You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యప్రదేశ్: ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్ ఆత్మహత్య
ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
తుపాకీతో కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఇండోర్‌లోని బాంబే హాస్పిటల్‌కు తరలించారు.
భయ్యూ మహారాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రదేశాన్ని పోలీసులు సీల్ చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన మద్దతుదారులు ఆసుపత్రి పరిసరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
సిల్వర్ స్ప్రింగ్ ప్రాంతంలోని తన నివాసంలో భయ్యూ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇండోర్ డీఐజీ హరినారాయణ చారి మిశ్రా ధ్రువీకరించారు.
ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ భయ్యూ మహారాజ్ చాలా విలాసవంతంగా జీవించేవారు.
ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలేంటో స్పష్టంగా తెలియనప్పటికీ కుటుంబ సమస్యల కారణంగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఆయన కుమార్తె పుణెలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆమెను లండన్‌లోని ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చేర్పించే ఏర్పాట్లలో ఆయన ఉన్నట్టుగా ఆయన కుటుంబానికి దగ్గరగా ఉండేవారు చెప్పారు.
ఘటనాస్థలంలో ఆయన రాసినట్టుగా భావిస్తున్న సూసైడ్ నోట్ లభించింది.
"సూసైడ్ నోట్‌నూ, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాం. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కూడా మేం మాట్లాడుతాం. అక్కడ లభించిన పిస్టల్ లైసెన్స్ కలిగినదే" అని ఐజీ మకరంద్ దేవస్కర్ చెప్పారు.
మంత్రి పదవి వద్దన్న భయ్యూ మహారాజ్
కొద్ది నెలల క్రితం భయ్యూ మహారాజ్ సహా ఐదుగురు ఆధ్యాత్మిక గురువులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయ మంత్రులుగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. అయితే సాధువులకు మంత్రి పదవి ఎందుకంటూ ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
భయ్యూ మహారాజ్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని చాలా మంది రాజకీయ నేతలకు సన్నిహితుడు. ఆయనను గురుదేవ్ అని కూడా పిలుస్తారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. భయ్యూజీ తనకు ఆయన అత్యంత సన్నిహితులని గడ్కరీ తెలిపారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ''దు:ఖంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి భయ్యూ మహరాజ్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. తన మీద ఆధారపడి ఉన్న అనేకమంది కోసమైనా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది'' అన్నారు.
మోడలింగ్ నుంచి ఆధ్యాత్మికం వైపుకు..
భయ్యూ మహారాజ్ అసలు పేరు ఉదయసింగ్ దేశ్‌ముఖ్. ఆయన 1968, ఏప్రిల్ 29న జన్మించారు.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబం ఇండోర్‌లో స్థిరపడింది. గతంలో భయ్యూజీ ఒక టెక్స్‌టైల్ బ్రాండ్‌కు మోడల్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మికం వైపు మళ్లారు.
ఆయన ఇండోర్‌లో 'సద్గురుదత్త రిలీజియస్ ట్రస్ట్'ను నెలకొల్పారు. 37 ఏళ్ల వయసులో ఆయన అత్యంత పిన్న వయస్కులైన ఆధ్యాత్మిక బోధకుడిగా పేరొందారు.
తన మొదటి భార్య గుండెపోటుతో చనిపోవడంతో ఆయన 2017లో డాక్టర్ ఆయుషి శర్మను పునర్వివాహం చేసుకున్నారు.
2008లో లోక్‌పాల్ కోసం దీక్ష చేపట్టిన అన్నా హజారే దీక్ష విరమించడంలో భయ్యూజీ కీలకపాత్ర పోషించారు. 2011లో నరేంద్ర మోదీ తాను చేపట్టిన 'సద్భావనా ఉపాసన'ను కూడా భయ్యూ మహారాజ్ చేతుల మీదుగా నిమ్మరసాన్ని స్వీకరించి విరమించారు.
2016లో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఆ సమయంలో ఆనందీబెన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వెంటనే ఇండోర్‌కు వెళ్లి భయ్యూ మహారాజ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
భయ్యూ మహారాజ్ తరచుగా మహారాష్ట్రను సందర్శించేవారు. ఆయనకు ఉద్ధవ్ ఠాక్రే, పంకజా ముండేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)