భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు...

శాస్త్రవేత్తలు, సెక్సాలజీ నిపుణులు చాలా మందికి అంతు బట్టని విషయం ఇది. మహిళల్లో భావప్రాప్తి సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

మహిళల్లో ఆ 'అంతిమ' ఆనందం గురించి పుస్తకాల్లో చాలా రాశారు.

అయితే, అందరూ అలాంటి అనుభవం పొందడం లేదు. అసలు అది ఎలా ఉంటుందో తమకు ఎప్పుడూ అనుభవవంలోకి కూడా రాలేదంటున్నారు కొంతమంది.

భావప్రాప్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి శారీరక, మానసిక, హార్మోన్లు, భావోద్వేగ అంశాలు ఏవైనా కావచ్చు.

అలాంటి వాటిలో ఎనిమిది అంశాలను గురించి ఈ కథనంలో చర్చిస్తున్నాం. శృంగారంలో కొంతమంది మహిళలు ఎందుకు క్లైమాక్స్‌కు చేరలేకపోతున్నారు?

1. గత జీవితపు చేదు అనుభవాలు

గతంలో భయానకమైన అనుభవాలు ఎదుర్కొన్న మహిళల్లో శృంగార సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. వాటిని ఆమె భాగస్వామి లేదా ప్రేమికుడితో పంచుకోవడం, వారి నుంచి మద్దతు లభించడం వల్ల అలాంటి గతం నుంచి బయటపడే అవకాశం ఉంది.

శృంగారంలో పాల్గొన్నప్పుడు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే లేదా చేయకూడదని అనిపిస్తే, అందుకోసం మీరు ప్రత్యేక సాయం తీసుకోవడం అవసరం. అలాంటి భయానక సంఘటనల నుంచి బయటపడి, శృంగారంలో ఆనందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దీని వల్ల ఆమె అలాంటి సంఘటనల గురించి మాట్లాడటమే కాకుండా, ఆమెకు అవసరమైన నైతిక మద్దతు లభిస్తుంది.

“ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన వ్యవహారం. మీరు ఎదుర్కొన్న సంఘటన వల్ల మీకు అవమానం, భయం, ఇంకా మానసిక ఆందోళన లాంటివి ఎవైనా ఎదురై ఉండవచ్చు. మీరు శృంగారంలో ఆనందాన్ని అనుభవించడానికి అవి అడ్డంకి కావచ్చు” అని మాడ్రిడ్ యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ అండ్ సెక్సాలజీ డైరెక్టర్ హెక్టర్ గల్వన్ చెప్పారు.

“గత అనుభవాల వల్ల కొందరు మహిళలు మర్మ స్థానాలను చేతితో తాకడం ద్వారా వచ్చే లైంగిక అనుభూతిని పొందరు, అసలు వారు తమలోని లైంగిక కోరికలను పూర్తిగా అణచివేస్తుంటారు”

“అలాంటి వారిలో లైంగిక కోరికలు, శృంగారంలో సంతృప్తికర జీవితాన్ని అనుభవించే దిశగా ప్రోత్సహించేలా చెయ్యడానికి సానుకూల దృక్పధం అవసరం. శృంగారపరమైన కోరికల్ని పక్కన పెట్టి తన శరీరాన్ని తానే ప్రేమించేలా వారిని ప్రోత్సహించాలి. అలా మెల్లమెల్లగా వ్యక్తిగతంగా లైంగిక ఆనందానికి దగ్గరగా తీసుకు రావచ్చు. అది సంతృప్తికర స్థాయికి చేరిన తర్వాత ఆ జంట బాగా దగ్గరవుతారు” అని గల్వన్ తెలిపారు.

గతంలో ఏం జరిగింది, అది ఎలా జరిగింది అనే సమాచారాన్ని మరో వ్యక్తితో ఎంత వరకు పంచుకోవాలనే అంశాన్ని ఆమె నిర్ణయించుకోవాలి.

“ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆమె తనకున్న ఇబ్బంది గురించి భాగస్వామికి చెప్పడం మంచిది. అలాంటి సమయంలో ఆ మహిళ ఇబ్బంది పడుతున్న వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లకుండా శృంగారపరైన అంశాల గురించి మాట్లాడితే మంచిది. తర్వాత థెరపిస్టు ఆమె భాగస్వామితో ఆ అంశం గురించి మాట్లాడవచ్చు.

“ఆ సన్నివేశం గురించి మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడగలగాలి. ఆ ఘటనకు సంబంధించి ఇబ్బందికర అంశాన్ని ప్రస్తావించకపోవడం మంచిది. అదే సమయంలో పార్ట్‌నర్‌తో శృంగార జీవితాన్ని మెరుగుపరచుకునేలా ఉండాలి. ఆమె ఇబ్బంది పడుతుందని ఆ సంఘటన గురించి ప్రస్తావించడాన్ని వదిలేయడం కన్నా, దాన్నుంచి బయటపడేలా ప్రయత్నించడం అవసరం” అని సెక్సాలజిస్టు హెక్టర్ గల్వన్ వివరించారు.

2. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి

గల్వన్‌ను సంప్రదించే మహిళల్లో కొంతమంది సంప్రదాయబద్దమైన పెంపకంలో పాతుకుపోయిన భావాలు లేదా శృంగారం అంటే అపరాధ భావన అని భావించేవారిలో భావ ప్రాప్తి పొందలేకపోతున్నారని గుర్తించారు. అయితే ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తించారు.

ఆయన వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న మహిళల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే. ఒత్తిడి కారణంగా చాలా మంది తమ శృంగార జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకపోతున్నారు.

“శరీరం చాలా తేలిగ్గానే భావప్రాప్తి పొందగలదు. అయితే అందుకు ఎక్కువ స్థాయిలో విశ్రాంతి అవసరం” అని డాక్టర్ చెప్పారు.

“శరీరానికి నిర్దిష్ట స్థాయిలో ఒత్తిడి, కొంత అలసట ఉన్నప్పటికీ శృంగారపరమైన కోరికలు, ఉద్వేగం ఉంటాయి. అయితే సెక్స్‌లో అంతిమ సంతృప్తిని పొందాలంటే విశ్రాంతి అవసరం”

అయితే చాలా మంది మహిళల్లో ఉద్యోగపరంగా టార్గెట్లు, ఇంటికి దూరంగా పని చెయడం, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూసుకోవాల్సి రావడం, ఆర్థికపరమైన సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మహిళలు తమ భాగస్వామిని తృప్తి పరిచేందుకు, వారి ఈగో హర్ట్ కాకుండా చూసేందుకు శృంగారంలో పాల్గొంటుంటారు. తమకు భావప్రాప్తి కలిగినట్లు నటిస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు క్లినికల్ సైకాలజిస్టులు

ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు భాగస్వామితో చర్చించడం మేలని సూచిస్తున్నారు.

3. మాట్లాడడంలో సంకోచం

బహుశా ఈ అంశాన్ని మనం ఒక నినాదంతో మొదలు పెట్టవచ్చు. అదేంటంటే శృంగార బంధంలో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారనే దాన్ని ఏ ఒక్కరూ కచ్చితంగా ఊహించలేరు.

సెక్స్‌ కలయిక సమయంలో మీరు భంగిమలు, శబ్దాలను అర్థం చేసుకోగలరు. అయితే, దాని గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మంచిది.

“సెక్స్ చేసే సమయంలో మార్పులు, సర్దుబాట్ల గురించి భాగస్వామితో చర్చించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది” అని సెక్సాలజిస్టులు చెప్పారు.

“నన్ను సంప్రదించిన ఓ మహిళ భర్తతో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె భావప్రాప్తికి చేరువ అవుతున్న సమయంలో అతను లయను మార్చడం లేదా ఆమెను ప్రేరేపించడాన్ని ఆపడం చేస్తుండేవాడని చెప్పారు. ఈ విషయం అతడికి ఆమె ఎప్పుడూ చెప్పలేదు.”

