-విద్యుత్ రంగంలో భారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో చైనాతో కూడా రష్యాకు దృఢమైన అనుబంధమే ఉంది. అయితే అది కేవలం రక్షణ-విద్యుత్ రంగాలకు మాత్రమే పరిమితం కాలేదు.
ఈ విషయంలో రష్యా ఎవరి పక్షాన నిలబడుతుందని రాఘవన్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
“భారత్-రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా సంబంధాలు కొనసాగుతున్నాయి. అదే చైనా విషయానికి వచ్చేసరికి అటువంటి పరిస్థితి లేదు. వాళ్ల మధ్య యుద్ధాలు జరిగాయి. సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇండియాతో పోల్చితే రష్యాకు శత్రువయ్యే అవకాశం చైనాకే ఎక్కువగా ఉంది.
పశ్చిమ దేశాలు రష్యాను పక్కన పెట్టినప్పుడు రష్యా అనుకున్నదాని కన్నా ఎక్కువగా చైనాకు దగ్గరయ్యింది. అదీగాక రష్యాకు సూపర్ పవర్‌గా నిలవాలన్న కాంక్ష ఉంది. అయితే చైనాకు జూనియర్ భాగస్వామిగా ఉంటూ ఆ స్థానాన్ని సాధించలేదు. అయితే పశ్చిమ దేశాలు రష్యా-చైనా పట్ల శతృత్వాన్ని కొనసాగిస్తే అప్పుడు ఆ రెండు దేశాలు మరింత దగ్గరవుతాయి. కానీ భారత్ అలా జరగాలనుకోవడం లేదు” అని రాఘవన్ వివరించారు.
ఇవి కూడా చదవండి
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- చైనాతో సరిహద్దు ఘర్షణ విషయంలో భారత్ చేస్తున్న ప్రకటనల్లో ఎందుకిన్ని తేడాలు?
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- భారత్-నేపాల్ ఉద్రిక్తతలతో ఆపిల్ పండ్ల ధరలు పెరిగిపోతాయా
- గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత్‌తో ఘర్షణల్లో గన్స్ వాడకూడదన్న నిబంధన వల్లేనా
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- పీవీ నరసింహారావు శత జయంతి: మోదీ గుర్తు చేసుకుంటే, సోనియా మర్చిపోయారా?
- తమిళనాడు ఎన్ఎల్సీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలుడు... ఆరుగురు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








