అబ్దుల్లాపూర్‌మెట్: తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్య మృతి

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో గాయపడిన మరొకరు మరణించారు.
విజయారెడ్డిని నిందితుడు సురేశ్ పెట్రోలు పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడబోయిన తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
నవంబరు 4న జరిగిన ఈ ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి అక్కడికక్కడే చనిపోగా ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టిన నిందితుడు సురేశ్ కూడా అనంతరం మరణించాడు.
విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె డ్రైవరు గురునాథం, అటెండర్ చంద్రయ్య కూడా తీవ్రంగా గాయపడగా వారిలో గురునాథం ఇప్పటికే మరణించారు. 28 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య సోమవారం(డిసెంబరు 2, 2019) ఉదయం మరణించారు.
ఈ మేరకు కంచన్‌బాగ్ డీఆర్‌డీవో ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.

నిందితుడు సురేశ్ మృతి
తహసీల్దారు విజయ రెడ్డిపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సురేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంతకుముందే చనిపోయారు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ నవంబరు 7 మధ్యాహ్నం గం 3.25లకు చనిపోయారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దారుగా పనిచేస్తున్న విజయ రెడ్డి సోమవారం ఆమె కార్యాలయంలోనే సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.
ఈ దాడికి పాల్పడింది అదే మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌గా పోలీసులు గుర్తించారు. దాడి ఘటనలో సురేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని పోలీసులు డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
దాదాపు 65 శాతం కాలిన గాయాలతో ఉన్న అతడ్ని తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 3.25 గంటలకు చనిపోయారు.
భూవివాదం వల్లనే సురేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు.

ఎవరీ సురేశ్
సురేశ్‌ది రంగారెడ్డి జిల్లాలోని గౌరెల్లి గ్రామం. విజయ రెడ్డి హత్య తర్వాత సురేశ్ కుటుంబాన్ని ప్రశ్నించడానికి పోలీసులు గ్రామానికి వెళ్లారు. సురేశ్ తండ్రి కృష్ణ తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ''నా కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదు. గత ఆరు నెలలుగా తాగుడు అలవాటు పడ్డాడు. మాకు, మరో 30 కుటుంబాలకు కలిపి సుమారు 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూవివాదంలో కోర్టులో ఉంది. నేను, నా సోదరుడు ఆ వ్యవహారం చూస్తున్నాం. సురేశ్ తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో మాకు తెలియదు'' అన్నారు.
ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినందుకు సురేశ్‌ను శిక్షించాలని గ్రామస్థుల్లో కొందరన్నారు. ఒక మహిళపై ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడిన సురేశ్‌ను ఎవరూ క్షమించరని మహేశ్ అనే గ్రామస్తుడు అన్నారు.
గ్రామ సర్పంచి మల్లేశ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ... ''తమ భూమి పాస్ పుస్తకాలు పొందడానికి సురేశ్ కుటుంబం చాలా కష్టపడుతోందని తనకు తెలుసు. వారి అధీనంలో భూమి ఉందని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఆదేశాలు వారికి అనుకూలంగా రాలేదు. దీంతో సురేశ్ కలత చెందాడు. కోర్టులో ఏం జరిగిందో నాకు తెలియదు" అన్నారు.

కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్
తహసీల్దార్‌ను రక్షించడానికి ప్రయత్నించిన అటెండర్ చంద్రియా, డ్రైవర్ గురునాథానికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురునాథం మృతిచెందారు.
ప్రత్యక్ష సాక్షి అయిన గురునాథం అక్కడ ఏం జరిగిందో తన మరణానికి ముందు వివరించారు.
''తహసీల్దార్ ఉన్న గదిలోకి వెళ్లిన సురేశ్.. విజయ రెడ్డిపై పెట్రోల్ పోశాడు. లోపలి నుంచి అరుపులు వినగానే నేను, అటెండర్ వెళ్లాం. అప్పటికి మేడమ్ తలుపు తెరిచి బయటకు వచ్చారు. మేం సురేశ్‌ను పక్కకు లాగడానికి ప్రయత్నించాం. గొడవలో మేడమ్ నేలపై పడ్డారు. మాపైనా పెట్రోల్ పడింది. మేం అడ్డుకునేలోగానే సురేశ్ నిప్పంటించాడు'' అని గురునాథం చెప్పారు.
దాడి చేసిన తరువాత సురేశ్ కూడా 60 శాతం కాలిన గాయాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రాచకొండ డివిజన్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. ఎవరైనా ప్రేరేపిస్తే సురేశ్ ఈ హత్య చేశారా లేదంటే తనకు తానే చేశారా అన్నది విచారిస్తున్నాం'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








