రాహుల్ గాంధీకి తెలియని కోకా కోలా కథ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోకా కోలా గురించి కొత్త చరిత్రను చెప్పారు.

సోమవారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ''కోకా కోలా కంపెనీని ఎవరు ప్రారంభించారో మీకు తెలుసా? అదెవరో నేను మీకు చెబుతాను? కోకాకోలాను ప్రారంభించిన వ్యక్తి మొదట శికంజి అమ్మేవాడు. ఆ వ్యాపారంలో ఆయన నీళ్లలో చక్కెరను కలిపేవాడు. ఆ అనుభవం, నైపుణ్యంతో బాగా డబ్బు సంపాదించి, ఆ క్రమంలో కోకా కోలా కంపెనీని స్థాపించాడు.'' అని అన్నారు.

అక్కడితో ఆగకుండా, ''అలాగే అంతటా కనిపించే మెక్‌డొనాల్డ్ కంపెనీని ఎవరు ప్రారంభించారో తెలుసా? ఒక ఢాబాను నడిపే వ్యక్తి. భారతదేశంలో అలాంటి కోకా కోలా కంపెనీని ప్రారంభించిన ఢాబావాలాను ఒక్కరిని చూపించండి?'' అని రాహుల్ ప్రశ్నించారు.

రాహుల్ కామెంట్లపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం రాహుల్ గాంధీ ఈ కంపెనీల చరిత్రను వక్రీకరించమే.

కోకా కోలా కంపెనీ మొదట ఎలా ప్రారంభమైంది?

నిజానికి కోకాకోలాను ప్రారంభించింది శికంజి అమ్మే వ్యక్తి కాదు, అట్లాంటాకు చెందిన ఫార్మసిస్టు జాన్ పెంబర్టన్.

1886లో కోకో కోలా ఉత్పత్తి ప్రారంభమైంది. కోకా కోలా వెబ్‌సైట్ ప్రకారం, జాన్ పెంబర్టన్ తన ల్యాబ్‌లో సోడా కలిపిన నీటితో ఒక కొత్త రకం ద్రవాన్ని తయారు చేశారు. దానిని పరీక్షించడానికి పెంబర్టన్ కొంత మందికి రుచి చూపించగా, ఇచ్చిన వారందరికీ ఆ డ్రింక్ బాగా నచ్చింది. దీంతో ఆయన ఒక గ్లాస్ డ్రింక్‌ను ఐదు సెంట్లకు అమ్మడం ప్రారంభించారు.

పెంబర్టన్ వద్ద అకౌంటెంట్‌గా పని చేసే ఫ్రాంక్ రాబిన్‌సన్, ఆ ద్రవానికి కోకా కోలా అని పేరు పెట్టారు. నాటి నుంచి 132 రెండేళ్ల ఆ డ్రింక్‌ను కోకా కోలా అని పిలుస్తున్నారు. పేరులో రెండు C అక్షరాలు ఉంటే కంపెనీకి లాభమని రాబిన్‌సన్ భావించారు.

కోకా కోలాను ప్రారంభించిన మొదటి ఏడాది కేవలం తొమ్మిది గ్లాసులే విక్రయించారు. కానీ ఈరోజు అది రోజుకు 200 కోట్ల బాటిళ్ల చొప్పున అమ్ముడుపోతుంది. కోకా కోలాను రెండు దేశాలలో మాత్రమే విక్రయించడం లేదు. అవి - క్యూబా, ఉత్తర కొరియా. అయితే ఉత్తర కొరియాలో రహస్యంగా ఆ డ్రింక్‌ను విక్రయించే వారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ప్రపంచ యుద్ధంలో ఉపయోగపడిన కోకా కోలా

1900 నుంచి కోకా కోలా కంపెనీ ఆసియా, యూరప్‌లలో బాట్లింగ్ చేయడం ప్రారంభించింది. 2012లో ప్రచురించిన ఒక బీబీసీ నివేదిక ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కోకా కోలా కంపెనీ బాగా లాభపడింది. విదేశాలలో ఉండే అమెరికా సైనికులకు కోకా కోలాను అందించేవారు.

రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా 60 మిలటరీ బాట్లింగ్ యూనిట్లు ఉండేవి. యూరప్‌లో సంకీర్ణ బలగాల సుప్రీం కమాండర్ డ్వైట్ ఐసెన్‌ హోవర్‌కు కోకా కోలా అంటే ఇష్టమనేవారు.