ఆ విషయం తెలియడం వల్ల, సెక్స్‌కు ముందు తర్వాత మాత్రమే కాకుండా సెక్స్ చేసే సమయంలో కూడా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవసరం అనే విషయాన్ని స్పెషలిస్ట్ ఆమెకు స్పష్టం చేయగలిగారు.

“ఇలా చర్చించడం వల్ల భాగస్వామి శరీరం ఎలాంటి స్పందనలు కోరుకుంటుందో, సెక్స్‌లో సంతృప్తి కలగడానికి ఏం చెయ్యాలో వారు తెలుసుకోలగుతారు”

గల్వన్ అతని బృందంలోని కొంతమంది లైంగిక నిపుణులు అందించే చికిత్సలో బాగంగా కొంతమంది దంపతుల నుంచి ఎదుర్కొన్న ప్రధాన సమస్య శీఘ్ర స్కలనం.

“మా దగ్గరకు వచ్చే ఉత్తమమైన కేసులు ఇవి” అని క్లినికల్ సైకాలజిస్టు చెప్పారు.

“కొన్ని సందర్భాల్లో మహిళలు మా దగ్గరకు ఒంటరిగా వస్తారు. ఎందుకంటే వారి భాగస్వామి గౌరవం, సెంటిమెంట్‌ను గాయపరచకూడదని భావిస్తారు. తాము సెక్స్ చేసే సమయంలో అంతకు ముందు కంటే ఎక్కువ సమయం చేస్తున్నామని అయితే తనకు భావప్రాప్తి కలగడం లేదని చెప్పేవారు. అది మంచి విషయమే ఎందుకంటే శృంగారానికి సంబంధించి ఇతర సమస్యలు లేకుంటే శీఘ్ర స్కలనం అనేది చాలా చిన్న వ్యవహారం”.

ఇలాంటి ఇబ్బంది ఏర్పడినప్పుడు మహిళ ఈ విషయాన్ని తన భాగస్వామితో చర్చించాలి.

“అయితే ఈ విషయాన్ని ఎలా చెప్పాలన్నది ముఖ్యం. ఇదొక ఫిర్యాదు మాదిరిగానో, అవతలి వారిని విమర్శించేలానో ఉండకూడదు. అలాగని ఈ విషయాన్ని వదిలేయ కూడదు.

ఇలాంటి చిన్న విషయాలు దంపతులను విడదీయకపోయినా వారి మధ్య చిన్న అభిప్రాయ బేధాలను సృష్టిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

శృంగార వాంఛలకు సంబంధించి స్త్రీపురుషులిద్దరూ తమ కోరికలు, అనుభూతులు, భయాల గురించి ఒకరితో ఒకరు ప్రస్తావించాలి. దీని వల్ల శృంగారాన్ని ఎలా ప్రారంభించి ఎలా ముగించాలో వారికి అనుభవంలోకి వస్తుంది.

4. రతి క్రీడకు ముందు ప్రేరేపించుకోవడం

రతిలో పాల్గొనడానికి ముందు దంపతులు ఒకరినొకరు ప్రేరేపించుకునే సమయం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పెరగడాన్ని గుర్తించినట్లు గల్వన్ చెప్పారు.

"దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. పురుషులు త్వరగా తమ ఆనందాన్ని పొందేవారు. దీని వల్ల స్త్రీలకు సంతృప్తి కలిగేది కాదు. సెక్స్‌ను ఒక డ్యూటీలాగా భావించారు. అయితే ఇప్పుడా పరిస్థితులు మారుతున్నాయి."

కలయికకు ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవడానికి ఎంత సమయం కేటాయించినా సరే, అది సమయానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ లాంటిది.

