ఓషో సామ్రాజ్యం ఎలా విచ్ఛిన్నమైంది, ఆయన అమెరికాలో ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది?

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లక్షల మంది అభిమానులకు, శిష్యులకు ఆయన కేవలం ‘ఓషో’ మాత్రమే. తరువాత ఆయన ‘ ఆచార్య రజనీష్’, ‘భగవాన్ శ్రీ రజనీష్’గా ఇండియాలోనూ, ప్రపంచమంతటా తెలిశారు.

‘ఓషో’ అంటే తనను తాను సముద్రంలోకి కలుపుకున్నవాడని అర్థం. 1931 డిసెంబరు 11న మధ్యప్రదేశ్‌లో ఆయన జన్మించారు. అసలు పేరు చంద్రమోహన్ జైన్.

ఓషో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి 34 ఏళ్లు అయ్యింది. అయినా నేటికీ ఆయన రాసిన పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఆయన వీడియోలు, ఆడియోలు సామాజిక మాధ్యమాలలో కనపడుతున్నాయి, వినపడుతున్నాయి.

సంప్రదాయాలు, తాత్విక చింతనలు, మతమనే వాటిలో ఆయన చిక్కుకోలేదు కాబట్టే ప్రజలు ఆయనపై ఆసక్తి కనపరిచేవారు.

‘ది లూమినస్ రెబల్ లైఫ్ స్టోరీ ఆఫ్ మావెరిక్ మిస్టిక్’ పేరుతో ఓషో జీవితగాథను వసంత్ జోషి రాశారు.

‘‘ఓషో సాధారణ బాలుడిలానే పెరిగాడు కానీ, ఆయనలోని ఏదో ప్రత్యేకత సాధారణ పిల్లల నుంచి ఆయనను వేరు చేసింది. చిన్నప్పటి నుంచి ఆయనకు ప్రశ్నలు అడగడం, ప్రయోగాలు చేయడమనే తత్వం ఉండేది. ప్రజలపట్ల ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. మనుషుల ప్రవర్తనను చాలా నిశితంగా గమనించేవారు’’ అని ఆయన తెలిపారు.

కాలేజీ నుంచి బహిష్కరణ

1951లో బీఏ పాసైన తరువాత ఓషో హితకారిణి కళాశాలలో ప్రవేశం పొందారు. ఫిలాసఫీ ప్రొఫెసర్‌తో ఆయనకు ఘర్షణ జరిగింది. తరగతి గదిలో ఓషో అదేపనిగా ప్రశ్నలు అడిగేవారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రొఫెసర్ విసిగిపోయారు, దీని కారణంగా సిలబస్ పూర్తి చేయలేకపోతున్నానని ప్రొఫెసర్ భావించారు.

‘‘ఇక ప్రొఫెసర్ సహించలేకపోయారు. దీంతో తాను గానీ లేదా చంద్రమోహన్ జైన్ కానీ ఎవరో ఒకరే కాలేజీలో ఉండాలంటూ ప్రిన్సిపాల్‌కు ప్రొఫెసర్ తేల్చి చెప్పారు. ప్రిన్సిపాల్, చంద్రమోహన్ జైన్‌ను పిలిచి కాలేజీ వదిలిపొమ్మని చెప్పారు. దీనికి చంద్రమోహన్ జైన్ అంగీకరించారు. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కానీ దీని కారణంగా ఓ సీనియర్ ప్రొఫెసర్ తన పోస్టుకు రాజీనామా చేయాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. ప్రిన్సిపాలే మరో కళాశాలలో తనను జాయిన్ చేయించే షరతుపై చంద్రమోహన్ జైన్ హితకారిణి కళాశాలను విడిచిపెట్టారు’’ అని వసంత్ జైన్ రాశారు.

అయితే కళాశాలలన్నీ రజనీష్‌ను తిరస్కరిస్తుండంతో ఆయన పేరు మారుమోగింది. తరువాత అత్యంత కష్టం మీద ఆయనకు డీఎన్ జైన్ కళాశాలలో ప్రవేశం లభించింది.

