తెలంగాణ ఎన్నికల ఫలితాలు: కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ

facebook

ఫొటో సోర్స్, facebook

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో దిగిన నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇక్కడ ముందంజలో ఉన్నారు.

హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి ఒకటి. ఒకప్పుడు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కూకట్‌పల్లి 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడింది.

మహాకూటమి అభ్యర్థిగా అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని.

మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మొదటి నుంచి ఈ స్థానం తమకే కావాలని పట్టుబట్టి సాధించుకుంది. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ సీటును ఆయన నందమూరి సుహాసినికి కేటాయించారు.

నగరంలో ఆంధ్రులు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం ఒకటి.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు గెలుపొందారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నుంచి మాధవరం కాంతారావు పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న మాధవరం కాంతారావు.. టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావుకు సమీప బంధువు. 2009లో ఆయన పోటీ చేసి పదివేల ఓట్లు తెచ్చుకున్నారు.

గతంలో లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.

ఈ నియోజకవర్గంలో బాలానగర్‌ పారిశ్రామిక కేంద్రంతో పాటు కేంద్ర పరిశోధనా సంస్థలు సీఐటీడీ, ఎస్‌ఎంఈడీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)