సమ లైంగిక జంటల మధ్య సాధారణంగా లైంగిక సంభాషణ ఎక్కువగా ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

"సెక్స్ చేసే సమయంలో స్త్రీ, పురుషులు ఒకరినొకరు తమ జనన అవయవాలను చేతితో తాకడం ద్వారా ఉద్రేకాన్ని పొందే ప్రయత్నం చెయ్యడం లేదనే వాస్తవం తమను సంప్రదించిన అనేక మంది ద్వారా తెలిసిందని గల్వన్ నిపుణుల బృందం చెబుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తిలో అంతర్గత అనుభూతులను పూర్తిగా అర్థం చేసుకోలేరు."

స్త్రీ తన భాగస్వామి( పురుషుడు లేదా స్త్రీ) ఏమి చేయాలో, తన శరీరంలో ఏ భాగంతో ఎలా డీల్ చేయాలో వివరించడం కీలకం.

"కొన్నిసార్లు పురుషుడికి స్త్రీ యోని ద్వారం దగ్గర ఎలా ప్రేరేపించాలో తెలియదని, అలా చేయడం వల్ల వారికి శారీరకంగా ఇబ్బంది కలుగుతుందనే భయంతో చెయ్యరని కొంతమంది స్త్రీలు ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఈ విషయం మీరు మీ భాగస్వామితో మాట్లాడారా అని అడిగినప్పుడు, అలా మాట్లాడటం వల్ల వారి భావాలు దెబ్బ తింటాయనే భయం లేదా సిగ్గు వల్లనో చెప్పలేదని మాతో చెప్పేవారు."

అలాగే సెక్స్‌కు ముందు ఉద్రేకాన్ని పెంచుకోవడానికి మహిళలు తమ చేతులతో సున్నిత బాగాలను ప్రేరేపించడం అవసరం. దీని వల్ల సెక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆనందం పొందడంతో పాటు యోనిలో ద్రవాలు ఏర్పడటం ద్వారా అంగ ప్రవేశం నొప్పి లేకుండా జరుగుతుంది. అంతే కాకుండా రతి సమయంలో అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది

“తమను తాము ప్రేరేపించుకోవడం ద్వారా కొంతమంది మహిళలు సెక్స్‌లో భాగస్వామికి ఆనందం పంచడంతో పాటు తాము కూడా భావప్రాప్తి పొందుతున్నట్లు చెప్పారు. ఏం చేస్తున్నామనే దాని కంటే శృంగారంలో సంతృప్తి పొందడానికి ఫార్ములా ఏదైనా సరే అది విలువైనదే”

5. శృంగార వాంఛలు కలగకపోవడం

మహిళల్లో సెక్స్ కోరికలు లేకపోడవం వారి జీవితాల్ని వివిధ దశల్లో ప్రభావితం చేస్తుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

ఉదాహరణకు, గర్భదారణ, పిల్లలు పుట్టిన తర్వాత ఒత్తిడి, పీరియడ్స్ సమయంలో శృంగారం మీద మహిళల్లో ఆసక్తి ఉండదు.

నిరాశ, మానసిక ఆందోళనలు, హార్మోన్లకు సంబంధించిన సమస్యలకు మందులు వాడటం లాంటివి శృంగార జీవితం మీద, భావప్రాప్తి మీద ప్రభావం చూపిస్తాయి.

స్త్రీలలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే సెక్స్ కోరికలు తగ్గిపోతాయి అని నేషనల్ హెల్త్ సర్వీస్ అంటోంది.

అండాశయం, అడ్రినల్ గ్రంధులలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ అవయవాలు సరిగ్గా పని చేయకపోతే వాటి ప్రభావం ఆ మహిళలో కనిపిస్తుంది. అది ఆమె శృంగార జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది.

అందుకే ఎండోక్రైనాలజికల్ సమస్యలు ఉన్న వారు తరచుగా మెడికల్ చెకప్‌ చేయించుకోవడం అవసరం.

సమస్య టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లకు సంబంధించినదైతే డాక్టర్లు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవాలని చెబుతారు.

6. స్వీయ నియంత్రణ

కొంతమంది రోగులను పరిశీలించినప్పుడు వారు కొంత నియంత్రణలో ఉన్నట్లు తేలిందని ఓ సెక్సాలజిస్టు బీబీసీతో చెప్పారు.