రజనీష్ తన యవ్వన కాలమంతా తలనొప్పితో బాధపడుతుండేవారు. ఒకనాడు ఆయనకు తలనొప్పి భరించలేని స్థాయిలో రావడంతో ఆయన కజిన్స్ క్రాంతి, అరవింద్ రజనీష్ తండ్రిని పిలిపించారు. ఎక్కువసేపు చదవడం వల్ల రజనీష్‌కు తలనొప్పి వస్తోందని ఆయన తండ్రి భావించారు. రజనీష్ తన తలకు బామ్ రాసుకుంటూ చదువుకోవడం ఆయనకు గుర్తుకొచ్చింది.

ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక గురువుగా...

1957లో రాయ్‌పూర్లో సంస్కృత విశ్వవిద్యాలయంలో రజనీష్ తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1960లో ఆయన జబల్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు. ఆ సమయంలో ఆయనొక అద్భుతమైన అధ్యాపకుడిగా గుర్తింపు పొందారు.

ఈ సమయంలో ఆయన ఓ ఆధ్యాత్మిక గురువుగా భారతదేశమంతటా పర్యటించడం మొదలుపెట్టారు. రాజకీయాలు, మతం, సెక్స్ గురించి ఆయన చేసే ప్రసంగాలు వివాదాస్పదం అయ్యేవి.

కొన్నిరోజుల తరువాత ఆయన ప్రొఫెసర్ పోస్టుకు రాజీనామా చేసి, పూర్తిస్థాయి ‘గురు’గా మారారు. 1969లో ముంబయిలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఓ ఏడాది మునుపే రజనీష్ ను కలిసిన మదర్ యోగ లక్ష్మి ఆయనకు ముఖ్యసహాయకురాలిగా మారి 1981వరకు కొనసాగారు.

ఈ సమయంలో ఆయన క్రిస్టియన్ ఓల్ఫ్ అనే ఓ ఇంగ్లిష్ మహిళను కలిశారు. రజనీష్ ఆమెకు ‘మా యోగా వివేక్’ అనే ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చారు. ఈమెను తన పూర్వజన్మ నుంచి వచ్చిన తొలి స్నేహితురాలిగా పరిగణించేవారు.

‘మతం అంతిమ లక్ష్యం ప్రజలను నియంత్రించడమే’

రజనీష్ తొలినుంచి శతాబ్దాల తరబడి పాతకుపోయిన మతపరమైన ఆచారవ్యవహారాలకు వ్యతిరేకంగా గొంతెత్తేవారు. ఓ ఆధ్యాత్మిక గురువుగా, వ్యవస్థీకృత మతం ప్రజలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించడానికి బదులుగా విభజన సాధనంగా మారిందని ఓషో నమ్మేవారు.

మతమనేది చెడుకు బాధితురాలిగా మారి, తన ప్రాముఖ్యాన్ని కోల్పోయిందని ఆయన అభిప్రాయం. మతం, రాజకీయం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మా బొరుసువంటివని, ఈ రెండింటి లక్ష్యం అంతిమంగా ప్రజలను నియంత్రించడమేనని ఆయన అభిప్రాయపడేవారు.

ఆయన ప్రజల ముందు పాశ్చాత్య తాత్వికతలోని సమన్వయాన్ని, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలను వివరించేవారు. బహిరంగంగా లైంగిక స్వేచ్ఛ గురించి బోధించేవారు.

సంక్లిష్టమైన విషయాలను సరళమైన భాషలో చెప్పే ఆయన నైపుణ్యం అనేక రంగాలవారిని ఆకర్షించేలా చేసింది. ‘‘భారతదేశంలో పుట్టిన ఆలోచనాపరులలో ఓషో ఒకరు, దీన్ని పక్కనపెడితే, ఆయన ఆలోచనాపరుడు, శాస్త్రీయ దృక్పథం కలిగినవాడు, వినూత్నమైన వ్యక్తి ’అని ప్రసిద్ధ రచయిత కుష్వంత్ సింగ్ ప్రశంసించారు.

ఓషో పుస్తకాలు చదివితే ఆయన 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువు అనే భావన కలుగుతుందని అమెరికన్ రచయిత టామ్ రాబిన్స్ నమ్మకం.

