కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ఈసారి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు కీలక అభ్యర్థులు రెండేసి నియోజకవర్గాలలో పోటీ పడుతున్నారు.

పాలక బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన సిటింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ ఈసారి పోటీ చేస్తున్నారు.

పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. దాంతోపాటు గత ఎన్నికలలో తాను ఓటమి పాలైన కొడంగల్ నుంచి మరోసారి బరిలో నిలిచారు.

బీజేపీకి చెందిన బీసీ నేత ఈటల రాజేందర్ తన సిటింగ్ స్థానం హుజూరాబాద్‌లో పోటీ చేస్తుండడంతో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు.

ఈ ముగ్గురు నేతలూ తమ రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయడం ఇదే తొలిసారి.

కేసీఆర్ 2014 ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గం, రెండోది పార్లమెంట్ నియోజకవర్గం.

ఆ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు.

తెలుగు రాష్ట్రాలలో ఇంతకుముందు పవన్ కల్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్, పీవీ నరసింహారావు కూడా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ పడ్డారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరంల నుంచి పోటీ పడ్డారు. అయితే, రెండు చోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు.

అయితే, తిరుపతిలో విజయం సాధించిన ఆయన పాలకొల్లులో ఓడిపోయారు.

ఎన్టీఆర్ రెండుసార్లు..

ఎన్టీఆర్ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్లగొండ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.

మూడు చోట్లా గెలిచిన ఆయన నల్లగొండ గుడివాడ స్థానాలను వదులుకుని హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు.

ఆ తరువాత 1989 ఎన్నికలలో ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలలో ఎన్టీఆర్ పోటీ చేశారు.

కానీ, కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు.

రావి నారాయణ రెడ్డి రెండు చోట్ల.. పెండ్యాల మూడు చోట్ల

కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ, భువనగిరి శాసనసభ స్థానానికి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచిన ఆయన అసెంబ్లీ స్థానాన్ని వదులుకుని నల్గొండ లోక్‌సభ స్థానంలో కొనసాగారు.

అదే ఎన్నికల్లో మరో కమ్యూనిస్ట్ నాయకుడు పెండ్యాల రాఘవరావు ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడుచోట్లా గెలిచారు.

వరంగల్‌ లోకసభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభా స్థానాలకు పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అన్ని చోట్లా విజయం సాధించారు.

వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కాళోజీ నారాయణపై ఆయన గెలిచారు. అసెంబ్లీ స్థానాలను వదులుకుని వరంగల్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

ఆ సీఎంలూ అంతే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కాదు గతంలో వేర్వేరు రాష్ట్రాల సీఎంలు ఇలా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీచేసిన సందర్భాలున్నాయి.

కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం కుమారస్వామి రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి పోటీచేశారు.

అందులో బాదామిలో విజయం సాధించి, చాముండేశ్వరిలో ఓటమి పాలయ్యారు.

కుమారస్వామి ఆ ఎన్నికలలో చెన్నపట్న, రామనగర నియోజకవర్గాల నుంచి పోటీచేశారు.

రెండు చోట్లా గెలిచిన ఆయన రామనగర స్థానాన్ని వదులుకుని చెన్నపట్నకు ప్రాతినిధ్యం వహించారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా 2019లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఆంధ్ర, ఒడిశాల నుంచి పోటీ చేసిన పీవీ నరసింహారావు

1991లో ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు అప్పటికి పార్లమెంటు సభ్యుడిగా లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో తమ పార్టీ నుంచి గెలిచిన గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పీవీని పోటీ చేయించింది.

ఉప ఎన్నికలలో గెలిచిన పీవీ ఆ తరువాత 1996 ఎన్నికలలో నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం లోక్‌సభ సీటు నుంచి కూడా పోటీ చేశారు.

రెండు చోట్లా గెలిచిన ఆయన నంద్యాల విడిచిపెట్టి బరంపురానికి ప్రాతినిధ్యం వహించారు.

వీరే కాదు.. లోక్‌సభ విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అటల్ బిహారీ వాజపేయీ, ఎల్‌కే అడ్వాణీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి అనేక మంది నేతలు ఒకే ఎన్నికలలో రెండేసి స్థానాల నుంచి బరిలో నిలిచారు.

వీరిలో మోదీ, రాహుల్, సోనియా, అడ్వాణీ, ఇందిర, ములాయంలు పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు.

లాలూ ఒక చోట గెలిచి మరోచోట ఓడిపోయారు.

వాజపేయీ మూడు చోట్ల పోటీ చేయగా ఒక స్థానంలో గెలిచి రెండు స్థానాలలో ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)