“ఒక ప్రత్యేక సందర్భంలో ఓ వ్యక్తి భావప్రాప్తి పొందడానికి ముందు దశకు చేరుకున్నప్పటికీ దాన్ని పొందలేక పోతారు. అప్పటి నుంచి అతను శారీరంగా కలిసిన ప్రతీసారి తన ప్రవర్తనను గమనించడం మొదలు పెడతారు. ఇలాంటి ప్రవర్తన ద్వారా భావప్రాప్తిని సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఈ ఆలోచనలు అతడి సెక్స్‌లో అతడి సామర్థ్యాన్ని ఫోకస్ చెయ్యకుండా ఒత్తిడిలో పడేస్తాయి”.

ఈ పరిస్థితిని అధిగమించడానికి విశ్రాంతి తీసుకోవడం, ఆనందంగా ఉండటం అవసరం.

7. శృంగారంలో నొప్పి

స్త్రీ జననేంద్రియాల విషయంలో ఉద్వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలున్నాయి.

అందులో ఒకటి వాజినిస్మస్, ఇది యోని దిగువ భాగంలోని కండరాల అసంకల్పిత సంకోచం. ఈ కండరాలు వ్యాకోచించడం వల్ల “సెక్స్ బాధాకరంగా లేదా అసాధ్యంగా” మారుతుంది అని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

స్త్రీలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలిగినా, లేదా లైంగిక దాడి వంటి ఘటనలు జరిగినా, ప్రసవం సమయంలో యోనికి సంబంధించిన సమస్యలు ఏర్పడినా, ఎపిసియోటమీ వల్ల ఇలా జరగవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

గల్వన్ సూచించిన మరోక వ్యాధి డిస్పరేనియునియా. ఇది స్త్రీలలో నొప్పి, మంట, అసౌకర్యం వంటి అనుభూతిని కలిగిస్తుంది. లైంగిక సంపర్కానికి ముందు, తర్వాత, సంభోగ సమయంలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయి.

స్త్రీలలో వాజినిస్మస్ కంటే ఇది సాధారణం అని గల్వన్ చెబుతున్నారు.

డిస్పరేనియునియా శారీరక సమస్య లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. దానికి చికిత్స చెయ్యడం చాలా అవసరం. ఎందుకంటే మెదడు శృంగార కోరికలు నొప్పి మధ్య సంబంధాన్ని ఏర్పరచినప్పుడు నొప్పిని తప్పించుకోవడానికి శృంగాల వాంఛలను పక్కన పెడతారు.

యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా నొప్పిగా ఉన్నా, యోని పొడిబారినా డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం. ఎందుకంటే అది సెక్స్ అనే పరిధి చూడాల్సిన అంశం.

“మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి సహజం. శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గి యోని పొడి బారడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది”. అని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

దీని వల్ల స్త్రీలలో సెక్సువల్ వాంఛలు తగ్గిపోతాయి. అయితే లూబ్రికేటింగ్ క్రీమ్‌లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.

8. రహస్య సంబంధాల సమస్యలు

స్త్రీలలో భావప్రాప్తి గురించి నిపుణులు చెబుతున్న చివరి అంశం జంట మధ్య ఉన్న సంబంధం గురించి.

“కొన్నిసార్లు దంపతులు తమకు భావప్రాప్తి కలగడం లేదని మా వద్దకు వస్తారు. స్త్రీలకు ఈ అంశం గురించి మేము వివరిస్తాం. అయితే సమస్య స్త్రీలు లేదా పురుషుల్లో కాకుండా వారి బంధంలో ఉండటాన్ని మేము గుర్తించాం” అని డాక్టర్ చెప్పారు.

అలాంటి కేసుల్లో డాక్టర్లు చెప్పేదేంటంటే వ్యక్తులుగా వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వారి శృంగార జీవితమే కాకుండా రోజువారీ జీవితం కూడా ఆనందంగా మారుతుందని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)