'ఎ హిస్టరీ ఆఫ్ వాల్డ్ ఇన్ సిక్స్ గ్లాసెస్' రచయిత టామ్ స్టాండేజ్, కోకా కోలాను అమెరికా దేశభక్తితో ముడిపెట్టడం జరిగిందన్నారు. యుద్ధ సమయంలో దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, చక్కెర రేషనింగ్ నుంచి దానికి మినహాయింపు ఇచ్చారు.

కోకా కోలాకు ఎప్పుడు, ఎక్కడ వ్యతిరేకత ఎదురైంది?

అయితే కోకా కోలాకు పలు దేశాల్లో వ్యతిరేకత ఎదురైంది.

కోకా కోలాను హాని కలిగించే రసాయనాలతో తయారు చేస్తారనే వదంతులు కూడా వెలువడ్డాయి.

మొదట 1950లలో ఫ్రాన్స్ దానిని 'కోకా కోలనైజేషన్' అని పేరు పెట్టింది. ''నిరసనకారులు కోకా కోలా ఫ్రెంచి సమాజానికి ప్రమాదకరమని భావించేవాళ్లు. దాని వల్ల వచ్చే లాభాలు కమ్యూనిస్టు ప్రభుత్వం ఖజానాలోకి చేరుతుందనే భయంతో దానిని సోవియట్ యూనియన్‌లో మార్కెటింగ్ చేయలేదు'' అని స్టాండేజ్ తెలిపారు.

ఆ దేశంలో కోకా కోలా లేని లోటును పూడ్చిన పెప్సీ బాగా లాభపడింది.

1989లో బెర్లిన్ గోడ కూలిపోయినపుడు, తూర్పు జర్మనీలో నివసించే చాలా మంది మళ్లీ మళ్లీ కోకా కోలాను తాగారు. ''కోకా కోలా తాగడం స్వేచ్ఛకు ప్రతీకగా మారింది'' అని స్టాండేజ్ తెలిపారు.

సోవియట్ యూనియన్‌తో పాటు, మధ్యప్రాచ్యంలో కూడా కోకా కోలాకు వ్యతిరేకత ఎదురైంది. దానిని ఇజ్రాయెల్‌లో విక్రయిస్తుండడం వల్ల అరబ్ లీగ్ దానిని బహిష్కరించింది. దాంతో ఆ దేశాల్లో కూడా పెప్సీ బాగా అమ్ముడుపోయేది.

2003లో ఇరాక్‌పై అమెరికా చర్యకు నిరసనగా థాయ్‌లాండ్ ప్రజలు వీధుల్లో కోకా కోలాను పారబోశారు.

మాజీ ఇరాన్ ప్రధాని మహమూద్ అహ్మదీ నెజాద్ కూడా తాము కోకా కోలాను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వెనెజువెలాలో హ్యూగో చావెజ్ కూడా ప్రజలు కోకా కోలా, పెప్సీలు కాకుండా స్థానిక పళ్ల రసాలను తాగాలని సూచించారు.

రాహుల్ గాంధీ కోకా కోలా జ్ఞానంపై సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు

రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో #AccordingToRahulGandhi అనే హ్యాష్ ట్యాగ్‌ విస్తృతంగా ట్రెండ్ అవుతోంది.

అథీయిస్ట్ కృష్ణ అనే యూజర్ బీటిల్స్ కోకా కోలాను తాగుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసి - శికంజి తాగుతున్న బీటిల్స్ అని పోస్ట్ చేశాడు.

ద లయింగ్ లామా అనే మరో యూజర్ - సైఫ్ అలీ ఖాన్, ఆయనలాగే ఉన్న మరో వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, సైఫ్ ప్రముఖ నటుడిగా మారక ముందు పెట్రోల్ పంపులో పని చేసేవాడని రాశాడు.

మరో ట్విటర్ యూజర్, టెలిఫోన్ పోల్ ఎక్కిన జానీ లివర్ చిత్రాన్ని పోస్ట్ చేసి, రాహుల్ గాంధీ ప్రకారం ఇతనే గ్రాహం బెల్ అని ట్వీట్ చేశారు.

అంకుర్ అనే మరో యూజర్ నెహ్రూ ఏదో సందర్భంలో పెద్ద తలగడను పట్టుకున్న చిత్రాన్ని షేర్ చేస్తూ.. చంద్రుని మీదకు మొదటి రాకెట్‌ను పంపుతున్న నెహ్రూ అని పోస్ట్ చేశాడు.

మరో యూజర్ నిమ్మకాయలు అమ్ముతున్న యువకుని ఫొటో పెట్టి, గతంలో కోకా కోలా యజమాని అంటూ షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)