జపమాల లాకెట్‌లో ఓషో చిత్రం

మదర్ ఆనంద్ షీలా ఓషో కార్యదర్శిగా చాలా ఏళ్ళు పనిచేశారు. యుక్తవయసులో ఉండగానే ఆమెకు ఓషోతో పరిచయమైంది. తన మహిళా అనుచరులందరినీ ఓషో ‘మదర్’ అని పిలిచేవారు. ఎందుకంటే ప్రతి మహిళను ఆయన మాతృత్వానికి ప్రతీకగా పరిగణించేవారు. అలాగే ప్రతి మగ అనుచరుడిని ‘స్వామీ’ అని పిలిచేవారు. దీనివల్ల తనను తాను నియంత్రించుకోవాలనుకునేవారు.

షీలా తన ఆత్మకథలో ‘‘డోన్ట్ కిల్ హిమ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ విత్ భగవాన్ రజనీష్’,లో ఇలా రాశారు.

‘‘నేను ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు భగవాన్ నవ్వి తన రెండు చేతులు చాచారు. ఆయన నన్ను తన ఛాతీకి చాలా గట్టిగా హత్తుకున్నారు. ఆయన మృదువుగా నా చేయి పట్టుకున్నారు. నేను ఆయన ఒడిలొ నా తలపెట్టాను. కొంతసేపటి తరువాత నేను నిశ్శబ్దంగా లేచి గది వీడుతుంటే ఆయన నన్ను మళ్ళీ పిలిచారు. షీలా రేపు 2.30 గంటలకు నన్ను కలవడానికి రా అంటూ ఆయన నా తల నిమిరారు’’

ఓషో తన శిష్యులందరికీ చెక్కతో చేసిన జపమాలను ఇచ్చేవారు. ఇది ఓ లాకెట్‌ను కలిగి ఉండేది. ఈ లాకెట్‌కు ఇరువైపులా ఓషో బొమ్మ ఉండేది. ప్రతి సన్యాసి ఈ లాకెట్‌ను ఎల్లవేళలా ధరించాలని భావించేవారు. ఆయన ప్రతి సన్యాసికి ఓ కొత్త పేరు ఇచ్చేవారు. దీనివల్ల వీరు గతాన్నుంచి వేరుపడతారని ఆయన భావన. తన శిష్యులందరూ ఆరంజ్ లేదా ఎరుపు వస్త్రాలు ధరించాలని ఓషో కోరుకునేవారు. ఈ వస్త్రాలు వదులుగా ఉండటం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలోకి శక్తి తేలికగా ప్రసరిస్తుందని నమ్మేవారు.

వేల మంది శ్రోతలు

ఓషో హిందీలోగానీ, ఇంగ్లిష్‌లోగాని ప్రసంగించేవారు. ఓషో మాట్లాడుతున్నప్పుడు శిష్యులందరూ కళ్ళు మూసుకుని ఉండాలనే నిబంధన ఉండేది. వివాదాస్పద విషయాలపై ఓషో తన అభిప్రాయాలతో ఎంతో ప్రసిద్ధి పొందారు.

‘ద రజనీష్ క్రానికల్’ అనే పుస్తకం రాసిన విన్ మెక్‌కార్‌మాక్, ‘‘ఆయన అభిప్రాయాలు చాలా వివాదాస్పదంగా ఉండేవి. వాటిని నిషేధించాలని భారత పార్లమెంటులో అనేకసార్లు చర్చలు జరిగాయి. విభిన్నవర్గాల ప్రజలను ఆకర్షించేందుకు ఓషో అనేక భిన్నమైన సబ్జెక్టులను ఎంచుకునేవారు. ఈయన కోసం వచ్చేవారు మిశ్రమనేపథ్యాలు కలిగి ఉండేవారు. ఆయన ప్రసంగాలు వినడానికి అన్ని వయసులవారు, అన్ని మతాలవారు గుమిగూడేవారు. ఆయనతో పరిచయం ఉన్నవారెవరైనా ఆయన శిష్యుడిగానో, ప్రత్యర్థిగానో ఉండేవారే కానీ ఉదాసీనంగా ఉండేవారు కాదు’’ అని రాశారు.

