భారత్‌లో సమస్యల్లో చిక్కుకున్న వాట్సాప్: 10 ముఖ్యమైన విషయాలు

ఫొటో సోర్స్, AFP
భారత్‌లో అత్యధికంగా ఉపయోగించే మెసెంజర్ యాప్ వాట్సాప్. కానీ ఇటీవలి కాలంలో ఇది సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఆ మెసెంజెర్ యాప్ ద్వారా చలామణి అవుతున్న వదంతులు మూక దాడులకు దారి తీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌లో వాట్సాప్ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పది విషయాలివి.
1. భారత్‌లో 20కోట్లమంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ సంస్థకు అతిపెద్ద మార్కెట్ భారతే.
2. చాలా మంది భారతీయులకు, ముఖ్యంగా గ్రామీణులకు వార్తలను, సమాచారాన్ని పంచుకునేందుకు ఇదే ప్రధాన మాధ్యమంగా మారింది. ఈ రకమైన మాధ్యమాల వల్ల వ్యాప్తి చెందిన వదంతుల కారణంగా మూడు నెలల్లో పాతిక మంది దాకా మూకదాడికి గురయ్యారు.
3. ఫేక్‌న్యూస్‌ను అరికట్టే బాధ్యతను భారత ప్రభుత్వం వాట్సాప్‌పైనే పెట్టింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ యాజమాన్యానికి రెండు నోటీసులు పంపింది.
4. వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ ఇటీవలే భారత్ వచ్చి ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు. గత రెండు నెలల్లో వాట్సాప్‌కు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు భారత్‌కు రావడం ఇది రెండోసారి.
5. ఫేక్ మెసేజ్‌లు ఎక్కడినుంచి పుడుతున్నాయో కనుక్కోవడానికి అనువైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలని భారత్ వాట్సాప్ యాజమాన్యాన్ని కోరుతోంది.

ఫొటో సోర్స్, AFP
6. వాట్సాప్‌కు భారత్‌లో ఎలాంటి కార్పొరేట్ కార్యాలయం లేదు. దాంతో దేశంలో సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారత్‌లో వాట్సాప్ తరఫున ఓ గ్రీవెన్స్ అధికారిని కూడా నియమించాలని ఐటీ శాఖా మంత్రి సూచించారు.
7. వాట్సాప్ ఇప్పటికే ఫార్వర్డ్ మెసేజ్‌లపైన నియంత్రణను విధించింది. ఎక్కువ సార్లు ఓ సందేశాన్ని ఫార్వర్డ్ చేయకుండా నియంత్రించడం ద్వారా ఫేక్ న్యూస్‌ను అరికట్టొచ్చని ఆ సంస్థ భావిస్తోంది. తమ యాప్‌ను దుర్వినియోగం చేయకుండా చేసేందుకు అవగాహన ప్రచారాన్ని కూడా వాట్సాప్ నిర్వహిస్తోంది.
8. ఆర్థికపరమైన డేటాను కేంద్ర బ్యాంకుల దగ్గర నిక్షిప్తం చేసేలా కేంద్రం కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ కూడా వాటిని అనుసరించాలని ప్రభుత్వం కోరింది.
9. ‘అనుమానాస్పద’ చాటింగ్‌ల విషయంలో, అవి అనుమానస్పదమైనవని స్పష్టంగా తెలిసేలా లేబిలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు వాట్సాప్ పరీక్షిస్తోంది.
10. మొబైల్ చెల్లుబాట్ల కోసం ప్రవేశ పెట్టాలనుకున్న ‘వాట్సాప్ పే’ ప్రస్తుతానికి వాయిదా పడింది. వాట్సాప్ తన భారతీయ బృందాన్ని ఏర్పాటు చేశాకే ఆ సేవలు మొదలు కావొచ్చు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








