నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్(అర్బన్) నుంచి పోటీలో ఉన్న యామగంటి కన్నయ్య గౌడ్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరుగుతాయా, లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

21 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ అర్బన్ స్థానంలో ‘అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ’ అభ్యర్థిగా కన్నయ్య గౌడ్ నామినేషన్ వేశారు. ఆయన వయసు 30 ఏళ్లు.

నిజామాబాద్‌లో ఆయన కూరగాయల వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య, ఐదు నెలల కుమారుడు ఉన్నారు.

ఇటీవల కొత్తగా ఇల్లు కొన్నారు. మరో రెండు రోజుల్లో గృహప్రవేశం ఉందనగా అద్దెకు ఉంటున్న ఇంట్లో నవంబరు 18న కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారు.

కన్నయ్య మృతికి దారితీసిన పరిస్థితులను పోలీసులు తాజాగా వెల్లడించారు.

కన్నయ్య గౌడ్ ఎందుకు చనిపోయారు?

ఒక లోన్ యాప్ వేధింపుల వల్లే కన్నయ్య చనిపోయారని ఆయన కుటుంబ సభ్యుడు ప్రకాష్ బీబీసీ‌తో చెప్పారు.

‘‘మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసి వీడియో కాల్స్‌తో కన్నయ్యను వేధించారు. లోన్ యాప్‌లో కట్టాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు అడిగినట్టు ఫోన్ చూస్తే మాకు అర్థం అయింది. వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నాం. విచారణ కోసం కన్నయ్య సెల్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించాం’’ అని ఆయన తెలిపారు.

కన్నయ్య ఎన్నికల్లో పోటీచేస్తున్నాడని, నామినేషన్ వేసాడన్న విషయం ఆయన చనిపోయేంతవరకు తమకు తెలియదని ప్రకాష్ చెప్పారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పట్టణ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 292, 306, 384 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్-2008 సెక్షన్ 66-సి, 66-డి, 67-ఎ కింద కేసు నమోదు చేశారు.

‘‘అపరిచితులతో కన్నయ్య గౌడ్ మొదట వాట్సప్‌ చిట్ చాట్ చేశారు. ఆ తరువాత ఇరు వైపులా నగ్నంగా వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అపరిచిత వ్యక్తులు ఆ వీడియో కాల్స్ స్క్రీన్ రికార్డింగ్‌లను కన్నయ్య మొబైల్‌కు పంపి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పెడతామని వేధింపులకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్న తన పరువు పోతుందని కన్నయ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు’’ అని నిజామాబాద్ పోలీసులు తమ ప్రాథమిక విచారణ నివేదికలో వెల్లడించారు.

పోటీలో ఉన్న అభ్యర్థి చనిపోవడంతో నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఎన్నికలు కొనసాగుతాయా, లేదా అనే అంశంపై ఎన్నికల అధికారులతో, న్యాయవాదులతో బీబీసీ మాట్లాడింది.

వాయిదాపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెబుతోంది?

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉత్పన్నమయ్యే సందేహాలు, వివాదాలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 వివరిస్తుంది.

కాలానుగుణంగా ఈ చట్టానికి పలుమార్లు సవరణలు జరిగాయి.

ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థి ఏదైనా కారణం వల్ల మరణిస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ప్రజాప్రాతినిధ్య చట్టం చాప్టర్ -3 వివరిస్తోంది.

చాప్టర్ -3లోని సెక్షన్ 52 ప్రకారం- నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన ప్రక్రియలు ముగిసి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత, పోలింగ్ తేదీకి ముందే ఎవరైనా ‘గుర్తింపు పొందిన పార్టీ’ అభ్యర్థి మరణిస్తే, మరణానికి కారణంపై నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందిన పక్షంలో పోలింగ్ తేదీని వాయిదా వేయవచ్చు.

ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి తెలియ జేయాలి.

ఆ తర్వాత పోలింగ్ నిర్వహించే మరో తేదీని ప్రకటిస్తారు.

రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక అందిన తర్వాత భారత ఎన్నికల సంఘం సదరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఏడు రోజుల్లోపు మరో అభ్యర్థిని నామినేట్ చేయాలని నోటీస్ ఇస్తుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన పార్టీల వారు కాకపోతే..?

గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ‘రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు’ లేదా స్వతంత్ర అభ్యర్థి మరణించిన పక్షంలో ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో నిజామాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవ రావు బీబీసీతో చెప్పారు.

‘’1996లో ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు జరిగాయి. చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం, ఇతరులు అంటే రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు చనిపోతే ఎలక్షన్ వాయిదా పడదు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు.

గతంలో కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల కిడ్నాప్‌లు, ఆ తర్వాత హత్యలతో ఎన్నికలు తరచూ వాయిదా పడుతుండేవని ఆయన చెప్పారు.

‘‘ఎన్నికల కమిషన్ సూచన మేరకు 1996లో ఈ చట్టానికి పార్లమెంట్ సవరణలు చేసింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే ఆయన స్థానంలో ఆ పార్టీ వేరే అభ్యర్థిని నామినేట్ చేస్తుందే తప్ప తిరిగి నామినేషన్ ప్రక్రియ ఉండదు. మిగతా అభ్యర్థులు (అప్పటికే పోటీ పడే అభ్యర్థుల జాబితాలో ఉన్నవారు) అలాగే ఉంటారు’’ అని మాధవ రావు వివరించారు.

నిజామాబాద్ అర్బన్‌లో ఏం జరుగుతుంది?

యామగంటి కన్నయ్య గౌడ్ ఎన్నికల కమిషన్ వద్ద ‘గుర్తింపు పొందని’ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థి అని నిజామాబాద్ (అర్బన్ ) అసెంబ్లీ స్థానం రిటర్నింగ్ అధికారి మంద మకరందు బీబీసీతో చెప్పారు.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

“గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే పోలింగ్ వాయిదా వేయాల్సి ఉండేది. కానీ, అలా చేయడం లేదు. కన్నయ్య గౌడ్ ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి. ఆయన మరణించారనే విషయాన్ని భారత ఎన్నికల సంఘానికి నివేదించాం. తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి పోలింగ్ జరిగే విషయంలో ఎలాంటి సందిగ్ధతా లేదు. మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అని ఆయన బీబీసీకి వివరించారు.

అభ్యర్థి మరణంతో పోలింగ్ వాయిదా పడిన సందర్భాలు

అభ్యర్థి మరణించిన కారణంగా ఎన్నికలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి.

ఉదాహరణకు 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఆ ఎన్నికల్లో రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ గుండెపోటుతో మరణించడంతో పోలింగ్ వాయిదా వేశారు.

2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరాన్‌పూర్ స్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ నవంబర్ 12న మరణించారు. ఈ రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న పోలింగ్ జరగాలి.

కరాన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ వాయిదా వేసినట్లు రాజస్థాన్ ఎన్నికల అధికారి ఒకరు ధ్రువీకరించినట్లుగా ద హిందూ పత్రిక ప్రచురించింది.

బీఎస్‌పీ, కాంగ్రెస్ రెండూ గుర్తింపు పొందిన పార్టీలే కావడం గమనించాల్సిన విషయం.

ఇంకా ఎలాంటి సందర్భాల్లో పోలింగ్ వాయిదా వేస్తారు?

ప్రజా ప్రాతినిధ్య చట్టం చాప్టర్-4 సెక్షన్ 57, 58 ప్రకారం- ఘర్షణలు తలెత్తి పోలింగ్ నిర్వహించలేని సందర్భాల్లో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారి లేదా ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలింగ్‌ను వాయిదా వేసి, ఎన్నికల సంఘానికి విషయం తెలియజేయాలి.

బ్యాలెట్ బాక్స్‌లను చట్టవిరుద్ధంగా ప్రిసైడింగ్ అధికారి సంరక్షణ నుంచి ఎత్తుకెళ్లడం, ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ నిర్ధరణ జరిగిన సందర్భంలో, సాంకేతిక కారణాలతో ఈవీఎంలు పనిచేయని సమయాల్లో భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు మరో పోలింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఇలా పోలింగ్ నిర్వహించిన బూత్‌ల ఓట్లు కలిపిన తర్వాతే మిగతా ఓట్లను లెక్కించాలని నిబంధనలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)