1972లో రజనీష్ పట్ల ఆకర్షితులైన విదేశీ పర్యటకులు రావడం మొదలైంది. రజనీష్‌ను ఎవరు కలవాలనే విషయంపై ఆయన కార్యదర్శి లక్ష్మి జాగ్రత్తగా ఉండేవారు. ముందుగా వారందరరినీ ‘డైనమిక్ మెడిటేషన్’ లో పాల్గొనమని కోరేవారు. తరువాత వారు ఓషోను కలిసేవారు. తొలినాళ్ళలో ఆయన ముంబయిలోని చౌపట్టీ బీచ్ వద్ద ఉదయం 6 గంటలకు తన ప్రసంగాన్ని ఇచ్చేవారు.

రాత్రివేళ ఒక హాలులోగానీ, తన ఇంటిలోగానీ ప్రసంగించేవారు. కొన్ని సందర్భాలలో ఆయన శ్రోతలు 100 నుంచి 120 మంది మధ్య ఉంటే కొన్ని సందర్భాలలో 5 వేల నుంచి 8 వేల మంది దాకా ఉండేవారు.

ముంబయి వానలు భరించలేక పుణెలో ఆశ్రమం

కొన్నిరోజుల తరువాత ముంబయిలో జీవితం కష్టంగా మారిందని ఓషో గుర్తించడం మొదలుపెట్టారు. తరచూ వచ్చే భారీ వర్షాలు, అలర్జీలు, రోజురోజుకీ పెరుగుతున్న ఉబ్బసంతో ముంబయి వాతావరణంలో ఉండటం కష్టమనుకున్నారు. ఆయన విదేశీ అనుచరులు కూడా ముంబయి వానలకు అలవాటు పడలేకపోయారు. అనేక రకాలైన జబ్బులు ఆయనను ఇబ్బంది పెట్టడం మొదలైంది. దీంతో ముంబయికి సమీపంలో ఏదైనా స్థలం చూడాలపి ఓషో కార్యదర్శికి చెప్పేవారు.

చాలా తర్జనభర్జనల తరువాత పుణెలో ఆశ్రమాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పుణె వాతావరణం ముంబయి కంటే నయంగా ఉండేది. ఆశ్రమ నిర్మాణానికి కోరేగావ్‌ను ఆయన ఎంపిక చేశారు.

‘‘పుణె చేరుకన్నాక, ఓషో ఎవరినీ కలవకుండా ఏకాంతంగా ఉండటం మొదలుపెట్టారు. తొలినాళ్ళలో ఆయన ఆశ్రమ తోటలో ప్రజలను కలుసుకునేవారు. తరువాత ఆయనను కలవడం ప్రజలకు సాధ్యం కాకుండా పోయింది. ఆయన తన చుట్టూ బలమైన నమ్మకమైన వారు మాత్రమే ఉండాలని కోరుకునేవారు. తన ఆశ్రమానికి కేవలం ఉత్సుకతతో మాత్రమే వస్తున్నారని గ్రహించిన సందర్భంలో ఆయన చాలా మంది భారతీయులను విస్మరించడం మొదలుపెట్టారు. ఆశ్రమ ప్రవేశ రుసుము కూడా పెంచారు. ఇదే కాకుండా తన భారతీయ అనుచరులను తగ్గించేందుకు ఆయన ఆంగ్ల ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టారు’’ అని ఆనంద్ షీలా రాశారు.

ఆశ్రమంలో సెక్స్ థెరపీ

ఓషో ఎప్పుడు కుర్చీలో కూర్చునేవారు. ఆయన అనుచరులు నేలపై కూర్చునేవారు. పుణెలో తన ప్రసంగాలు వినడానికి రోజూ 5 వేల మంది వచ్చేలా ఆయన త్వరగానే చేసుకోగలిగారు.

పుణెలో రజనీష్ ఆశ్రమం కారణంగా పర్యటకం పెరిగింది. ప్రపంచపటంలో పుణె గుర్తింపు పొందడానికి రజనీష్ ఆశ్రమం కూడా కీలక పాత్ర పోషించింది. పుణెకు ఆర్థిక స్థిరత్వం తీసుకురావడంతోపాటు నగరానికి అనేక రంగులు కూడా అద్దింది.

