గౌతం గంభీర్: ‘ఆఫ్రీది.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌నూ సరిచేస్తాం‘ - ప్రెస్‌రివ్యూ

ఆఫ్రిది, గౌతం గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆఫ్రిది, గౌతం గంభీర్

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రీది తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, ఎంపీ..మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అతడికి కౌంటర్‌ ఇచ్చారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ముందుగా అఫ్రీది ట్విటర్‌ ద్వారా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. 'ఐరాస తీర్మానం ప్రకారం కశ్మీరీలకు వారి హక్కులను ఇవ్వాలి. మనందరిలాగే వారికి స్వేచ్ఛ ఉండాలి. అసలు ఐరాస ఎందుకుంది? మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో జరుగుతున్న హింసను గుర్తించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించాల'ని అఫ్రీది ఆవేశంగా ట్వీట్‌ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ట్వీట్‌కు గౌతీ దీటుగా సమాధానమిచ్చాడు. 'అఫ్రీది ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. మానవత్వానికి వ్యతిరేకంగా హింస చెలరేగుతోంది. ఈ విషయాన్ని బయటకు తెలిపినందుకు అతడిని అభినందించాల్సిందే. కానీ, ఎక్కడ అనేది అతడు చెప్పలేదు. ఇదంతా జరుగుతున్నది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే..! ఆందోళన వద్దు.. దాన్నీ సరి చేస్తామ'ని గౌతీ కౌంటర్‌ ఇచ్చారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images

‘ఏపీ విభజన ఏకపక్షమే’

యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించిందని, ఏపీ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకితీసుకోలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మండిపడ్డారని సాక్షి తెలిపింది.

జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ చేసిన ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తిప్పికొట్టారు. మనీష్‌ తివారీ ప్రసంగిస్తూ ఆర్టికల్‌ 3 అంటే మీకు మీరే చర్చించుకుని వచ్చి ఒక రాష్ట్ర సరిహద్దులు మార్చడమో, రెండుగా విభజించడమో కాదని, శాసనసభ, శాసనమండలిలో చర్చించి వాటి అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ లేచి ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా యూపీఏ ఏపీని ఏకపక్షంగా విభజించిందని మండిపడ్డారు. దీనిపై మనీష్‌ తివారీ స్పందిస్తూ 'విభజన బిల్లు తెచ్చే ముందు అనేక చర్చలు జరిగాయి.

ఏపీ చట్టసభల్లోనూ చర్చ జరిగిన తరువాతే తెలంగాణ ఏర్పాటు చేశాం' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు అందరూ లేచి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఏపీ అసెంబ్లీ సమర్థించిందంటూ ఓ సభ్యుడు మాట్లాడారని, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఉమ్మడి శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించిందని గుర్తుచేశారు. విభజనపై సంప్రదింపులకు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ను ఏర్పాటుచేసినప్పటికీ నివేదికను తప్పుగా అన్వయించి, రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఈ విషయంపై తనకు సాధికారత ఉందని, తానే విభజనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసినట్టు తెలిపారు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లో ఉందని వివరించారని సాక్షి వెల్లడించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు

ఫొటో సోర్స్, kcr/fb

‘సజీవ గోదావరిని చూసి మనసు పులకించింది’

ఒకప్పుడు ఎండిపోయినట్టు కనిపించే గోదావరి.. నేడు మేడిగడ్డ నుంచి ధర్మపురి నరసింహస్వామి పాదాల చెంత వరకు.. సుమారు 150 కిలోమీటర్ల మేర అద్భుతమైన జీవనదిని సాక్షాత్కరిస్తున్నదని, తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనుకున్నదానికి మించి గొప్పగా గోదావరి సాక్షాత్కరించిందంటూ ఆనందం వెలిబుచ్చారు. తెలంగాణకు శాశ్వత నీటివసతి కాళేశ్వరంతోనే సాధ్యమని రుజువైందని చెప్పారు.

సజీవ గోదావరిని చూసి తన మనసు పులకించిపోయిందన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానంలో అయితే 20, 25 ఏండ్లకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదికాదని అన్నారు. కానీ.. సమిష్టిగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసుకున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ఇంతపెద్ద సజీవ గోదావరిని తెలంగాణకు ప్రసాదించినందుకు ఇరిగేషన్ డిపార్టుమెంటును అభినందించారు. నిండుగా నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఏరియల్ వ్యూద్వారా పరిశీలించారు.

మేడిగడ్డ బరాజ్‌పై కాలినడకన తిరిగి, గోదావరి తల్లికి వాయినాలు సమర్పించారు. అనంతరం గోలివాడ పంప్‌హౌస్‌ను సందర్శించారు. తదుపరి ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, ఆవశ్యకతను వివరించారు. ఈ ప్రాజెక్టుపై పలువురు కుహనా మేధావులు చేస్తున్న విమర్శలను గణాంకాలతో తిప్పికొట్టారు. ఎస్సారెస్పీలోకి ఐదారు టీఎంసీల నీళ్లు కూడా రాలేదని, కానీ.. మేడిగడ్డ దగ్గర రోజుకు 50-60 టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయని చెప్పారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, ysrcp/fb

‘నవరత్నాలకు చేయూత ఇవ్వండి‘

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాల కార్యక్రమం చేపట్టామని, దీనికి పూర్తిస్థాయిలో సాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారని ఈనాడు తెలిపింది.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మోదీకి ఆయన తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి, ప్రాధాన్యాల్లో చోటు చేసుకున్న అసమానతల్ని సరిదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

మంగళవారం పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో జగన్‌ భేటీ అయ్యారు. కశ్మీర్‌ అంశంపై వాడివేడిగా లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో సుమారు 45 నిమిషాల సమయాన్ని ప్రధాని కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నదుల అనుసంధానానికి, వాటర్‌గ్రిడ్‌ పనులకు నిధులివ్వాలని కోరిన ముఖ్యమంత్రి- పలు ఇతర అంశాలపైనా వినతిపత్రం అందజేశారు. విభజన కారణంగా రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, సంక్షేమ/ నవరత్నాల పథకాలకు కేంద్రం సాయం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు.

మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీ చేరుకున్న సీఎం జగన్‌.. కొద్దిసేపు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. కశ్మీర్‌ అంశంపై ఉభయ సభల్లో పార్టీ విధానం, ఇతరత్రా తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలిసింది.

ప్రధాని కార్యాలయానికి జగన్‌ వెళ్తున్న సమయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, తిరిగి వస్తున్నప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బరామిరెడ్డి ఆయనతో ఉన్నారని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)