ప్రెస్‌రివ్యూ: ఆవులకూ ఆధార్.. బడ్జెట్‌లో రూ.50 కోట్లు!!

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని ప్రతి ఒక్కరికీ 12 అంకెల ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ఆవులకు కూడా ఓ నంబర్‌ను (యూనిక్ ఐడెంటిఫికేషన్) కేటాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. తొలుత ఈ ప్రతిపాదనను 2015లో తీసుకొచ్చారు.
ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఈసారి బడ్జెట్‌లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో మొదటిదశలో నాలుగు కోట్ల ఆవులకు నంబర్లు కేటాయిస్తారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) టెక్నాలజీని సమకూర్చుకున్నదని డెయిరీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత చవకైనదని.. ఆవుకు సంబంధించిన జాతి, వయస్సు, లింగం, ఎత్తు, శరీర గుర్తులు వంటి వివరాలతో కూడిన టాంపరింగ్‌కు అవకాశం లేని ట్యాగ్ ఉంటుందన్నారు.
ఒక్కో కార్డుకు రూ.8 నుంచి రూ.10 వరకు వ్యయం అవుతుందన్నారు. పశుసంజీవిని పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టు డెయిరీ, ఫిషరీస్ రంగంలో అతిపెద్దదని పేర్కొన్నారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘అమిత్‌షా ఫోన్ చేయలేదు’
ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకోవడం, ఎంపీల రాజీనామాలు వంటి 'తొందరపాటు' నిర్ణయాలేమీ ఇప్పటికిప్పుడు అవసరం లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం ఉండవల్లిలో ఈ సమావేశం జరిగింది. అప్పుడు టీవీ ఛానళ్లలో వస్తున్న వార్తల వివరాలను కొందరు ముఖ్యమంత్రికి తెలిపారు. సమావేశం ప్రారంభానికి ముందు చంద్రబాబుతో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారంటూ కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన వార్తల్ని ఆయన ఖండించారు. అమిత్‌షా ఫోన్ చేయలేదని స్పష్టంచేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేతో తాను మంతనాలు సాగించినట్టుగా ఒక పత్రికలో వచ్చిన కథనాన్నీ ఆయన ఖండించారు. తాను ఆయనతో మాట్లాడలేదని తెలిపారు.
సమావేశం జరుగుతున్నప్పుడే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. భాజపా, కేంద్ర ప్రభుత్వం తరపున కాకుండా వ్యక్తిగత హోదాలోనే మాట్లాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడాక ముఖ్యమంత్రి సమావేశాన్ని కొనసాగించారు. ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకోవడం, ఎంపీల రాజీనామాలు వంటి తొందరపాటు నిర్ణయాలేమీ ఇప్పటికిప్పుడు అవసరం లేదని.. ఇదే సమయంలో ప్రజాప్రయోజనాల విషయంలోనూ రాజీ పడరాదని సమావేశంలో నిర్ణయించారు.
భవిష్యత్తు కార్యాచరణపై ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దీని ప్రకారం..భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్ వంటి ముఖ్యుల్ని తెదేపా ఎంపీలంతా సోమవారం కలుస్తారు.
కొత్తగా ఏమీ అడగడం లేదని, కేంద్ర హామీలు, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసినవే అడుగుతున్నామని చెబుతారు. విశ్వాసం కుదిరేలా విస్పష్టమైన హామీకి పట్టుబడతారు.
వారినుంచి ఆశించిన స్పందన లేని పక్షంలో మంగళవారం నుంచి పార్లమెంటు వేదికగా ఆందోళన చేపడతారు. ఉభయసభల్లోను తెదేపా ఎంపీలు వెల్‌లోకి వెళ్లి గట్టిగా నిరసన తెలియజేస్తారు.
చంద్రబాబు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఎంపీలతో మాట్లాడతారు. కేంద్రం నుంచి హామీ వచ్చేంతవరకు గానీ, ఈ నెల 9న పార్లమెంటు వాయిదా పడేంత వరకుగానీ ఈ ఆందోళన కొనసాగుతుంది.
అప్పటికీ కేంద్రంలో స్పందన లేకపోతే మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారు అని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
ముందస్తు లేదు.. సీట్ల పెంపూ ఉండదు
''ముందస్తు ఎన్నికలు ఉండవు.. అసెంబ్లీ సీట్ల పెంపూ ఉండదు'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో అమిత్ షాతో రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో అసెంబ్లీ సీట్ల పెంపు, పొత్తుల ప్రస్తావనే రాలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను టార్గెట్‌గా అమిత్ షా పేర్కొన్నారన్నారు.
తాను త్వరలో తెలంగాణకు వస్తానని, జూన్ నుంచి వరుసగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని అమిత్ షా ఆదేశించారన్నారు.
బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి పార్టీలోనే కొనసాగుతారని, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాజీనామాను పార్టీ ఆమోదించలేదని లక్ష్మణ్ అన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, cpimcc/facebook
‘మనలోనూ లోపాలున్నాయి.. సవరించుకోవాలి’
'మన చైతన్యంలో కూడా లోపాలున్నాయి..వాటిని సవరించుకోవాలి.. సామాజిక దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి...' అని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు.
ఆ దిశగా ఆలోచించకుండా వర్గపోరాటం ముందడుగేయదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో చైతన్యం పెరుగుతున్న చైతన్యాన్ని ప్రజాస్వామ్య ఉద్యమాల్లోకి రాకుండా కొందరు కుల నేతలు రాజకీయ సమీకరణకు పాల్పడుతున్నారని చెప్పారు.
వీటిని నిశితంగా పరిశీలించి, అర్థం చేసుకోవటం ద్వారా సరైన ఎత్తుగడలు వేయాలని కోరారు. 'ఈ క్రమంలో మనలో స్వాభావికంగా ఉన్న లోపాలను కూడా సవరించుకోవాలి...' అని ఏచూరి ఈ సందర్భంగా సూచించారు.
సీపీఐ (ఎం) ద్వితీయ మహాసభలు ఆదివారం నల్లగొండలోని నర్రా రాఘవరెడ్డి నగర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధుల సభలో ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారని నవ తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, iStock
భారత్ నుంచి సంపన్నుల వలస
పేదవారు పొట్ట చేత పట్టుకుని వలస పోవడం వినే ఉంటారు. వారిది జీవనపోరాటం. అయితే, వలసలు వారికే పరిమితం కాదు. సంపన్నులు కూడా తమ అవసరాల కోసం, ఆశయాల కోసం, మెరుగైన జీవనం కోసం వలసల బాట పడుతున్నారు. విదేశాలకు తమ గమ్యస్థానాన్ని మార్చుకుంటున్నారని సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది.
2017లో మన దేశం నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు మకాం మార్చారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మన దేశ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు.
మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్ డాలర్లు.
భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉన్నారు. ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. 119 మంది బిలియనీర్ల (100 కోట్ల డాలర్లు, అంతకు పైన సంపద ఉన్నవారు)తో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