ఓషో ఆశ్రమంలో అనేక థెరపీలు ఇవ్వడం మొదలైంది. దీంతో డబ్బు ప్రవాహంలా వచ్చి పడేది. ఈ థెరపీలన్నింటిలోనూ సెక్స్ థెరపీ చాలా ముఖ్యమైనది. ఇందులో ఎలాంటి పక్షపాతం లేకుండా లైంగికతను ఆమోదించేవారు. లైంగిక విషయాలలో నైతికతకు, కట్టుబాట్లకు ఇక్కడ చోటులేదు.

‘‘ఎటువంటి ఈర్ష్య, బంధమనే భావన లేకుండా మనం పనిచేయాలని దేవుడు కోరుకున్నాడు. ఈ చికిత్సలలో పాల్గొనేందుకు భారతీయులను అనుమతించేవారు కాదు. ఇలా ఎందుకు చేసేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. దీనిపై ఆయనకు అనేక ప్రశ్నలు ఎదురయ్యేవి. విదేశీయుల జీవన విధానం, ఆలోచనాధోరణి భారతీయులకంటే పూర్తి భిన్నమైనదని, వారికి ఇలాంటి చికిత్సలు అవసరమని, కానీ భారతీయులకు నిశ్శబ్ద ధ్యానం సరిపోతుందని రజనీష్ వాదించేవారు’’ అని ఆనంద్ షీలా రాశారు.

ఆశ్రమంలో పిల్లలను కనడం నిషేధం

ఆశ్రమంలో లైంగిక భాగస్వాములను మార్చుకోవడాన్ని రజనీష్ ప్రోత్సహించేవారు.

‘మై లైఫ్ ఇన్ ఆరెంజ్, గ్రోయింగ్ అప్ విత్ ది గురు’ పుస్తకంలో ఓషో శిష్యుడు టిమ్ గెస్ట్ ఈ విషయాలు రాశారు.

‘‘చాలా మంది భారతీయులు ‘‘సంభోగ్ సే సమాధి’ పుస్తకాన్ని బూతు పుస్తకంగా భావించేవారు. ఇది వారి మనోభావాలను గాయపరించింది. ఎందుకంటే ఈ పుస్తకం సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడుతుంది. ఈ పుస్తకాన్ని రాయడం వల్ల ఆయన సెక్స్ కోరికలను అణిచివేయాలనుకునే అనేక మంది సాధువులకు శత్రువు అయ్యారు. ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం లైంగిక భాగస్వాములను మార్చుకోవడానికి ప్రోత్సాహకంగా మారుతోందని భావించేవారు. ఆశ్రమంలో మహిళల్లో లైంగిక స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారనే నిందలు కూడా ఆయనపై వచ్చాయి’’ అని చెప్పారు.

స్వల్పకాలంలోనే పుణెలోని రజనీష్ ఆశ్రమం 25 వేల చదరపు మీటర్లకు పెరిగింది. అక్కడో వైద్య కేంద్రం కూడా ఏర్పాటైంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డాక్టర్లు, నర్సులు అందులో ఉండేవారు. ఆశ్రమంలోని ఫుల్ టైమ్ వర్కర్లకు, ఆశ్రమవాసులకు అక్కడ ఉచితంగా వైద్యం అందించేవారు.

‘‘నవజాత శిశువులను ఆ ఇరుకు ప్రదేశంలో ఉంచడానికి ఓషో ఇష్టపడేవారు కాదు. అందుకే సన్యాసినులు గర్భం దాల్చడానికి అనుమతించేవారు కాదు. ఆశ్రమానికి చెందిన అధికారులను గర్భనిరోధక శస్త్రచికిత్సలు చేయించుకోవాలని కోరారు. గర్భిణులు, పిల్లలు ఆశ్రమానికి సమస్యగా మారతారని భావించేవారు. ఆశ్రమం లోపల పిల్లలను కనడం నిషేధం. ఆశ్రమంలో గర్భిణులు ఉండటానికి కూడా వీల్లేదు’’ అని ఆనంద్ షీలా రాశారు.

