తెలంగాణ ఎన్నికలు: స్పీకర్‌గా చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదా... పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తారా?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్పీకర్‌‌గా పని చేస్తే ఇక ఖేల్ ఖతం. గెలిచే ముచ్చటే లేదు.

ఇది తెలుగునాట బలంగా వినిపించే మాట.

చరిత్ర చూసుకోండి సార్ అంటారు దాన్నో సెంటిమెంటుగా నమ్మేవాళ్లు. రెండు దశాబ్దాలుగా స్పీకర్‌గా పనిచేసిన వారు మళ్లీ గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి సెంటిమెంట్లు రాజకీయాల్లో రాజ్యమేలుతూనే ఉంటాయి.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి అదే చర్చ నడుస్తోంది. ప్రస్తుత తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఏంటి? అనే చర్చ జోరందుకుంది.

ఎన్నికలు వచ్చాయంటే ఇలాంటి సెంటిమెంట్లకు కొదవ ఉండదు.

ఫలానా నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటూ, అందుకు ఏవో ఉదాహరణలు చూపిస్తారు. ఫలానా ఊరి పర్యటనకు పోయినోళ్లు గెలవరు అని ఇంకోటి చెబుతారు. ఆ కోవలోది, అంతకంటే బలమైనది, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన నేతలు మరుసటి ఎన్నికల్లో ఓడిపోవడం.

గత రెండు దశాబ్ధాలుగా తెలుగునాట ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

అసెంబ్లీకి స్పీకర్‌గా పనిచేసిన నాయకులు మరుసటి ఎన్నికల్లో బరిలో నిలవకపోవడమో, లేదా పోటీ చేసినా ఓడిపోవడమో జరుగుతోంది.

అంటే, ఆ తర్వాత శాసనసభలో అడుగు పెట్టడంలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభాభారతి నుంచి మొదలుకుని ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

వచ్చే నెలలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఈ సంప్రదాయం మారుతుందా లేదా చూడాలి.

కావలి ప్రతి‌భా భారతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొట్టమెదటి మహిళా స్పీకర్ ప్రతిభాభారతి.

1999లో టీడీపీ ప్ర‌భుత్వం ఏర్పడిన తర్వాత ఆమె స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిభా భారతిని స్పీకర్‌గా నామినేట్ చేశారు. ఐదేళ్లపాటు ఆమె ఆ పదవిలో కొనసాగారామె.

తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆమెను విజయం వరించలేదు.

2009, 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు.

కేఆర్ సురేష్ రెడ్డి

ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యస‌భ సభ్యుడిగా ఉన్నారు.

1989 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిచారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా సురేష్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. 2009 వరకు ఐదేళ్లపాటు ఆయన స్పీకర్‌గా ఉన్నారు.

ఆ తర్వాత జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలేటి అన్నపూర్ణ చేతిలో సురేష్ రెడ్డి పరాజయం చవిచూశారు. 2014 ఎన్నికల్లోనూ విజయం దక్కలేదు.

2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2020లో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

స్పీకర్లుగా పనిచేసిన వ్యక్తులు మరుసటి ఎన్నికల్లో ఓడిపోవడం యాదృచ్ఛికం అన్నారు కేఆర్ సురేష్ రెడ్డి.

ఈ విషయంపై బీబీసీతో ఆయన మాట్లాడారు.

‘‘స్పీకర్లుగా పనిచేసిన వ్యక్తులు మరుసటి ఎన్నికల్లోఓడిపోవడం జరుగుతోంది. ఈ విషయం ప్రత్యేకమైనదే కావొచ్చు. కానీ అది అలా జరుగుతోంది అంతే.

నా వి‌షయంలో బాల్కొండ నుంచి వరుస విజయాలుసాధించాను. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో నియోజకవర్గం మారాల్సి వచ్చింది. అప్పట్లో నేను ఆర్మూర్ నియోజకవర్గానికి కొత్తగా వెళ్లడంతోపాటు తక్కువ సమయమే ఉండటంతో మళ్లీ విజయం సాధించలేకపోయాను’’ అని చెప్పారు.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి.

ఆయన సీఎం కాకమునుపు 2009లో పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే 1989, 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం నుంచి గెలిచారు.

2009లో గెలిచిన తర్వాత స్పీకర్‌గా నియమితులయ్యారు.

అదే ఏడాది, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ వెంటనే కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

అనంతరం 2010 నవంబర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఎన్నికలలో నిలిచి గెలవలేదు. 2014 ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు.

ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా పీలేరు నుంచి తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా బరిలో దింపారు. కిషోర్ కుమార్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

2023 ఏప్రిల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.

స్పీకర్‌గా పని చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసింది లేదు.

నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు.

2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా పనిచేశారు.

అంతకుముందు 2004, 2009లో తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమితులయ్యారు.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్‌లో స్పీకర్‌గా నియమితులయ్యారు.

ఏపీ వి‌భజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫునతెనాలి నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు.

2018 అక్టోబర్‌లో ఆయన జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో తెనాలి నియోకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం గెలవలేదు.

రాష్ట్ర విభజన తర్వాత..

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వి‌భజన జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది.

తెలంగాణ విషయానికి వస్తే.. మొదటి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు. అలాగే, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు నియమితులయ్యారు.

సిరికొండ మధుసూదనాచారి

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ ఈయన.

ఆయన 2014లో జరిగిన ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్మేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

టీఆర్ఎస్ తరఫున గెలిచిన మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్‌గా నియమితులయ్యారు.

2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోయారు.

తర్వాత 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన్ను ప్రభుత్వం నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

స్పీకర్‌గా పనిచేసిన తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో మాత్రం మధుసూదనాచారికి ఓటమి తప్పలేదు.

ఏపీలో కోడెల శివప్రసాదరావు

రాష్ట్ర పునర్విభజన తర్వాత 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసిన కోడెల, వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమిపాలయ్యారు.

2019 సెప్టెంబర్‌లో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.

1983లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు కోడెల శివప్రసాద రావు. తర్వాత జరిగిన 1985, 1989, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1995, 1999లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనూ వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.

అయితే, స్పీకర్‌గా పనిచేసిన అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయమే పలకరించింది.

పోచారం పరిస్థితేంటి?

తెలంగాణలో 2023 నవంబరు ౩౦న ఎన్నికలు జరగబోతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జనవరిలో అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు.

అంతకుముందు 2014లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్‌లో వ్యవవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి బాన్సువాడ నుంచి బరిలో నిలిచారు.

స్పీకర్‌గా పోటీ చేస్తే మరుసటి ఎన్నికల్లో ఓడిపోతారనే సంప్రదాయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేస్తారని చెప్పారు మాజీ స్పీకర్, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి.

‘‘ఈసారి స్పీకర్ ఓటమి సంప్రదాయం మారుతుందని భావిస్తున్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచి కొత్త రికార్డు నెలకొల్పుతారు’’ అని సురేష్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)