ఆశ్రమంలో సన్యాసినులు బహిరంగ లైంగిక జీవితం గడపడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువైంది. దీంతో ఓషో తరచూ లైంగిక పరిహారం గురించి మాట్లాడేవారు. కొంత మంది సన్యాసినులు ఒక నెలలోనే 90 లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు’’ అని ఆనంద్ షీలా రాశారు.

‘‘రోజంతా బిజీగా ఉండి కూడా ఈ సన్యాసినులకు సెక్స్ కోసం సమయం ఎలా చిక్కేదా అని నేను ఆశ్చర్యపోయేదానిని’’ అని ఆనంద్ షీలా రాశారు.

ఇంతలో ఓషోకు జబ్బులు ఎక్కువవడం మొదలైంది. ఆయన అలర్జీలు, ఉబ్బసం, నడుమునొప్పి తీవ్రమయ్యాయి.

మధుమేహం పెరిగినప్పుడు, ఆయన గడపదాటేవారు కాదు. తన ప్రసంగాలు కూడా మానేశారు. ఆయన కళ్ళు నీరసనపడటం మొదలైంది. పుస్తకాలు చదివాక ఆయనకు తలనొప్పి రావడం మొదలైంది.

‘‘అత్తరు వాసనలు ఆయనకు పడేవి కావు. సెంటు కొట్టుకున్నవారు ఆయన దగ్గరకు రాకుండా మేము ఎన్నో ప్రయత్నాలు చేసేవారం. ఉదయం, సాయంత్రం ప్రసంగాల ముందు సెంటేమైనా కొట్టుకున్నారా అని ప్రతి శోత శరీరాన్ని పరిశీలించేవారం. ఇదో కొత్త పద్ధతి. కానీ ఓషోను అలర్జీల నుంచి కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమైది’’ అని ఆనంద్ షీలా తన పుస్తకంలో పేర్కొన్నారు.

అమెరికా జైల్లో 17 రోజులు

ఓషో హృదయం పుణెతో నిండిపోయింది. అయితే అమెరికాలోని ఓరేగాన్‌లో వెయ్యి మంది ప్రజలు కలిసి జీవించేలా ఓ ఆశ్రమాన్ని నిర్మించాలని ఆయన ఆలోచించారు. 1981 మే 31న తన కొత్త ఆశ్రమం కోసం ఆయన ముంబయి నుంచి బయల్దేరారు.

విమానంలోని అన్ని మొదటి తరగతి టిక్కెట్లు తన కోసం, తన సన్నిహితుల కోసం బుక్ చేశారు. ఆయనతోపాటు ఆశ్రమానికి చెందిన 2,500 మంది కూడా అమెరికాకు బయల్దేరారు. వీరిలో ప్రసిద్ధ సినీనటుడు వినోద్ ఖన్నా కూడా ఉన్నారు. ఈలోగా ఓషో 93 రోల్స్ రాయ్స్ కార్లు కొన్నారు. కానీ ఇక్కడి నుంచే ఆయనకు చెడ్డరోజులు మొదలయ్యాయి. ఆయన అమెరికా కల పేకమేడలా కుప్పకూలిపోయింది.

వలస నిబంధనలను అతిక్రమించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయన అమెరికా జైలులో 17 రోజులు గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాను వదిలిపెట్టేందుకు ఆయన అంగీకరించారు. దీని తరువాత ఆయన అనేక దేశాలలో ఆశ్రయం పొందాలని చూశారు కానీ, చాలా దేశాలలు తిరస్కరించాయి.

చివరకు ఆయన స్వదేశానికి తిరిగిరాక తప్పలేదు.

1990 జనవరి 19న 58 ఏళ్ల వయసులో ఓషో తుది శ్వాస విడిచారు.

పుణెలో ఆయన నివాసం లావోత్జు హౌస్‌లో ఓషో సమాధి నిర్మించారు.

‘‘ఓషో ఎన్నడూ పుట్టలేదు, ఎన్నడూ మరణించలేదు. ఆయన ఈ భూమిని 1931 డిసెంబరు 11 నుంచి 1990 జనవరి 19 మధ్య సందర్శించారు’’ అని ఆ సమాధిపై రాశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)